గల్ఫ్ రైతులకు అందని 'రైతుబంధు' | Rythu Bandhu scheme to be benfit for Gulf nris | Sakshi
Sakshi News home page

గల్ఫ్ రైతులకు అందని 'రైతుబంధు'

Published Tue, Jul 17 2018 10:46 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

Rythu Bandhu scheme to be benfit for Gulf nris - Sakshi

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రైతుబంధు' పథకం గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న సుమారు ఒక లక్షమంది ప్రవాసీ కార్మికులకు అందడంలేదు. బతుకుదెరువుకోసం ఎడారి దేశాలకు పయనమైన చిన్న, సన్నకారు రైతులు కూడా 'రైతుబంధు' పథకంలో పెట్టుబడి సాయం పొందడానికి అర్హులేనని స్వయంగా రాలేనిపక్షంలో వారి కుటుంబ సభ్యులు మే 17 నుండి అధికారుల నుండి పట్టాదార్ పాస్ బుక్, చెక్కు పొందవచ్చని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి రైతులందరికీ కొత్త పాసుపుస్తకాలు, ఎకరాకు పంటకు రూ.4 వేల చొప్పున పెట్టుబడిసాయం, ప్రతీ రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. కానీ విదేశాలకు వలస వెళ్లిన పేద రైతులకు ఈ సాయం అందక ముఖ్యంగా అరబ్ గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వలసకార్మికులు నష్టపోతున్నారు. స్వయంగా భూ యజమాని వచ్చి తమ పేరిట ఉన్న పాసుపుస్తకాన్ని, రైతుబంధు చెక్కు అందుకోవాలని, బీమా ఫారంపై సంతకం చేయాలనే నిబంధన వలసరైతుల పాలిట శాపమైంది. గల్ఫ్ దేశాల నుండి ప్రత్యేకంగా ఇందుకోసం రావాలంటే ఎంతో వ్యయంతో కూడుకున్న పని.

భూమిని నమ్ముకుని బతికిన బక్క రైతులు బోర్లు తవ్వించి, వ్యవసాయం దెబ్బతిని అప్పులపాలై పొట్ట చేతపట్టుకుని గల్ఫ్‌ దేశాలకు వెళ్లినవారే. ప్రభుత్వం త్వరగా విధాన నిర్ణయం తీసుకొని మానవతా దృక్పథంతో సమస్యను పరిష్కరించాలని గల్ఫ్ లోని రైతుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఎన్నారై రైతుల నుండి మండల వ్యవసాయ అధికారి లేదా తహసీల్దార్ ఈ-మెయిల్ ద్వారా ఒక అంగీకార పత్రాన్ని తెప్పించుకోవాలి.  'రైతుబంధు' పెట్టుబడిసాయం చెక్కులను గల్ఫ్ వెళ్లిన రైతుల ఎన్ఆర్ఓ (నాన్ రెసిడెంట్ ఆర్డినరీ) బ్యాంకు అకౌంట్లలో లేదా వారి కుటుంబ సభ్యుల అకౌంట్లలో జమచేయాలి. 18 నుండి 59 ఏళ్ల  కలిగిన ప్రతి రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లుగానే ప్రవాసంలో ఉన్న రైతులకు కూడా బీమా వర్తింపచేయాలి. ఎన్నారై రైతుల వ్యవహారాలను చూడటానికి వ్యవసాయ శాఖ కమిషనరేట్ లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. 

గల్ఫ్ దేశాలలో కొన్నేళ్లు కష్టపడి సంపాదించిన సొమ్ముతో తమ గ్రామాలలో కొద్దిపాటి వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినవారు వేలాదిమంది ఉన్నారు. చట్ట ప్రకారం ఎన్నారైలు వ్యవసాయ భూములు కొనుగోలు చేయడానికి వీలులేదు. ఆధార్ నెంబర్ ను పట్టాదార్ పాస్ బుక్ లకు అనుసంధానం చేయడం వలన ఆధార్ కార్డు లేని ఎన్నారైలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆధార్ చట్టం ప్రకారం ఎన్నారైలు (ప్రవాస భారతీయులు) ఆధార్ కార్డు పొందడానికి అర్హత లేదు. ఒక సంవత్సరకాలంలో 182 రోజులు (ఆరు నెలలు) భారత్ లో నివసిస్తేనే ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

స్వస్థలాలను వదిలి సంవత్సరాలతరబడి విదేశాలలో ఉండటంవలన గల్ఫ్ ఎన్నారైల పేర్లను ఓటర్ జాబితాల నుండి, రేషన్ కార్డుల నుండి తొలగిస్తున్నారు. సబ్సిడీ బియ్యం ఇవ్వకండి, కానీ రేషన్ కార్డుల్లో తమ పేర్లు కొనసాగించాలని గల్ఫ్ ప్రవాసులు కోరుతున్నారు.  ప్రవాసీలు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డులు పొందలేక రకరకాల నిబంధనల గందరగోళంతో తాము    మాతృభూమికి దూరంగా నెట్టివేయబడుతున్నామని ఆవేదన చెందుతున్నారు.  

-మంద భీంరెడ్డి, ప్రవాసి మిత్ర +91 98494 22622

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement