త్రిసూర్: ఇసాక్ ఇస్మాయిల్కు ఇప్పుడు 39 ఏళ్లు. పొలంలేని, ఇల్లు నడవని పరిస్థితుల్లో కొన్నేళ్ల కిందట తల్లి, భార్య, పిల్లల్ని వదిలి, పొట్ టచేతపట్టుకుని పనికోసం గల్ఫ్ వెళ్లాడు... కష్టపడ్డాడు. తాను తిన్నా తినకున్నా ఇంటికి మాత్రం ఠంచనుగా డబ్బు పంపేవాడు. కుటుంబం కుదురుకుంది. ఇక సొంత ఊళ్లోనే బతకొచ్చనే నమ్మకంతో ఇంటిబాటపట్టాడు. ఇస్మాయిల్ను రిసీవ్ చేసుకునేందుకు కుటుంబమంతా ఎయిర్ పోర్టుకు వెళ్లింది. ఆలింగనాల తర్వాత అందరూ కలిసి ఇంటికి బయలుదేరారు. ఆనందభాష్పాలు ఆరిపోకముందే ఆ కుటుంబంలో నలుగురి ప్రాణాలు ఆవిరైపోయాయి.
కేరళలోని త్రిసూర్ జిల్లా పుతుక్కాడ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇస్మాయిల్ కుటుబంతోపాటు డ్రైవర్ కూడా దుర్మరణం చెందారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారి కారు, ఓ మూల మలుపు వద్ద అదుపుతప్పి లోతైన నీటిగుంటలో పడిపోయింది.
ఈ ఘటనలో ఇస్మాయిల్ సహా అతని తల్లి హొవమ్మ(58), భార్య హఫ్సాత్ (32), కూతురు ఇర్ఫానా (3)లతోపాటు బావమరిది మన్సూర్(42), డ్రైవర్ కృష్ణప్రసాద్(36) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్నపోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని, ఇస్మాయిల్ కొడుకు హయాస్(10)ను మాత్రం కాపాడగలిగారు. తీవ్రంగా గాయపడ్డ హయాస్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.