imprisionment
-
నా భార్యకు ఏమైనా జరిగితే వదలిపెట్టను: ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్
ఇస్లామాబాద్: తన భార్య జైలుపాలు కావడానికి ఆర్మీ చీఫ్ జనరల్ ఆసీమ్ మునీర్ కారమంటూ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్( పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. తన భార్య బుష్రా బీబీ జైలు శిక్ష పడినందుకు ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ బాధ్యత వహించాలన్నారు. అవినీతి కేసుకు సంబంధించి బీబీ బుష్రా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆమె గృహ నిర్బంధంలో ఉన్నారు. అడియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘నా భార్య బుష్రాకు జైలు శిక్ష పడటంలో ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ స్వయంగా జోక్యం చేసుకున్నారు. కోర్టులో న్యాయమూర్తిపై అసిమ్ మునీర్ ఒత్తిడి తెచ్చారు. నా భార్యకు ఏదైనా జరిగితే.. అసిమ్‌ను వదిలిపెట్టను. నేను బతికి ఉన్నంతవరకు అసిమ్‌ను అస్సలు వదిలేయను. అసిమ్ చేసిన చట్టవ్యతిరేక చర్యలన్నీ బయటపెడతాను. ..పాకిస్తాన్లో ఆటవిక రాజ్యంలో కొనసాగుతోంది. అడవి(పాకిస్తాన్) రాజు(నవాజ్ షరీఫ్) తల్చుకుంటే అన్ని కేసులు మాఫీ చేయబడుతాయి. లేదంటే ఐదు రోజుల్లో మూడు కేసులు బనాయిస్తారు. శిక్ష కూడా పడుతుంది. ఆటవిక రాజ్యంలో పెట్టుబడలు రావు. పెట్టుబడుల పెట్టడానికి సౌదీ అరేబియా ముందురావటం మంచిదే. కానీ, చట్టబద్ద కల్పించరు’ అని ఇమ్రాన్ మండిపడ్డారు. -
మహిళలను వేధించే పోకిరీలకు జైలు శిక్ష!
సాక్షి, హైదరాబాద్: మహిళలను వేధించడం, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న పోకిరీలకు న్యాయస్థానం జరిమానాతో పాటు 2 నుంచి 8 రోజుల పాటు జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ షీ టీమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఏక్ షామ్ చారి్మనార్ కే నామ్’ కార్యక్రమానికి వచ్చిన మహిళలను వెంబడిస్తూ.. వారితో అసభ్యకరంగా ప్రవర్తించిన మల్లేపల్లిలో ఉంటున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రిజ్వాన్ ఖాన్, అబ్దుల్ హాజీ, మహమ్మద్ అద్నాన్‌లను సిటీ షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. స్కూల్ విద్యార్థిని వెంబడించిన సోమాజీగూడకు చెందిన కరుణాకర్, బాధితురాలిని సోషల్ మీడియాలో వేధించిన నిందితులు మారేడుపల్లికి చెందిన ఏ ప్రవీణ్, బీ రాకేష్, కే శామ్యూల్‌లను షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. ప్రేమ కాదంటే వేధింపులు.. మహంకాళికి చెందిన సి. సోహ్రాబ్ వ్యాస్ అనే వ్యక్తికి, బాధితురాలికి మధ్య కొంత కాలం ప్రేమ వ్యవహారం నడిచింది. వీరి పెళ్లికి ఇరువర్గాల పెద్దలు అంగీకరించకపోవడంతో ఆ బంధానికి తెరపడింది. అయితే సోహ్రాబ్ అంతకు ముందు బాధితురాలితో దిగిన ఫొటోలను ఆమె బంధువులకు, స్నేహితులకు పంపించి మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు షీ టీమ్ నిందితుడిని అదుపులోకి తీసుకుంది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన బోయినపల్లికి చెందిన ఖతిక్ ఆకాష్ సుంకర్నును ఓ యువతి ప్రేమించింది. ఏడాదిన్నర తర్వాత వీరిద్దరూ విడిపోయారు. కానీ, గత కొద్ధి కాలంగా నిందితుడు బాధితురాలికి తరుచూ సందేశాలు పెట్టడం, ఆమె వ్యక్తిగత, ఆఫీసు మెయిల్ ఐడీలకు మెయిల్స్ పెట్టడం చేస్తున్నాడు. దీంతో బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించడంతో నిందితుడు ఆకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న జే నరేందర్ కొంతకాలం బాధితురాలితో రిలేషన్షిప్లో ఉన్నాడు. ఆపై అభిప్రాయబేధాలతో విడిపోయారు. అప్పటినుంచి అతను గతంలో తనతో దిగిన ఫొటోలను బయటపెడతానని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగడంతో బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. దీంతో నిందితుడిని అరెస్టు చేశారు. ఈ నిందితులనందరినీ తగిన సాక్ష్యాధారాలతో న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కోర్టు నిందితులకు రెండు నుంచి ఎనిమిది రోజుల జైలు శిక్షను విధించిందని హైదరాబాద్ షీ టీమ్ అదనపు జాయింట్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. (చదవండి: నలుగురు దొంగలు.. రూ.12 కోట్ల ఫోన్లు కొట్టేశారు!) -
USA: భార్యతో గొడవ.. భర్తకు షాకిచ్చిన అమెరికా కోర్టు
వాషింగ్టన్: టెక్సాస్‌కు చెందిన సునీల్ కే అకులా (32) అనే భారత సంతతి వ్యక్తికి 56 నెలల జైలు శిక్ష, మూడు సంవత్సరాల పర్యవేక్షణ విధించింది అక్కడి కోర్టు. ఫెడరల్ ప్రాసిక్యూటర్ల ప్రకారం.. "సునీల్ టెక్సాస్‌లోని తన ఇంటి నుంచి మసాచుసెట్స్ లోని అగావామ్కు తన భార్యతో 2019, ఆగష్టు 6న ప్రయాణించాడు. ఆ సమయంలో అతడు ఆమెతో గొడవ పడ్డాడు. అతడు తన భార్యను అపార్ట్మెంట్ నుంచి తరిమివేసి, తన కారులో ఎక్కమని బలవంతం చేశాడు. ఆమెను తిరిగి టెక్సాస్‌కు తీసుకువెళుతున్నానని చెప్పాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేయమని బలవంతం చేశాడు. ఆమె ల్యాప్‌టాప్‌ను పగులగొట్టి హైవేపై విసిరాడు." అంటూ ప్రాసిక్యూటర్స్ ఆరోపించారు. ప్రయత్నాలు విఫలం సునీల్ దౌర్జన్యంపై అతని భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడిని అరెస్టు చేశారు. అయితే, కేసు నుంచి బయటపడేందుకు సునీల్ ఎన్నో ప్రయత్నాలు చేసిన ఫలితం లేకుండా పోయింది. అతను పోలీసుల అదుపులో ఉన్నప్పుడు, భారతదేశంలో ఉన్న తన కుటుంబ సభ్యులకు చాలాసార్లు ఫోన్ చేశాడు. భార్య తన కేసును ఉపసంహరించుకోవాలని ఆమె తండ్రిని ఒప్పించటానికి ప్రయత్నించాడు. ఆమెను కూడా బతిమాలుకున్నాడు. ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అతని భార్య తరపు లాయర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు సునీల్‌కు జైలు శిక్ష ఖరారు చేసింది. (చదవండి: వాకింగ్ చేస్తున్నట్లు నటిస్తూ.. మహిళల ఫోటోలు తీసిన వృద్ధుడు) -
కరోనా లక్షణాలు దాస్తే 6నెలల జైలు శిక్ష
కొలంబో: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలన్నీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే కొన్ని దేశాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే శ్రీలంక కూడా కరోనాను కట్టడి చేసే విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉండి వాటిని దాటిపెట్టినట్లు దొరికితే వాళ్లకు 6నెలల జైలు శిక్ష పడుతుందని శ్రీలంకకు చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు క్వారంటైన్ సెంటర్లకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారని ఆయన తెలిపారు. చదవండి: శ్రీలంకలో మొదటి కరోనా కేసు నమోదు అలాంటి వ్యక్తుల వల్ల వైరస్ వ్యాప్తి చెంది పెద్ద అపాయం జరిగే అవకాశమున్నందున వారిని ఎటువంటి వారెంట్ లేకుండానే అరెస్ట్ చేస్తామని సీనియర్ ఇన్స్పెక్టర్, డీఐజీ అజిత్ రోహణ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఒక్కో పోలీస్ స్టేషన్ లో 7గురు అధికారులను నియమించామని, వారు క్వారంటైన్ నిబంధనల గురించి ప్రజలకు సమాచారం ఇస్తారని ఆయన తెలిపారు. కాగా.. శ్రీలంకలో ఇప్పటివరకు 18 కరోనా కేసులు నమోదు కాగా.. వారందరికీ కొలంబో సిటీ శివార్లలోని ఇన్ఫెక్షయస్ డిసీస్ హాస్పిటల్లో చికిత్సను అందిస్తున్నారు. చదవండి: కరోనా బారిన జేమ్స్‌బాండ్ నటి -
పన్నెండేళ్లుగాజైలులోనే..
‘పన్నెండేడ్లాయే కొడుకులు కనిపియ్యక. ఎప్పుడస్తరా అని చూస్తున్నం. మన దేశం కాదు.. మన రాజ్యం కాదు. వాళ్లక్కడ దుబాయి జైల్లో ఉన్నారు. ఎట్ల ఇడిపియ్యాలో తెల్వదు. నెల రోజులుగా నాకు జెరమత్తుంది. కొడుకులెప్పు డత్తరా అని సిరిసిల్ల తొవ్వదిక్కు సూత్తున్న. కొడుకులిద్దరు కండ్లళ్ల కనిపిత్తుండ్రు బాంచెన్. వాళ్లను కంటినిండా చూస్కోని సచ్చిపోవాలని పిస్తోంది’ అంటూ కన్నీరు పెడుతోంది శివరాత్రి గంగవ్వ. పన్నెండు సంవత్సరాలుగా కన్నకొడుకులిద్దరూ దుబాయ్‌లో ఓ హత్య కేసులో ఇరుక్కొని జైలుశిక్ష అనుభవిస్తున్నారు. బండలు కొట్టి బతికే ఆ గరీబోళ్లకు గల్ఫ్ మానని గాయం చేసింది. అక్షరజ్ఞానం లేని ఆ నిరుపేదలకు తమ వాళ్లను ఎలా విడిపించుకోవాలో తెలియడం లేదు. దౌత్యపరమైన సహాయం లభించక నిత్యం కన్నీళ్లతో వెళ్లదీస్తున్నారు ఆ అభాగ్యులు. మా వాళ్లను విడిపియ్యుండ్రి బాంచెన్ అంటూ బంధీల భార్యలు రేణ, రాజవ్వలు చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఏం జరిగిందంటే... రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం(45), శివరాత్రి రవి(42) అన్నదమ్ములు. 2004లో దుబాయికి బతుకుదెరువుకు వెళ్లారు. వీరితో పాటు కోనరావుపేట చెందిన దండుగుల లక్ష్మణ్(45), చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి(40), జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు(48) కూడా దుబాయికి వెళ్లారు. కంపెనీలో పని బాగా లేదని బయటకు వచ్చి (ఖల్లివెల్లి అయి)వేరేచోట పనిచేసుకుంటున్నారు. జబల్అలీ ప్రాంతంలో నలుగురు పాకిస్తానీయులతో పాటు గంగాధర మండలం నమిలికొండకు చెందిన సయ్యద్ కరీం, వీరు కలిసి పనిచేస్తున్నారు. కాగా, 2005లో వీరు పనిచేస్తున్న ప్రాంతంలో నేపాల్‌కు చెందిన దిల్ బహదూర్ అనే సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు. ఈ హత్యను వీరే చేశారని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి 2006లో జైలులో పెట్టారు. పరిహారమిచ్చినా దక్కని క్షమాభిక్ష దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి బ్లడ్ మనీ(పరిహారం) చెల్లించి వారిచేత క్షమాభిక్ష అంగీకారం తీసుకుంటే కోర్టు శిక్షను రద్దు చేస్తుంది. ఈ పరిహారాన్ని అరబిక్ భాషలో ‘దియా’ అంటారు. బహదూర్ హత్య కేసులో నేపాల్‌లోని అతని భార్య రూ.15 లక్షలు చెల్లిస్తే క్షమాభిక్ష పెడతానని అంగీకరించింది. అంత డబ్బు చెల్లించే స్థోమత లేక బాధితులు 2012 నవంబరులో రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. తమ కిడ్నీలు అమ్ముకొని నేపాల్‌లోని బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తామని, అందుకు అనుమతించాలని కోరుతూ బాధితులు హెచ్ఆర్సీని కలిశారు. ఈ విషయం అప్పట్లో పత్రికల్లో రావడంతో బాధితులకు ఆర్థికసాయం అందించేందుకు అప్పటి సిరిసిల్ల ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ముందుకొచ్చారు. ఆయన స్వయంగా నేపాల్ వెళ్లి ఐదేళ్ల కిందటే హత్యకు గురైన బహదూర్ కుటుంబ సభ్యులకు రూ.15 లక్షలుఅందించారు. క్షమాభిక్ష పత్రంపై మృతుడి భార్య సంతకం చేసింది. ఈ మేరకు సంబంధిత పత్రాలను దుబాయి కోర్టుకు సమర్పించారు. అయితే వీరిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. సెక్యూరిటీ గార్డు హత్య, కాపర్‌వైరు చోరీ, దేశం విడిచి పారిపోవడం అనే మూడు నేరా రోపణలను మోపారు. హత్య కేసులో క్షమాభిక్ష లభించినప్పటికీ మరో రెండు కేసుల్లో దుబాయి కోర్టు క్షమాభిక్షకు నిరాకరించింది. ఇదే కేసులో పాకిస్తాన్‌కు చెందిన మరో నలుగురిని, గంగాధర మండలం నమిలికొండకు చెందిన సయ్యద్ కరీంలను నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. కానీ ఈ ఐదుగురు మాత్రం ఇంకా శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. దక్కని దౌత్యపరమైన సాయం.. భారత దేశానికి చెందిన ఐదుగురిని విడిపించేందుకు దౌత్యపరమైన సాయం దక్కలేదు. రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు ఈ విషయమై విదేశీ వ్యవహరాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్తోనూ చర్చించారు. దుబాయి రాజు క్షమాభిక్ష పెడితేనే ఐదుగురు బంధీలు విడుదల అయ్యే అవకాశం ఉంది. కానీ మన రాయబార కార్యాలయం నుంచి దుబాయిలోని ముఖ్య అధికారులతో దౌత్యపరమైన చర్చలు జరగకపోవడంతో బాధితులు బంధీలుగానే ఉన్నారు. దుబాయ్ కోర్టులో బందీల తరఫున వాదిస్తున్న న్యాయవాది అనురాధ ఇటీవల పెద్దూరుకు వచ్చి బంధీల తల్లి, భార్య, బిడ్డలతో మాట్లాడి వెళ్లారు. దుబాయి రాజు మాత్రమే క్షమాభిక్షను ప్రసాదించాల్సి ఉందని అనురాధ తెలిపారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఖైదీలకు లభించే క్షమాభిక్షలో వీరి పేర్లుకూడా చేరుస్తారని భావిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌పై ఆశలు.. సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ప్రవాసీ తెలంగాణ మంత్రి కె.తారక రామారావుపైనే బాధితులు ఆశలు పెట్టుకున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ స్థాయిలో కల్పించుకుని దౌత్యపరమైన జోక్యం చేసుకుంటే బంధీల విడుదలకు మార్గం ఉంటుందని భావిస్తున్నారు. మంత్రి కేటీఆర్ సైతం న్యాయవాది అనురాధతో చర్చించారు. -
అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
సాక్షి, కోలారు : బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కర్ణాటకలోని కోలారు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి శనివారం తీర్పు చెప్పారు. కోలారు నగరంలోని కేజీ మోహల్లా వాసి వాజిద్‌ఖాన్ 2015 జనవరి 31న అదే ప్రాంతానికే చెందిన ఓ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో సెషన్స్ న్యాయమూర్తి బి.ఎస్.రేఖ నిందితుడికి పైవిధంగా జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. -
ఆలయ మడిగల కబ్జా- నిందితులకు జైలు
ఎల్బీనగర్(హైదరాబాద్): ఆలయానికి చెందిన మడిగలను కబ్జా చేసిన కేసులో నలుగురు నిందితులకు రంగారెడ్డి జిల్లా కోర్టు జైలు శిక్ష విధించింది. ఎల్బీ నగర్‌లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం పరిధిలో 102 మడిగలు(దుకాణాలు) ఉన్నాయి. వీటిలో 76, 77 మడిగలలో మల్లారెడ్డి అనే వ్యక్తి ఇరవయ్యేళ్లుగా కిరాయికి ఉంటున్నాడు. అయితే 2011లో నకిలీ పత్రాలు సృష్టించి వాటిని తన భార్య పేరుపై ఇతను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీనిపై ఆలయ చైర్మన్ రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన రంగారెడ్డిజిల్లా కోర్టు రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కవితాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రధాన నిందితుడు మల్లారెడ్డి, మరో ముగ్గురికి ఏడాది జైలు, రూ.3వేల చొప్పున జరిమానా విధించారు. -
జైలుకు పంపాడని 13 పోట్లు పొడిచాడు..
హైదరాబాద్: జైలుకు వెళ్లేందుకు కారణమయ్యాడంటూ ఓ బాలుడ్ని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్యచేవారు. బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ అశోక చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కాలాపత్తర్‌కు చెందిన జావేద్ (22)లు చైన్ స్నాచింగ్ తోపాటు ఇతర కేసుల్లో పట్టుబడి జైలుకు వెళ్లొచ్చారు. అతడికి జైలు శిక్ష పడేందుకు శాస్త్రిపురం ఓవైసీహిల్స్ ప్రాంతానికి చెందిన షాబాద్ (17) సాక్ష్యం ఉపకరించింది. నిజానికి షాబాద్ కూడా చిన్నపాటి నేరస్తుడే. గత నెలలో పోలీసులు నగరంలోని నేరగాళ్ల వివరాలు తెలుసుకునేందుకు సమగ్ర సర్వే చేపట్టారు. ఆసమయంలో పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో షాబాద్.. జావేద్ దగ్గర ఆశ్రయం పొందాడు. ఎప్పటినుంచో షాబాద్ పై కక్ష పెట్టుకున్న జావెద్.. కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇజముల్లా (19)తో కలిసి షాబాద్‌ను బైక్‌పై మీరాలం ట్యాంక్ వద్దకు తీసుకెళ్లారు. షాబాద్‌ను ఇజముల్లా పట్టుకోగా... జావేద్ కత్తితో గొంతుపై పొడిచాడు. జైలుకు పంపాడన్న పగతో షాబాద్ కడుపు, ఛాతీలపై 13 సార్లు పొడిచాడు. చనిపోయాడని నిర్దారించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. నవంబర్ 29వ తేదీన ఉదయం అటుగా వచ్చిన వారు మృతదేహన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేయగా మృతుడి పూర్తి వివరాలు, హత్యకు గల కారణాలు వెల్లడయ్యాయి. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. నిందితుడు జావేద్‌పై హుస్సేనీఆలం, కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్‌లో స్నాచింగ్, తదితర కేసులున్నాయి. అతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
అబూసలేంకు జీవిత ఖైదు
మాఫీయా డాన్ అబూసలేంకు జీవిత కారాగార శిక్ష పడింది. 1995నాటి బిల్డర్ ప్రదీప్ జైన్ హత్య కేసుకు సంబంధించి బుధవారం టాడా కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. ప్రదీప్ అతడి సోదరుడు సునీల్‌తోపాటు పలువురు బిల్డర్లను సలేం బెదిరించి భయకంపనలు సృష్టించాడని కోర్టు నిర్ధారించింది. ఆస్తులపై హక్కులివ్వకపోతే కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరించి ఒప్పందం చేసుకున్నారన్నారు. ప్రదీప్ తొలుత పది లక్షలు ఇచ్చారని, మిగిలిన మొత్తం ఇవ్వకపోవడంతో 1995, మార్చి 7న జుహూ బంగళా బయట జైన్‌ను తుపాకీతో కాల్చి చంపారని కోర్టు పేర్కొంది. ఈ కేసులో మరో ఇద్దరు కూడా దోషులున్నారు. -
సత్యం రామలింగరాజు మరో ఇద్దరికి జరిమానా, జైలుశిక్ష
-
సత్యం రామలింగరాజు మరో ఇద్దరికి జరిమానా, జైలుశిక్ష
ఐదేళ్ల క్రితం నాటి సత్యం కేసులో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఎట్టకేలకు తీర్పును వెలువరించింది. మొత్తం ఆరు కేసులకు సంబంధించి ఈ కోర్టు తన తీర్పును సోమవారం వెల్లడించింది. సత్యం రామలింగరాజు, రామరాజుకు మూడు కేసుల్లో రూ. 10 లక్షల జరిమానా విధించారు. అలాగే వారితో పాటు రామ్ మైనంపాటికి కూడా రూ. 10 లక్షల జరిమానా విధించారు. మరో రెండు కేసుల్లో రూ. 10 లక్షల జరిమానా విధించారు. రామలింగరాజు, రామరాజులకు ఒక్కో కేసులో ఆరునెలల పాటు నాలుగు కేసుల్లో జైలుశిక్ష కూడా విధించారు. ఎస్ఎఫ్ఐఓ మొత్తం ఏడు కేసులు నమోదు చేయగా, వాటిలో ఒక కేసును కోర్టు కొట్టేసింది. తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు నెల రోజుల పాటు గడువు ఇచ్చింది. వడ్లమాని శ్రీనివాస్‌కు మూడు కేసుల్లో రూ. 20 వేల జరిమానా, మూడు కేసుల్లో 6 నెలల జైలుశిక్ష విధించారు. సంస్థ మాజీ డైరెక్టర్లు కృష్ణ జి.పాలెపు, ఎన్.శ్రీనివాస్, వినోద్ కె. దామ్, టి.ఆర్. ప్రసాద్‌లకు రూ. 20 వేల వంతున జరిమానాలు విధించారు. ఐదేళ్ల క్రితం.. అంటే 2009 సంవత్సరంలో సత్యం స్కాం బయటపడి ఒక్కసారిగా ఐటీ రంగాన్ని పెద్ద కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. దాదాపు 147 కోట్ల డాలర్ల ఈ కుంభకోణం ఫలితంగా గ్రూపు ఛైర్మన్ రామలింగరాజు 2009 జనవరి 7వ తేదీన తన పదవులకు రాజీనామా చేశారు. అదే సంవత్సరం ఫిబ్రవరి నెలలో సీబీఐ ఈ కేసు విచారణ బాధ్యతలను తీసుకుంది. తర్వాతి నుంచి పలు మలుపులు తిరిగింది. చివరకు ఆర్థికనేరాల ప్రత్యేక కోర్టులో కూడా ఈ కేసుల విచారణ సాగింది. ఇప్పుడు దానికి సంబంధించి తీర్పు వెలువడింది.