మంజు (ఫైల్)
సాక్షి, కర్ణాటక: మైసూరు జిల్లాలో ఇప్పటికే చిరుత పులులు అనేకమందిని పొట్టనపెట్టుకుంటూ ఉంటే, మరోవైపు పెద్ద పులులు కూడా జనం మీద పడుతున్నాయి. ఓ పులి యువకున్ని చంపిన సంఘటన మైసూరు జిల్లాలో హెచ్‌డీ కోటె పరిధిలో డీబీ కుప్ప వద్ద నాగరహోళె అడవుల్లోని బళ్ళె ప్రాంతంలో ఆదివారం జరిగింది. మరణించిన యువకుడిని మంజుగా (18) గుర్తించారు.
వివరాలు... అటవీ శాఖకు చెందిన వసతి గృహాల వెనుక భాగంలో ఉన్న అడవిలో మంజు స్నేహితులతో కలిసి కట్టెల కోసం వెళ్లాడు. అటువైపు వచ్చిన పులి మంజు పైన దాడి చేసింది. తల వెనుకాల భాగంలో కొరికి, పంజాలతో చీల్చడంతో తీవ్రగాయాలై ప్రాణాలు వదిలాడు. అతని వెంట వచ్చిన మరికొంత మంది యువకులు అక్కడినుంచి పరుగులు పెట్టారు. అంతకుముందు మంజు అరుపులకు సమీపంలోని అటవీ సిబ్బంది వచ్చారు. వారిని చూసిన పులి మంజును వదిలి వెళ్ళిపోయింది. అటవీ సిబ్బంది వెంటనే మంజు మృతదేహాన్ని అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. అంతరసంత పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
స్థానికుల ధర్నా..
క్వార్టర్స్ వెనుకలే పులి తిరుగుతున్నా అటవీ సిబ్బంది పట్టించుకోలేదని, అందుకే యువకుడు బలయ్యాడని స్థానిక ప్రజలు అటవీ అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరు– చామరాజనగర రహదారిపై రాస్తారోకో చేయడంతో వాహనాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో పోలీసు, అటవీ ఉన్నతాధికారులు చేరుకుని రూ. 15 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment