
కథలాపూర్ (వేములవాడ): అప్పుల బాధ తాళలేక గల్ఫ్ బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెడిమెల్లి ప్రకాశ్ (42) ఉపాధి నిమిత్తం గతంలో మూడుసార్లు గల్ఫ్ వెళ్లాడు. ఇందుకోసం సుమారు రూ.6 లక్షల వరకు అప్పులు చేశాడు.
గల్ఫ్‌లో సరైన ఉపాధి లభించక తిరిగి స్వగ్రామం చేరుకున్నాడు. అప్పులు పెరిగిపోవడంతో తనకున్న మూడెకరాల వ్యవసాయ భూమి అమ్మేశాడు. అయినా అప్పులు తీరలేదు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. అప్పులు ఇచ్చినవారి వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెంది ఉదయం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.