సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేసు నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఏసీబీకి ఇప్పటికే లేఖ రాశారు.
ఈ క్రమంలో తాజాగా గురువారం(డిసెంబర్ 19) ఈ-కార్ రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా, అప్పటి మునిసిపల్ శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను ఏ2గా చేరుస్తూ ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ3గా అప్పటి హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బిఎల్‌ఎన్‌రెడ్డిని ఏసీబీ చేర్చింది. కేటీఆర్‌పై అవినీతి నిరోధక చట్టం(పీసీ యాక్టు) 13(1)ఏ, 13(2)తో పాటు బీఎన్‌ఎస్ చట్టంలోని పలు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఫార్ములా ఈ-కార్ రేసుల కోసం ఓ విదేశీ కంపెనీకి అప్పటి మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతో కేబినెట్ అనుమతి లేకుండానే రూ.45 కోట్ల ఇండియన్ కరెన్సీ చెల్లించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇందుకు ఆర్బీఐ రూ.8 కోట్లు ఫైన్ వేయగా తమ ప్రభుత్వం జరిమానా చెల్లించిందని తెలిపారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఫార్ములా ఈ కార్ రేసులు నిర్వహించారు. ఈ రేసులకు అప్పటి మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ నిబంధనలు పాటించకుండా ప్రైవేటు సంస్థలకు నేరుగా నిధులు మంజూరు చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. మాజీ మంత్రి అయిన కేటీఆర్‌పై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ అనుమతి కూడా తీసుకోవడం గమనార్హం.
ప్రభుత్వం అబద్ధాలు చెప్తూ కేసు పెట్టింది: హరీశ్‌రావు
రాష్ట్రం కోసం పనిచేసిన కేటీఆర్‌పై కేసు పెట్టారు
ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలు
ఫార్ములా ఈ కేసుపై అసెంబ్లీలో చర్చించండి
Comments
Please login to add a commentAdd a comment