తిరిగి కారుపై దాడిచేసిన పెద్దపులి
గాయాలతో అటవీప్రాంతానికి వెళ్లిపోయిన పులి
ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఘటన
మర్రిపాడు/ఆత్మకూరు రూరల్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి సమీపంలో నెల్లూరు–ముంబయి జాతీయ రహదారిపైకి ఒక్కసారిగా పెద్దపులి రావడం కలకలం రేగింది. ఆ పులిని ఓ కారు ఢీకొనడం.. ఆగ్రహంతో పెద్దపులి తిరిగి ఆ కారుపై దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఆకస్మిక ఘటనతో కారులో ప్రయాణిస్తున్నవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కారులో ఉన్న వ్యక్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బద్వేల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఓ కారుకు కదిరినాయుడుపల్లి సమీపంలో వెలిగొండ అటవీ ప్రాంతం వద్ద ఒక్కసారిగా పెద్దపులి అడ్డువచ్చింది.
పెద్దపులిని కారు ఢీకొని కొద్దిదూరం ముందుకు దూసుకువెళ్లింది. దీంతో పెద్దపులికి కోపం వచ్చి వాహనం ముందు భాగంపై తన పంజాతో దాడి చేసింది. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో లోపల ఉన్నవారికి ప్రమాదం తప్పింది. కారు ముందుభాగం ధ్వంసమైంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.
పెద్దపులి కాలి ముద్రలు, కారు ఢీకొనడం వల్ల పులి గాయపడినట్లుగా ఆనవాలు కనుగొని ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. అటవీశాఖ అధికారులు కదిరినాయుడుపల్లి సమీపంలోని అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. పెద్దపులి సంచారంతో కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతం సమీపంలోని పడమటినాయుడుపల్లి, చుంచులూరు తదితర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
శేషాచలం చేరిన పెద్దపులి!
శ్రీశైలం–శేషాచలం మధ్య పెద్దపులుల కారిడార్ ఉంది. శ్రీశైలం–నాగార్జున సాగర్ అభయారణ్యం నుంచి శేషాచలం వరకు పులుల విస్తరణ కోసం అధికారులు పలు చర్యలు చేపట్టారు. అయితే, శేషాచలం వరకు పెద్దపులి వెళ్లిందా.. లేదా.. అని ఇప్పటికీ సంశయంగానే ఉండేది. ఆ అనుమానాలకు తెరదించుతూ శేషాచలం అటవీ ప్రాంతం వరకు పెద్దపులి చేరిందని కదిరి నాయునిపల్లె సమీపంలో సోమవారం జరిగిన ఘటనతో స్పష్టమైంది.
Comments
Please login to add a commentAdd a comment