ఆదుకొని గల్ఫ్ బాట | Adilabad person Ramana Suicide In Gulf | Sakshi
Sakshi News home page

ఆదుకొని గల్ఫ్ బాట

Published Sat, Dec 9 2017 11:34 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

Adilabad person Ramana Suicide In Gulf - Sakshi

కుటుంబ సభ్యులతో రమణ (ఫైల్‌), సాయిని రమణ(ఫైల్‌)

అచ్చిరాని వ్యవసాయం..ఆదుకోని గల్ఫ్‌ పయనం..రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డా దక్కని ఫలితం..కుప్పలుగా పెరిగిన అప్పుల బాధ..ఎదుగుతున్న పిల్లల భారం..ఓ వలస జీవిని తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయి. సమస్యల సుడిగుండంలో ఇంటికి వెళ్లడానికి ఆయనకు మనసొప్పలేదు. చివరికి గల్ఫ్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు..

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లి కి చెందిన సాయిని రమణ(45)కు ఎకరంన్నర వ్యవసాయ భూమి ఉంది. 2004 వరకు భార్య చిన్నలక్ష్మితో కలిసి వ్యవసాయం చేçస్తూ జీవనం గడిపాడు. అయితే ఆశించిన ఆదాయం రాలేదు. కొడుకు, కూతురు ఎదుగుతున్న క్రమంలో కుటుంబ పోషణ భారంగా మా రింది. గల్ఫ్‌కు వెళితే  కుటుంబ పరిస్థితి బాగుపడుతుందని ఆశించి సుమారు రూ.లక్షన్నర అప్పు చేసి 2004 డిసెంబర్‌లో దుబాయ్‌కి వెళ్లాడు. ఏడాదిపాటు బాగానే పని ఉన్నా ఆ తరువాత  జీతాలు సరిగా అందలేదు. ఇం టికి డబ్బులు పంపడం కష్టంగా మారింది. పిల్లల చదువుకు అప్పు చేయాల్సిన దుస్థితి. ఆ తర్వాత దుబాయ్‌లో పనిసరిగా లేక 2007లో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. 

భూమి అమ్మి అప్పులు కట్టి..
దుబాయ్‌ నుంచి ఇంటికి తిరిగివచ్చిన రమణకు సుమారు రూ.5 లక్షల వరకు అప్పులయ్యాయి. అవి తీర్చడానికి తనకున్న ఎకరంన్నర భూమిని అమ్మేశాడు. ఆ వచ్చిన డబ్బులతో అప్పు తీర్చాడు. తరువాత స్వగ్రామంలో ఏ పనీ చేయలేక.. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ సారి సౌదీకి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. భూమి అమ్మిన డబ్బులు అప్పు తీర్చడానికే సరిపోవడంతో మళ్లీ సౌదీ వెళ్లడానికి సుమారు రూ.2లక్షలు అప్పు చేసి 2007లో వెళ్లాడు. 

ఐదేళ్లు పర్వాలేదు..
సౌదీలో ఓ కంపెనీలో పనిలో చేరిన రమణ సుమారు ఐదేళ్ల పా టు బాగానే పనిచేశాడు. జీతం ఇంటికి పంపాడు. గ్రామంలో ఇంటి నిర్మాణం మొదలుపెట్టి 2015లో పూర్తిచేశాడు. ఇంటి నిర్మాణం కోసం తన వద్ద ఉన్న డబ్బులకు అదనంగా కొంత మే ర అప్పు చేశాడు. అదే సంవత్సరం ఫిబ్రవరిలో ఇంటికి వచ్చి గృహాప్రవేశం చేసిన రమణ నెల పాటు ఉండి మళ్లీ సౌదీకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అక్కడి పరిస్థితులు తారుమారయ్యాయి. కంపెనీలో జీతం బాగా తగ్గిపోయింది. వేరో చోట పని వెతుక్కోవడానికి ఖలివెల్లి (పని చోటు నుంచి బయటకు వెళ్లిపోవడం) అయ్యాడు. అక్కడే చిన్నచిన్న కంపెనీల్లో పనిచేస్తూ సుమారు రెండున్నరేళ్లు కాలం గడిపాడు. ఈ సమయంలో ఆశించిన మేర సంపాదన లేకుండా పోయింది. సౌదీలో చేస్తున్న పనికి వస్తున్న జీతంలో తన ఖర్చులకు డబ్బు సరిపోక ఇబ్బందిగా మారింది. ఇంటి నిర్మాణం కోసం..సౌదీ వెళ్లడాని కి.. కుటుంబ పోషణకు చేసిన అప్పు లు సుమారు రూ.10 లక్షలకు చేరాయి. అప్పులు తీరడానికి మరో మార్గం కనబడక తీవ్ర మానసిన వేదనకు గురయ్యాడు. చివరకు సౌదీలో తాను ఉం టున్న గదిలోనే ఉరేసుకుని ప్రాణాలొ దిలాడు. దీంతో రమణ భార్య, కొడు కు, కూతురు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సమాచారం
15న ఒమన్‌లో ఎన్నారైలకు ఓపెన్‌ హౌస్‌ ప్రతినెల మూడో శుక్రవారం ప్రవాసీ ప్రజావాణి   సుల్తానేట్‌ ఆఫ్‌ ఒమాన్‌ దేశ రాజధాని మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఈనెల 15న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపెన్‌ హౌస్‌ అనే బహిరంగ సామాజిక సమావేశం నిర్వహిస్తారు. ఒమాన్‌ దేశంలో నివసించే ప్రవాస భారతీయ భవన నిర్మాణ కార్మికులు, ఇంటిపని చేసే మహిళలు, ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ప్రతినెల మూడో శుక్రవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ఇండియన్‌ ఎంబసీ అధికారులతో నేరుగా తమ సమస్యలను చర్చించే అవకాశం లభిస్తుంది. ఒమాన్‌లో ఇబ్బందుల్లో ఉన్న భారతీయులు ఎంబసీ 24 గంటల హెల్ప్‌ లైన్‌ నంబర్‌ + 968 2469 5981 లేదా మొబైల్‌ నంబర్‌ +968 9653 0062కు కాల్‌ చేయవచ్చు.

విదేశాల్లో మీవాళ్లకు కష్టాలు ఎదురైతే.. ఈ కేంద్రాల్లో సంప్రదించాలి
వివిధ దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న వలసకార్మికుల పక్షాన భారత దేశంలో వారి బంధువులు ఢిల్లీలోని టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800–11–3090, హాట్‌ లైన్‌ నంబర్‌ +91–11–4050 3090, హైదరాబాద్‌లోని ’ప్రవాసి మిత్ర’  హెల్ప్‌ లైన్‌ నంబర్‌ +91 93944 22622కు గాని కాల్‌ చేయవచ్చు. తెలంగాణ వారు టి–ఎన్నారై విభాగం నం. +91 94408 54433కు.. ఆంధ్రప్రదేశ్‌ వారు ఏపీ ఎన్నారై విభాగం నంబర్‌
+91 97059 06976కు ఫోన్‌ చేయవచ్చు.  

గల్ఫ్‌ రిటర్నీలకు పరిశ్రమల శాఖ, బ్యాంకులు సహకరించాలి
గల్ఫ్‌ నుంచి వాపస్‌ వచ్చిన తర్వాత కొందరు తమతోపాటు నైపుణ్యాన్ని, కొంత డబ్బును కూడా తీసుకొని వస్తున్నారు. వీరు తమతమ గ్రామాలలో చిన్నతరహా పరిశ్రమలు స్థాపించడానికి ఆసక్తి చూపుతున్నారు. గల్ఫ్‌ రిటర్నీ ల కోసం  పరిశ్రమల శాఖ, బ్యాంకులు, వివిధ ప్రభుత్వ శాఖలు కలిసి ప్రత్యేక మేళాలు నిర్వహించి ప్రవాసీలు చేత పరిశ్రమలు పెట్టించాలి. దీనితో గ్రామాల్లో కొందరికి ఉపాధి దొరుకుతుంది. చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు గల్ఫ్‌ వలసవెళ్లి వచ్చిన తర్వాత వీరికి వ్యవసాయం, పశుపోషణ కోసం సబ్సిడీలతో కూడిన రుణాలు అందించాలి. గొర్రెలు, బర్రెలు లాంటి పథకాలు వీరికి వర్తింపజేయాలి. డ్వాక్రా సంఘాల తరహాలో గల్ఫ్‌ రిటర్నీలతో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రవాసీ స్వయం సహాయక బృందాన్ని ఏర్పాటు చేయాలి. గల్ఫ్‌ నుంచి వాపస్‌ వచ్చిన వారందరూ ప్రవాసీ సహకార సంఘాలుగా ఏర్పడి వారి నైపుణ్యాన్ని గ్రామాభివృద్ధికి.. తద్వారా రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించాలి.    – మంద భీంరెడ్డి, ‘ప్రవాసీ మిత్ర’ అధ్యక్షుడు   
 
ప్రాజెక్టులలో అవకాశం కల్పించాలి

తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులలో గల్ఫ్‌ రిటర్నీలకు అవకాశం ఇవ్వాలి. కార్పెంటర్, స్టీల్‌ ఫిక్సర్, మేషన్స్, కాంక్రీట్‌ పంప్‌ ఆపరేటర్స్, పైప్‌లైన్‌ ఆపరేటర్స్, పైప్‌ ఫిట్టర్స్, ఫ్లంబర్స్, ఎలక్ట్రీష న్స్, ప్రొఫెషనల్‌ వర్కర్స్‌కు గల్ఫ్‌లో పనిచేసిన అనుభవం ఉన్నది. పక్క రాష్ట్రాల వారికి మన రాష్ట్రంలో ఉపాధి కల్పిస్తున్న కాంట్రాక్టర్లు మనవాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలి. ఇలా చేస్తే కొంతైనా గల్ఫ్‌ వలసలు తగ్గుతాయి.
– దార్నవేణి తిరుపతి, రియాద్, సౌదీ అరేబియా   

స్థానికంగానే ఉపాధి కల్పించాలి
మనవాళ్ల దగ్గర నైపుణ్యానికి కొదువ లేదు.. కానీ తెలంగాణలో అవకాశాలు లేక గల్ఫ్‌ బాట పడుతున్నారు. మన తెలంగాణలోని కాంట్రా క్టర్లు, వ్యాపారవేత్తలతో చర్చలు జరిపి మనవాళ్లకు పని ఇప్పించాలి. గత రెండు నెలల్లో జగిత్యాల జిల్లా నుంచి దాదాపు 150 మంది ఖతార్‌కి ఆజాద్‌ వీసా మీద వచ్చారు. ఇక్కడా పనులులేక.. పనిదొరికినా జీతాలురాక కష్టపడుతున్నారు.  – పడకంటి వేణుగోపాల్, దోహా, ఖతార్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement