
రవి, మల్లేశం ఫొటోలతో వారి భార్యలు రేణ, రాజవ్వ, తల్లి గంగవ్వ (ఇన్‌సెట్) శివరాత్రి రవి(పైన), శివరాత్రి మల్లేశం
‘పన్నెండేడ్లాయే కొడుకులు కనిపియ్యక. ఎప్పుడస్తరా అని చూస్తున్నం. మన దేశం కాదు.. మన రాజ్యం కాదు. వాళ్లక్కడ దుబాయి జైల్లో ఉన్నారు. ఎట్ల ఇడిపియ్యాలో తెల్వదు. నెల రోజులుగా నాకు జెరమత్తుంది. కొడుకులెప్పు డత్తరా అని సిరిసిల్ల తొవ్వదిక్కు సూత్తున్న. కొడుకులిద్దరు కండ్లళ్ల కనిపిత్తుండ్రు బాంచెన్. వాళ్లను కంటినిండా చూస్కోని సచ్చిపోవాలని పిస్తోంది’ అంటూ కన్నీరు పెడుతోంది శివరాత్రి గంగవ్వ.
పన్నెండు సంవత్సరాలుగా కన్నకొడుకులిద్దరూ దుబాయ్‌లో ఓ హత్య కేసులో ఇరుక్కొని జైలుశిక్ష అనుభవిస్తున్నారు. బండలు కొట్టి బతికే ఆ గరీబోళ్లకు గల్ఫ్ మానని గాయం చేసింది. అక్షరజ్ఞానం లేని ఆ నిరుపేదలకు తమ వాళ్లను ఎలా విడిపించుకోవాలో తెలియడం లేదు.
దౌత్యపరమైన సహాయం లభించక నిత్యం కన్నీళ్లతో వెళ్లదీస్తున్నారు ఆ అభాగ్యులు. మా వాళ్లను విడిపియ్యుండ్రి బాంచెన్ అంటూ బంధీల భార్యలు రేణ, రాజవ్వలు చేతులు జోడించి వేడుకుంటున్నారు.
ఏం జరిగిందంటే...
రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం(45), శివరాత్రి రవి(42) అన్నదమ్ములు. 2004లో దుబాయికి బతుకుదెరువుకు వెళ్లారు. వీరితో పాటు కోనరావుపేట చెందిన దండుగుల లక్ష్మణ్(45), చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి(40), జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు(48) కూడా దుబాయికి వెళ్లారు.
కంపెనీలో పని బాగా లేదని బయటకు వచ్చి (ఖల్లివెల్లి అయి)వేరేచోట పనిచేసుకుంటున్నారు. జబల్‌అలీ ప్రాంతంలో నలుగురు పాకిస్తానీయులతో పాటు గంగాధర మండలం నమిలికొండకు చెందిన సయ్యద్ కరీం, వీరు కలిసి పనిచేస్తున్నారు. కాగా, 2005లో వీరు పనిచేస్తున్న ప్రాంతంలో నేపాల్‌కు చెందిన దిల్ బహదూర్ అనే సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు. ఈ హత్యను వీరే చేశారని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి 2006లో జైలులో పెట్టారు.
పరిహారమిచ్చినా దక్కని క్షమాభిక్ష
దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి బ్లడ్ మనీ(పరిహారం) చెల్లించి వారిచేత క్షమాభిక్ష అంగీకారం తీసుకుంటే కోర్టు శిక్షను రద్దు చేస్తుంది. ఈ పరిహారాన్ని అరబిక్ భాషలో ‘దియా’ అంటారు. బహదూర్ హత్య కేసులో నేపాల్‌లోని అతని భార్య రూ.15 లక్షలు చెల్లిస్తే క్షమాభిక్ష పెడతానని అంగీకరించింది.
అంత డబ్బు చెల్లించే స్థోమత లేక బాధితులు 2012 నవంబరులో రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. తమ కిడ్నీలు అమ్ముకొని నేపాల్‌లోని బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తామని, అందుకు అనుమతించాలని కోరుతూ బాధితులు హెచ్‌ఆర్‌సీని కలిశారు. ఈ విషయం అప్పట్లో పత్రికల్లో రావడంతో బాధితులకు ఆర్థికసాయం అందించేందుకు అప్పటి సిరిసిల్ల ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ముందుకొచ్చారు.
ఆయన స్వయంగా నేపాల్ వెళ్లి ఐదేళ్ల కిందటే హత్యకు గురైన బహదూర్ కుటుంబ సభ్యులకు రూ.15 లక్షలుఅందించారు. క్షమాభిక్ష పత్రంపై మృతుడి భార్య సంతకం చేసింది. ఈ మేరకు సంబంధిత పత్రాలను దుబాయి కోర్టుకు సమర్పించారు. అయితే వీరిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. సెక్యూరిటీ గార్డు హత్య, కాపర్‌వైరు చోరీ, దేశం విడిచి పారిపోవడం అనే మూడు నేరా రోపణలను మోపారు.
హత్య కేసులో క్షమాభిక్ష లభించినప్పటికీ మరో రెండు కేసుల్లో దుబాయి కోర్టు క్షమాభిక్షకు నిరాకరించింది. ఇదే కేసులో పాకిస్తాన్‌కు చెందిన మరో నలుగురిని, గంగాధర మండలం నమిలికొండకు చెందిన సయ్యద్ కరీంలను నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. కానీ ఈ ఐదుగురు మాత్రం ఇంకా శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు.
దక్కని దౌత్యపరమైన సాయం..
భారత దేశానికి చెందిన ఐదుగురిని విడిపించేందుకు దౌత్యపరమైన సాయం దక్కలేదు. రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు ఈ విషయమై విదేశీ వ్యవహరాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తోనూ చర్చించారు. దుబాయి రాజు క్షమాభిక్ష పెడితేనే ఐదుగురు బంధీలు విడుదల అయ్యే అవకాశం ఉంది. కానీ మన రాయబార కార్యాలయం నుంచి దుబాయిలోని ముఖ్య అధికారులతో దౌత్యపరమైన చర్చలు జరగకపోవడంతో బాధితులు బంధీలుగానే ఉన్నారు.
దుబాయ్ కోర్టులో బందీల తరఫున వాదిస్తున్న న్యాయవాది అనురాధ ఇటీవల పెద్దూరుకు వచ్చి బంధీల తల్లి, భార్య, బిడ్డలతో మాట్లాడి వెళ్లారు. దుబాయి రాజు మాత్రమే క్షమాభిక్షను ప్రసాదించాల్సి ఉందని అనురాధ తెలిపారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఖైదీలకు లభించే క్షమాభిక్షలో వీరి పేర్లుకూడా చేరుస్తారని భావిస్తున్నారు.
మంత్రి కేటీఆర్‌పై ఆశలు..
సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ప్రవాసీ తెలంగాణ మంత్రి కె.తారక రామారావుపైనే బాధితులు ఆశలు పెట్టుకున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ స్థాయిలో కల్పించుకుని దౌత్యపరమైన జోక్యం చేసుకుంటే బంధీల విడుదలకు మార్గం ఉంటుందని భావిస్తున్నారు. మంత్రి కేటీఆర్ సైతం న్యాయవాది అనురాధతో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment