ఎడారిలో ఆకలికేకలు.. | Hunger in the desert .. | Sakshi
Sakshi News home page

ఎడారిలో ఆకలికేకలు..

Published Mon, Mar 12 2018 9:56 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

Hunger in the desert .. - Sakshi

గల్ఫ్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులు

పొట్ట చేతపట్టుకుని దేశందాటి వెళ్లారు.. కష్టం చేసి ఎదుగుదామనుకున్నారు. కాని తాము దిగిన కంపెనీలో జరుగుతున్న మోసాన్ని చూసి తట్టుకోలేక ప్రశ్నించారు. దీంతో సదరు కంపెనీ మీ బాధ్యత మాది కాదంటూ చేతులెత్తేయడంతో దిక్కులేని స్థితిలో పడ్డారు. తిండి లేదు.. డబ్బులేదు. దిక్కతోచని స్థితిలో దుబాయ్‌లోనే కాలం వెళ్లదీస్తున్నారు. దుబాయ్‌లోని షార్జాలో సుమారు 70మందికి పైగా గల్ఫ్‌ బాధితుల దీన గాథ ఇది.

కామారెడ్డి క్రైం : కామారెడ్డి, చుట్టుపక్కల జిల్లాల నుంచి దుబాయ్‌లోని షార్జా అలీముసా ప్రాంతానికి గడిచిన ఏడాది కాలంలో 70 మంది వరకు ఉపాధి కోసం కంపెనీ వీసాలపై వెళ్లారు. వారిలో 90 శాతం మందిని పంపింది కామారెడ్డిలోని ఓ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ సంస్థ తేలికైన పని చక్కని ఉద్యోగమంటూ గ్రామీణ ప్రాంతంలోని అమాయకులకు గాలం వేశారు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసి దుబాయ్‌ పంపించారు. వెళ్లిన వారితో గొడ్డు చాకిరీ చేయించారు.

వెళ్లిన మరుసటి రోజే తాము మోసపోయామని తెలుసుకున్నారు. చేసేది ఏమి లేక చెప్పిన పనిచేశారు. కంపెనీ ప్రతినిధులు నెలలు గడుస్తున్నా జీతాలు సరిగా ఇవ్వలేదు. ఇదేమిటని ప్రశ్నించినవారిని టార్గెట్‌ చేసి అర్థరాత్రి తర్వాత వీదేశీయులచేత కొట్టించేవారు. కనీసం నీళ్లు విద్యుత్‌ సౌకర్యాలం లేని క్యాంప్‌ గదుల్లో ఉంచారు. దీంతో అందరూ కలిసి కంపెనీ మోసాలపై తిరగబడ్డారు. ఈ నెల 3వ తేదీన షార్జా అలీమూసాలో రోడ్డుపై కంపెనీ తీరుకు నిరసనగా న్యాయం చేయాలంటూ ర్యాలీ తీశారు. ర్యాలీ తీసినవారిని అక్కడి పోలీసులు, మిలిటరీ అదుపులోకి తీసుకుంది.

మీరంతా ఏ కంపెనీలో పనిచేస్తున్నారని ప్రశ్నించి కంపెనీ ప్రతినిధులను పిలిపించారు. అక్కడ కంపెనీ పేరుతో లేబర్‌ వ్యాపారాలు చేస్తున్న మన ప్రాంతానికే చెందిన కంపెనీ ప్రతినిధులు చేరుకుని పోలీసులతో మాట్లాడారు. వీళ్లందరికి సంబంధించిన వ్యవహరాలు స్వయంగా చూసుకుంటామని, డబ్బులు ఇప్పించి స్వస్థలాలకు పంపిస్తామని పోలీసుల ముందు హామీ ఇచ్చి అందరిని తీసుకుని వెళ్లారు.

మాకు వ్యతిరేకంగా ధర్నా చేస్తారంటూ క్యాంప్‌నకు వెళ్లిన తర్వాత చాలా మందిని చీకటి గదుల్లో వేసి హింసించారని మూడు రోజుల క్రితం కామారెడ్డికి వచ్చిన 14 మంది బాధితులు తెలిపారు. మిగితావారు క్యాంప్‌ల్లోనే మిగిలిపోయారు. పోలీసులు క్యాంపు దాటి వెళ్లవద్దని ఆంక్షలు పెట్టడంతో వేరే పనిచూసుకోలేక, తిరిగి రాలేక తిండిలేక అక్కడాఇక్కడా తింటూ సతమతమవుతున్నారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు కొంతమంది ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఇటీవల ఇక్కడికి చేరుకున్న తోటివారికి సమాచారం చేర వేస్తున్నారు.   

పంపేందుకు ప్రశ్నలెన్నో.. 
జిల్లాకు చెందిన కొందరు బడాబాబుల బంధువులు షార్జా అలీమూసాలో ఎంఎన్‌ఆర్, ఎస్‌ఎల్‌వీఆర్‌ పేరుతో కార్మికులను సప్లయ్‌ చేసే లేబర్‌ కంపెనీలను తెరిచారు. కామారెడ్డిలోని ఓ గల్ఫ్‌ ఏజెంట్‌ ద్వారా ఇక్కడి నుంచి ఉద్యోగాల పేరుతో కంపెనీ వీసాలపై 70 మందిని తెప్పించుకున్నారు. కాని వారికి జీతాలివ్వక తిప్పలు పెట్టి ప్రశ్నించినందుకు ధర్నా చేస్తే పోలీసులకు తాము సెటిల్‌ చేసుకుంటామని కంపెనీ వాళ్లు చెప్పి తిరిగి వారిని హింసించడం చేతులెత్తేశారు. కరెంట్, నీళ్లు, ఆహారం లేక నాలుగు రోజులకు పైగా పస్తులున్నామని చెప్తున్నారు. నెలకు ఇద్దరి చొప్పున మాత్రమే స్వస్థలాలకు పంపిస్తామని అంటున్నారని, బెదిరిస్తున్నారని వారు వాపోయారు.

న్యాయం చేయాలి 

నేనుకూడా షార్జాఅలీమూసాలోని కంపెనీ బాధితుల్లో ఒకడినే. మేము 14 మంది మూడు రోజుల క్రితం దుబాయ్‌ నుండి వచ్చేశాం. ఇంకా 60 మంది వరకు మాతోటి వారు అక్కడే ఉన్నారు. కంపెనీ వారు నీళ్లు, కరెంట్‌ లేని క్యాంపు గదిలో ఉంచారు. జీతాలు ఇవ్వలేదు. గల్ఫ్‌ ఏజెంట్ల మాటలకు మోసపోయాం. నాలుగైదు రోజుల నుంచి తిండి లేకుండా అలమటిస్తున్నారు. వారందరిని ఇక్కడికి రప్పించాలి. ఆర్థికంగా నష్టపోయిన వారికి న్యాయం చేయాలి.
– శంకర్, గల్ఫ్‌ బాధితుడు, గౌరారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement