వాషింగ్టన్: అపాయంలో ఉండగా ఉపాయం తట్టాలే కానీ ఎంతటి అగాధాన్నైనా జయించవచ్చని నిరూపించింది అమెరికాలోని ఓ మైనర్ బాలిక. కాలిఫోర్నియాలో కిడ్నాప్‌కు గురైన ఒక మైనర్ బాలిక అగంతకుడు లేని సమయం చూసి బాలిక చాకచక్యంగా వ్యవహరించి చుట్టుపక్కల వారికి తాను ప్రమాదంలో ఉన్న విషయం తెలిసేలా సందేశాన్నిచ్చి కిడ్నాపర్ చెర నుంచి బయటపడింది.
కిడ్నాప్ జరిగిందిలా..
టెక్సాస్‌కు చెందిన స్టీవెన్ రాబర్ట్ సబలాన్(61) జులై 6న సాన్ ఆంటోనియోలో తన ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తోన్న 13 ఏళ్ల బాలికను గన్ చూపించి బెదిరించి కార్ ఎక్కించుకున్నాడు. అక్కడి నుండి 1400 మైళ్ళు ప్రయాణించి కాలిఫోర్నియా వరకు తీసుకుని వెళ్ళాడు. మార్గమధ్యలో బాలికపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడు.
కిడ్నాపర్ దొరికిందిలా..
లాంగ్ బీచ్ చేరిన తర్వాత అక్కడ బాలికలను బట్టలు విప్పి ఇవ్వమని అడిగి వాటిని తీసుకుని ఒక లాండ్రీ షాపులోకి వెళ్ళాడు సబలాన్. అదే సమయంలో పార్కింగ్ స్థలంలో ఉన్నవారికి తాను ప్రమాదంలో ఉన్నానని చెబుతూ ఒక కాగితం మీద "హెల్ప్ మీ" అని రాసి చూపించింది. అది గమనించిన అక్కడి వారు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలికను రక్షించారు.
కటకటాల పాలు..
లాంగ్ బీచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాన్ ఆంటోనియోకి చెందిన మైనర్ బాలిక తన ఇంట్లో వారికి చెప్పకుండా తన స్నేహితురాలిని కలుసుకునేందుకు బయటకు వచ్చిందని అదే సమయంలో సబలాన్ తుపాకీ చూపించి ఆమెను కిడ్నాప్ చేశాడని తెలిపారు. కారు నెంబరు ప్లేటు ఆధారంగా చూస్తే సబలాన్ మీద అప్పటికే టెక్సాస్‌లో దొంగతనం అభియోయోగం మోపబడిందని అన్నారు. తాజాగా అతడిపై కిడ్నాప్, మైనర్ బాలికపై వేధింపులు రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు లాంగ్ బీచ్ పోలీసులు.
ఇది కూడా చదవండి: భార్యను హత్య చేశాడు.. కానీ కోర్టు నిర్దోషని తెలిపింది
Comments
Please login to add a commentAdd a comment