వరదలకు దెబ్బతిన్న కేరళ
న్యూఢిల్లీ : భారీ వర్షాలతో ముంచెత్తిన వరదలతో కొట్టుమిట్టాడుతున్న కేరళను ఆదుకోవడం కోసం యూఏఈ రూ.700 కోట్ల విరాళం ప్రకటించిందని.. దాన్ని కేంద్రం తిరస్కరించిందని.. కానీ అసలు యూఏఈ విరాళమే ప్రకటించలేదని... ఇలా వార్తలు మీద వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వరదల సమయంలో వచ్చిన ఈ విరాళం పక్కన పెడితే, కేరళకు యూఏఈ నుంచి భారీ ఎత్తునే సంపద వస్తుంది. అది ఎలా అనుకుంటున్నారా? రెమిటెన్స్‌ల రూపంలో. కేరళకు, యూఏఈకు చాలా ఏళ్ల నుంచే అవినాభావం సంబంధం ఉంది. కేరళ నుంచి వలస వెళ్లిన వారు ఎక్కువగా యూఏఈలోనే స్థిరపడ్డారు. అక్కడ సేవా రంగంలో కేరళ వారిదే ఆధిపత్యం.
కేరళ మైగ్రేషన్ సర్వే రిపోర్టు ప్రకారం 36 లక్షల మందికి పైగా కేరళవాసులు యూఏఈలో నివసిస్తున్నట్టు తెలిసింది. యూఏఈలో మాత్రమే కాక, అటు ఖతర్‌లోనూ కేరళవాసులు నివసిస్తున్నారు. యూఏఈలో 41.5శాతం, ఖతర్‌లో 8.5 శాతం కేరళవాసులే. దీంతో విదేశాల నుంచి కేరళకు భారీ ఎత్తునే రెమిటెన్స్‌లు వస్తున్నాయి. కేరళకు, ఇటు దేశ ఆర్థిక వ్యవస్థకు రెమిటెన్స్‌లు ఎంతో కీలకం. మైగ్రేషన్ అండ్ డెవలప్‌మెంట్‌పై వరల్డ్ బ్యాంక్ రూపొందించిన రిపోర్టులో, 2017లో ఇన్‌వర్డ్ రెమిటెన్సస్(దేశానికి వస్తున్న చెల్లింపుల్లో)లో ప్రపంచంలోనే భారత్ టాప్‌లో ఉందని వెల్లడైంది. 2017లో దాదాపు 69 బిలియన్ డాలర్లు అంటే రూ.4,82,827 కోట్ల రెమిటెన్స్‌లో భారత్‌కు వచ్చాయి. ఇవే భారత జీడీపీలో 3 శాతంగా ఉన్నాయి. వీటిలో ఎక్కువగా కూడా కేరళకే వచ్చాయని బిజినెస్ టుడే నివేదించింది.
కేరళకు మొత్తం రెమిటెన్స్‌లో 40 శాతం రాగ, ఆ తర్వాత పంజాబ్‌కు 12.7 శాతం, తమిళనాడుకు 12.4 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 7.7 శాతం, ఉత్తరప్రదేశ్‌కు 5.4 శాతం రెమిటెన్స్‌లు వచ్చినట్టు తెలిసింది. రీసెర్చ్ పేపర్ ప్రకారం, కేరళకు వచ్చే రెమిటెన్స్‌లు ఆ రాష్ట్ర జీడీపీలో 36 శాతం ఉన్నట్టు వెల్లడైంది. మొత్తం కేరళకు వచ్చే రెమిటెన్స్‌ల విలువ సుమారు రూ.90వేల కోట్లని తెలిసింది. ఇవన్నీ గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నాయని రిపోర్టులు తెలిపాయి. కేరళ నుంచి వలసపోయి యూఏఈలో నివసించే బ్లూకాలర్ వర్కర్లు, ప్రొఫిషినల్స్ నుంచి ఇవి ఎక్కువగా వస్తున్నాయని రిపోర్టులు పేర్కొన్నాయి. అంతేకాక, విదేశాల్లో నివసించే కేరళవాసులు ఎక్కువగా ఇక్కడ బంగారం, భూమిపై పెట్టుబడి పెడుతూ ఉంటారు. ప్రవాస మలయాళీల డిపాజిట్లు రూ.1.5 లక్షల కోట్లకు పైమాటేనని తెలిసింది.
రెమిటెన్స్ రూపంలో కేరళ పొందే మొత్తంలో 20 శాతం, బ్యాంక్ అకౌంట్లలోకి డిపాజిట్లు, సేవింగ్స్ రూపంలో వస్తున్నాయని ఆర్‌బీఐ సర్వే రిపోర్టు కూడా వెల్లడించింది. దేశంలో అత్యధిక నిరుద్యోగ నిష్పత్తి కలిగిన రాష్ట్రంగా ఉన్న కేరళకు, అధిక ఆదాయం యూఏఈ, గల్ఫ్ దేశాల నుంచే వచ్చే రెమిటెన్స్‌ల రూపంలోనే వస్తుందని పలు రిపోర్టులు వెల్లడించాయి. అత్యధిక నిరుద్యోగ నిష్పత్తి ఉన్నప్పటికీ, కేరళ తలసరి ఆదాయం సుమారు 60 శాతం అధికంగా ఉంటుంది. ఇదంతా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఆదాయం మహిమనే అని చెప్పుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment