ఎల్‌బీనగర్(హైదరాబాద్): ఆలయానికి చెందిన మడిగలను కబ్జా చేసిన కేసులో నలుగురు నిందితులకు రంగారెడ్డి జిల్లా కోర్టు జైలు శిక్ష విధించింది. ఎల్బీ నగర్‌లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం పరిధిలో 102 మడిగలు(దుకాణాలు) ఉన్నాయి. వీటిలో 76, 77 మడిగలలో మల్లారెడ్డి అనే వ్యక్తి ఇరవయ్యేళ్లుగా కిరాయికి ఉంటున్నాడు. అయితే 2011లో నకిలీ పత్రాలు సృష్టించి వాటిని తన భార్య పేరుపై ఇతను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీనిపై ఆలయ చైర్మన్ రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన రంగారెడ్డిజిల్లా కోర్టు రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కవితాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రధాన నిందితుడు మల్లారెడ్డి, మరో ముగ్గురికి ఏడాది జైలు, రూ.3వేల చొప్పున జరిమానా విధించారు.