
వాషింగ్టన్: టెక్సాస్‌కు చెందిన సునీల్ కే అకులా (32) అనే భారత సంతతి వ్యక్తికి 56 నెలల జైలు శిక్ష, మూడు సంవత్సరాల పర్యవేక్షణ విధించింది అక్కడి కోర్టు. ఫెడరల్ ప్రాసిక్యూటర్ల ప్రకారం.. "సునీల్ టెక్సాస్‌లోని తన ఇంటి నుంచి మసాచుసెట్స్ లోని అగావామ్‌కు తన భార్యతో 2019, ఆగష్టు 6న ప్రయాణించాడు. ఆ సమయంలో అతడు ఆమెతో గొడవ పడ్డాడు. అతడు తన భార్యను అపార్ట్‌మెంట్ నుంచి తరిమివేసి, తన కారులో ఎక్కమని బలవంతం చేశాడు. ఆమెను తిరిగి టెక్సాస్‌కు తీసుకువెళుతున్నానని చెప్పాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేయమని బలవంతం చేశాడు. ఆమె ల్యాప్‌టాప్‌ను పగులగొట్టి హైవేపై విసిరాడు." అంటూ ప్రాసిక్యూటర్స్ ఆరోపించారు.
ప్రయత్నాలు విఫలం
సునీల్ దౌర్జన్యంపై అతని భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడిని అరెస్టు చేశారు. అయితే, కేసు నుంచి బయటపడేందుకు సునీల్ ఎన్నో ప్రయత్నాలు చేసిన ఫలితం లేకుండా పోయింది. అతను పోలీసుల అదుపులో ఉన్నప్పుడు, భారతదేశంలో ఉన్న తన కుటుంబ సభ్యులకు చాలాసార్లు ఫోన్ చేశాడు. భార్య తన కేసును ఉపసంహరించుకోవాలని ఆమె తండ్రిని ఒప్పించటానికి ప్రయత్నించాడు. ఆమెను కూడా బతిమాలుకున్నాడు. ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అతని భార్య తరపు లాయర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు సునీల్‌కు జైలు శిక్ష ఖరారు చేసింది.
(చదవండి: వాకింగ్ చేస్తున్నట్లు నటిస్తూ.. మహిళల ఫోటోలు తీసిన వృద్ధుడు)