అరబ్ గల్ఫ్ దేశాలలో కేరళ రాష్ట్రవాసులు (మళయాళీలు) లేని సంస్థ దాదాపు ఉండదని చెప్పవచ్చు. వంద శాతం అక్షరాస్యత, ఎంత దూరమైనా వలసవెళ్లి జీవించే తత్వంతో వారికి గల్ఫ్‌లో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. కేరళ మైగ్రేషన్ సర్వే ప్రకారం 22 లక్షల మంది మలయాళీలు విదేశాలలో ఉన్నారు. వీరిలో 90 శాతం గల్ఫ్ దేశాలలోనే నివసిస్తున్నారు. అంతర్గత, అంతర్జాతీయ ప్రవాసుల సమస్యలను ఆకళింపు చేసుకున్న కేరళ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే వినూత్నమైన ప్రవాసీ సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. 1996 డిసెంబర్ 6న కేరళ రాష్ట్ర ప్రభుత్వం డిపార్టుమెంట్ ఆఫ్ నాన్ రెసిడెంట్స్ కేరలైట్స్ అఫైర్స్ (నోర్కా) అనే సంస్థను స్థాపించింది. ‘నోర్కా’ డిపార్టుమెంటు ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ‘నోర్కా రూట్స్’ అనే ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేశారు. భారత దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఉన్న, విదేశాలలో ఉన్న కేరళ ప్రవాసుల సమస్యల పరిష్కారానికి, వారితో స్థిరమైన భాగస్వామ్యానికి ‘నోర్కా’ ఏర్పాటు చేశారు. ప్రవాసుల సంక్షేమం కోసం ఇలాంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం భారతదేశంలోనే ప్రథమం.
351 మంది సభ్యులతో ‘లోక కేరళ సభ’
నూతనంగా ఏర్పాటు చేసిన ‘లోక కేరళ సభ’ (ప్రపంచ కేరళ వేదిక) తొలి సమావేశాలు ఈనెల 12, 13న కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగాయి. ముఖ్యమంత్రి పి.విజయన్ ఈ సమావేశాలను ప్రారంభించారు. ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రవాస భారతీయులు, ఇతర రాష్ట్రాలలో నివసిస్తున్నవారు, శాస్త్రవేత్తలు, మేధావులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న కేరళీయులను మాతృభూమి కేరళతో సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ, ఆర్థికంగా అనుసంధానపరిచే యోచనతో 351 మందితో కూడిన ‘లోక కేరళ సభ’ (ఎల్‌కేఎస్)ను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసింది. ప్రవాసీ కేరళీయులు కష్టాలను, ఆకాంక్షలను తెలుపుకోవడానికి, వారి నైపుణ్యాన్ని, అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధికి వాడుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది.
ప్రవాసీ గుర్తింపు కార్డు, ఇన్సూరెన్స్
ప్రవాసీ కేరళీయులకు ‘ప్రవాసీ గుర్తింపు కార్డు’ ఇచ్చే పథకం ఆగస్టు 2008లో ప్రవేశపెట్టారు. విదేశాల్లో కనీసం ఆరు నెలలు నివాసం ఉండి, 18 ఏళ్ల వయస్సు పైబడిన వారికి మూడేళ్లు చెల్లుబాటు అయ్యేట్లుగా కార్డులు జారీ చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300. ది న్యూ ఇండియా అస్సూరెన్స్ కంపెనీ రూ.2 లక్షల ప్రమాద బీమా కల్పిస్తుంది. కనీసం ఐదేళ్లపాటు నెలనెలా పొదుపు చేసుకుని.. 60 ఏళ్ళు నిండినవారు పెన్షన్‌కు అర్హులు. సభ్యుడు చనిపోయిన తర్వాత జీవిత భాగస్వామికి కుటుంబ పెన్షన్ వస్తుంది. అనారోగ్యం లేదా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందుతుంది. తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు, ఆడపిల్లల పెళ్లికి, మహిళా సభ్యుల ప్రసూతికి ఆర్థికసాయం అందిస్తారు. అదేవిధంగా నివాస గృహాల నిర్మాణానికి, కొనుగోలుకు, ఖాళీ స్థలాల కొనుగోలుకు రుణ సౌకర్యం కల్పిస్తారు. పిల్లల చదువుకు (ఉన్నత విద్యతో సహా), శాశ్వత అంగవైకల్యం వలన విధులు నిర్వర్తించలేని వారిని ఆదుకుంటారు. 60 ఏళ్ళు నిండిన తర్వాత అంతర్జాతీయ ప్రవాసులు నెలకు రూ.ఒక వెయ్యి నుంచి రెండు వేలు, అంతర్గత ప్రవాసులు రూ.500 నుంచి రూ.ఒక వెయ్యి వరకు పెన్షన్ ఇస్తారు. సభ్యుడు మరణిస్తే వారసులకు అందులో సగం చెల్లిస్తారు.
వివిధ పథకాల అమలులో ఆదర్శం
నోర్కా లక్ష్యాల్లో కొన్ని..
ప్రవాసీ కేరళీయుల సంక్షేమం, విదేశాల్లో ఉన్నవారితో, రాష్ట్రంలో ఉన్నవారితో సాంస్కృతిక మార్పిడి, సాంఘిక భద్ర తకు యంత్రాగం ఏర్పాటు. అవసర మున్నవారిని ఆదుకోవడానికి సహాయ నిధి ఏర్పాటు, వార్షిక సదస్సులు ఏర్పాటు చేయడం, వాపస్ వచ్చినవారికి పునరావాస, పునరేకీకరణ కార్యక్రమాలు, ఉద్యోగ ప్రణాళిక, నైపుణ్య శిక్షణ, అభివృద్ధి, విశిష్ట నైపుణ్యం కలిగినవారితో మానవ వనరుల సమూహాన్ని ఏర్పాటు చేయడం, ఉద్యోగార్థుల, ఎన్నారైల డేటా బ్యాంకు (సమాచార నిధి) ఏర్పాటు, రాష్ట్రానికి పెట్టుబడులను సేకరించడం, అక్రమ రిక్రూటింగ్ ఏజెన్సీలను నియంత్రించడం.
నోర్కా రూట్స్ సేవలు ఇలా..
విదేశాల్లో 46 ప్రవాసీ మలయాళీ సంఘాలు, ఇతర రాష్ట్రాలలో కూడా కొన్ని సంఘాలు నోర్కా గుర్తింపు పొందాయి. రెండేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలి. ఒక రోజు ప్రి డిపార్చర్ ఓరియెంటేషన్ ట్రైనింగ్ (పీడీఓటీ) ఇస్తారు. దీంట్లో ప్రయాణ ముందస్తు పరిస్థితులు విదేశాలలో ఉండే విధానాలపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తు న్నారు. విదేశాల నుంచి వాపస్ వచ్చినవారు స్వస్థలాలలో స్థిరపడటానికి నోర్కా రూట్స్ సంస్థ పునరావాస కార్యక్రమాలను చేపడుతున్నది. రూ.20 లక్షల విలువైన ప్రాజెక్టులకు 15 శాతం పెట్టుబడి రాయితీ, వడ్డీలో 3 శాతం రాయితీ కల్పిస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పాలనుకునే ఔత్సాహికులకు తగిన అవగాహన, శిక్షణ కల్పిస్తు న్నారు. ప్రవాసీలు వారి మాతృభూమి అభివృద్ధిలో పాలుపంచు కోవడానికి మై విలేజ్ – మై డ్రీమ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు.
కేరళ ప్రవాసీ వెల్ఫేర్ బోర్డు
కేరళ ప్రభుత్వం ‘ది నాన్ రెసిడెంట్ కేరలైట్స్ వెల్ఫేర్ యాక్ట్ 2008’ను తెచ్చింది. ఈ చట్టం పరిధిలో ‘నాన్ రెసిడెంట్ కేరలైట్స్ వెల్ఫేర్ బోర్డు’ ఏర్పాటైంది. దీనిని కేరళ ప్రవాసీ వెల్ఫేర్ బోర్డు, ప్రవాసీ వెల్ఫేర్ ఫండ్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. విదేశాలలో కనీసం రెండేళ్లపాటు పనిచేసి వాపస్ వచ్చినవారు ఇందులో సభ్యత్వం తీసుకోవచ్చు. పెన్షన్, కుటుంబ పెన్షన్, వైద్య సహాయం, ఎక్స్‌గ్రేషియా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఈ చట్టంలో పొందుపర్చారు. వెల్ఫేర్ ఫండ్‌లో 2.25 లక్షల మంది పైగా సభ్యులున్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం 15 మంది సభ్యుల తో కేరళ ప్రవాసీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ బోర్డులో ఐదుగు రు ఎన్నారైలు (కువైట్, సౌదీ, యూఏఈ, ఒమన్, ఖతార్ దేశాల నుంచి ఒక్కొక్కరు), ఇద్దరు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినవారు, కార్మిక, ఆర్థిక, న్యాయ శాఖల అధికారులు, రిక్రూటింగ్ లైసెన్సులు కలిగిన ఓవర్సీస్ డెవలప్‌మెంట్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రమోషన్ కౌన్సిల్ – ఒడెపెక్, నోర్కా రూట్స్ అనే రెండు ప్రభుత్వరంగ సంస్థల అధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ చిత్ర దర్శకుడు, కైరళి టీవీలో ప్రవాసలోకం అనే కార్యక్రమ వ్యాఖ్యాత పి.టి.కుంజు మహ్మద్ ను చైర్మన్‌గా నియమించారు. కేరళ ప్రవాసీ సంక్షేమ బోర్డులో 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపువారు చేరడానికి అర్హులు. సభ్యులు విదేశాల్లో ఉన్నప్పుడు నెలకు రూ.300, ఇండియాకు వాపస్ వచ్చిన తర్వాత నెలకు రూ.100 పొదుపు చేయాలి. ఇతర రాష్ట్రాలలో ఉన్నవారు నెలకు రూ.100 పొదుపు చేయాలి. విదేశాలలో ప్రస్తుతం పనిచేస్తున్నవారు, విదేశాల నుంచి వాపస్ వచ్చినవారు, ఇతర రాష్ట్రాలలో నివసిస్తున్నవారు, ఇతర రాష్ట్రాల నుంచి కేరళకు వాపస్ వచ్చినవారు అనే నాలుగు రకాల సభ్యత్వాలు ఉన్నాయి. ఇండియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకుల ద్వారా రూ.200 చెల్లించి సభ్యులుగా చేరవచ్చు.
స్వాంతన
ప్రవాసీ కేరళీయులు విదేశాల నుంచి వాపస్ వచ్చి కష్టాల్లో ఉంటే వారిని ఆదుకోవడానికి ‘స్వాంతన’ ఆర్థిక సహాయ పథకం ప్రవేశపెట్టారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న, దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) కుటుంబాలను ఈ పథకం ద్వారా ఆదుకుంటారు. రిటర్నీలు (వాపస్ వచ్చినవారు), వారి కుటుంబ సభ్యులకు నాలుగు రకాలుగా సహాయం చేస్తారు. రిటర్నీలు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వైద్య చికిత్స ఖర్చులు అందిస్తారు. కుటుంబ సభ్యులు మరణించినప్పుడు సహాయం చేస్తారు. కనీసం రెండు సంవత్సరాలు విదేశాల్లో గానీ, రాష్ట్రం బయటగానీ నివసించినవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వారు పనిచేసిన కాలం కానీ, 10 సంవత్సరాలు కానీ ఏది తక్కువైతే అది వర్తిస్తుంది. వార్షి క ఆదాయం ఒక లక్ష రూపాయల లోపు ఉండాలి. సహాయం కోసం దరఖాస్తు చేసేనాటికి ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ పథకం వర్తించదు. ఎక్స్‌గ్రేషియా లక్ష రూపాయ లు. క్లిష్టమైన పరిస్థితులలో వైద్య సహాయం రూ.50 వేలు (కాన్సర్, గుండె, మూత్ర పిండా లు, పక్షవాతం, ప్రమాదాలలో తీవ్రమైన అంగ వైకల్యం). ఇతర రకాల చికిత్సకు రూ.20 వేలు, పెళ్లి ఖర్చులకు 15 వేలు, కృత్రిమ అవయవాలకు రూ.10 వేలు అందిస్తారు.
కారుణ్యం
మృతదేహాలను కేరళకు చేర్చడానికి ‘కారుణ్యం’ పేరిట ఒక నిధిని ఏర్పాటు చేశారు. శవాల తరలింపునకు విదేశాల నుంచి రూ.50 వేలు, ఇతర రాష్ట్రాల నుంచి రూ.15 వేలు సహాయం చేస్తారు. చట్టబద్ధమైన ప్రవాసులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. కంపెనీ నుంచి, ఇండియన్ ఎంబసీ నుంచి ఎలాంటి సహాయం అందని పరిస్థితులలో మాత్రమే ఈ పథ కం వర్తిస్తుంది. సర్టిఫికెట్ అటెస్టేషన్ ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతం చైర్మన్ ఫండ్‌కు జమచేస్తారు. స్వాంతన లాంటి ఎలాంటి పథకాలలో లబ్ధిచేకూరని వారు చైర్మన్ ఫండ్ ద్వారా సహాయం పొందవచ్చు. ఈ పథకాలే కాకుండా ఎస్పీ స్థాయి అధికారి పర్య వేక్షణ లో కేరళ పోలీస్ ఎన్నారై సెల్ పనిచేస్తుంది. ప్రవాసీ కేరళీయులు తమ ఫిర్యాదుల ను కేరళ పోలీస్ ఎన్నారై సెల్ spnri.pol@kerala.gov.inకు పంపవచ్చు.
(మంద భీంరెడ్డి, అధ్యక్షులు, ప్రవాసీ మిత్ర email: mbreddy.hyd@gmail.com)
సౌదీలో హెల్ప్‌లైన్
సౌదీ అరేబియాలో నివసించే ప్రవాస భారతీ యులకు సహాయం, సలహాల కోసం రియాద్‌లోని ఇండియన్ ఎంబసీ టోల్ ఫ్రీ నెంబర్ 800–247–1234 కు కాల్ చేయవచ్చు. భారత్‌లో ఉన్నవారు 00966–11–4884697 కు కాల్ చేయాలి. కాన్సులార్ టూర్‌లో భాగంగా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది ఈ నెల 23, 26 తేదీలలో జుబెల్ పట్టణంలోని విఎస్‌ఎఫ్ సెంటర్‌లో ఎన్నారైలను కలుసుకుంటారు. ఎన్నారైలు పాప్‌పోర్ట్, దౌత్య సంబంధ సేవలు గురించి, వేతనాలు తదితర సమస్యల గురించి అధికారులకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
లేబర్ క్యాంపుల్లో అవగాహన
యూఏఈ దేశంలోని అబుదాబి, దుబాయి, షార్జా తదితర ప్రాంతాల లోని లేబర్ క్యాంపులలో ‘భారతీ య కార్మికుల వనరుల కేంద్రం’ (ఇండియన్ వర్కర్స్ రీసోర్స్ సెంటర్ – ఐడబ్ల్యూఆర్‌సీ) వారు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు. టెలిఫోన్ కాల్స్ కుంభకోణంలో చిక్కుకోకుండా సిమ్ కార్డులను జాగ్రత్తపర్చు కోవాలని, స్థానిక చట్టాలను పాటించాలని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు కార్మి కులకు సూచిస్తున్నారు. మానసిక ఒత్తిడి, ఆర్థిక క్రమశిక్షణ గురించి కూడా వివరిస్తున్నారు. కార్మి కుల పలురకాల ప్రశ్నలకు జవాబులిస్తున్నారు. ప్రతి కార్యక్రమాన్ని ఫేస్‌బుక్ లైవ్‌లో చూపిస్తున్నారు. సలహాల కోసం 800 4632 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్‌చేయ వచ్చు. మరిన్ని వివరాలకు http://iwrcuae.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment