గల్ఫ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న దృశ్యాలు (ఫైల్)
జగిత్యాలక్రైం: నిరుద్యోగ యువత ఆసరాన్ని అవ కాశంగా మలుచుకుంటున్నారు గల్ఫ్ నకిలీ ఏజెంట్లు. విదేశాలకు పంపిస్తామని.. మంచి పని..అంతకంటే మంచి వేతనం ఉంటుందని నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. గల్ఫ్ ఏజెంట్ల మోసాలపై జగిత్యాల జిల్లా పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. దీంతో ఏజెంట్లు రహస్య ప్రాంతాల్లో యువతకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ తమ ఆగడాలను కొనసాగిస్తున్నారు. జిల్లా వారం క్రితం గల్ఫ్‌లో ఉపాధి చూపిస్తామంటూ కొండగట్టు పరిసర ప్రాంతం లోని ఓ మామిడితోటలో రహస్యంగా ఇంటర్వ్యూ లు నిర్వహించారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని పురాణిపేట ఓ నివాస గృహంలో అనుమతి లేని గల్ఫ్ ఇంటర్వ్యూలు చేసిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో సుమారు 340 మంది ఎలాంటి అనుమతులు లేకుండా గల్ఫ్ ఏజెంట్లుగా చెలామణి అవుతున్నారు. ట్రావెల్స్ పెట్టుకొని గల్ఫ్ దేశాలకు పంపిస్తామంటూ విస్తృత ప్రచారం చేయించుకుంటున్నారు. వీరిని నమ్మిన కొందరు ఇంటర్వ్యూలకు హాజరై పాస్‌పోర్టుతోపాటు కొంత మేరకు డబ్బు ముట్టజెప్పారు.
పోలీసుల నిఘా
జగిత్యాల జిల్లా నుంచి గల్ఫ్‌లో ఉపాధి కోసం వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఏజెంట్ల మోసాలు సైతం చాలానే వెలుగుచూస్తున్నాయి. దీంతో వారి ఆగడాలను అరికట్టేందుకు జిల్లా పోలీసులు పలుమార్లు గల్ఫ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న ప్రాంతాలపై దాడులు చేశారు. ఇది గ్రహించిన గల్ఫ్ ఏజెంట్లు గత నెల రోజులుగా రహస్య ప్రాంతాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. దీంతో చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు గల్ఫ్ ఏజెంట్ల ఉచ్చులో పడి మోసాలకు గురవుతున్నారు.
రెండు ట్రావెల్స్‌లకే లైసెన్స్‌లు
జగిత్యాల జిల్లాలో గల్ఫ్ దేశాలకు పంపించేందుకు రెండు ట్రావెల్స్‌లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. మిగతా వారికి ఎలాంటి అనుమతులు లేవు. దీంతో వారంతా ముంబై, చెన్నై, ఢిల్లీ ప్రాంతాల నుంచి గల్ఫ్ ఏజెంట్లను తెప్పించి ఇక్కడ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారి నుంచి ఒరిజినల్ పాస్‌పోర్టుతోపాటు కొంత మేరకు అడ్వాన్స్‌గా తీసుకుంటున్నారు.
పోలీసుల కొరడా
జగిత్యాల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు పోలీసులు కొరడా ఝులిపిస్తు న్నారు. జిల్లాలో ఆరు నెలల కాలంలో సుమారు 60కి పైగా కేసులు నమోదు చేశారు. అయినా ఏజెంట్లలో మార్పు రావడం లేదు. మంచి కంపె నీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలుకుతూ నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment