సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ జంతువు పులి వరుసగా వేటగాళ్ల ఉచ్చుకు బలైపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. రెండు నెలల్లో మూడు పులులు మృత్యువాతపడటం.. వన్యప్రాణుల సంరక్షణలో నిఘా, పర్యవేక్షణ లోపాలను బట్టబయలుచేస్తోంది. ఈ వరుస ఘటనల పట్ల పర్యావరణవేత్తలు, పరిశోధకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొంతకాలంగా ‘వన్యప్రాణి సంరక్షణ’ ప్రత్యేక విభాగం పనిచేయడం లేదు.
దానికి ప్రత్యేకంగా ఒక ఉన్నతాధికారిని నియమించలేదు. దాదాపు పదేళ్లు గడుస్తున్నా కవ్వాల్ టైగర్ రిజర్వ్ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. అక్కడ యూనిఫైడ్ కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు కాలేదు. వీటికి తోడు వన్యప్రాణుల సంరక్షణపై నిఘా పెట్టాల్సిన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ నామమాత్రంగానే పనిచేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
కాగజ్‌నగర్‌లో ఒకటి..
గత శనివారం (అక్టోబర్ 30న) కాగజ్‌నగర్‌లో అక్రమంగా పులిచర్మం కలిగి ఉన్న ఇద్దరు పట్టుబడ్డారు. దీనిపై విచారణ చేయగా.. పత్తి చేలోకి అడవిపందులు రాకుండా బిగించిన ఉచ్చులకు చిక్కి గత నవంబర్, డిసెంబర్‌లోనే పులి హతమైనట్టుగా తెలిసింది. పులి కింది దవడ, ఇతర ఎముకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతం పూర్వాపరాలు, ఇతర అంశాలపై అటవీశాఖ వివరణ, స్పష్టీకరణ ను ‘సాక్షి’ఫోన్‌ద్వారా తీసుకునే ప్రయత్నం చేస్తే పీసీసీఎఫ్ ఆర్.శోభ, అదనపు పీసీసీఎఫ్ సిదానంద్ కుక్రేటీ, ఇతర అటవీ అధికారులు స్పందించలేదు.
సెప్టెంబర్‌లో ములుగు జిల్లాలో రెండు!
ఇక సెప్టెంబర్‌లో ములుగు జిల్లాలోని తాడ్వాయి అటవీ ప్రాంతంలో... చత్తీస్‌గఢ్ నుంచి వచి్చనట్టుగా భావిస్తున్న ఓ పులి గుత్తికోయ వేటగాళ్లు పెట్టిన ఉచ్చుకు బలైంది. అధికారులు ఒకటే పులి అని చెప్పి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేశారు. కానీ రెండు పెద్ద పులులు బలై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ సందర్భంగానే పులుల పర్యవేక్షణ, ట్రాకింగ్, రక్షణ ఏర్పాట్లకు సంబంధించిన లోటుపాట్లు, వైఫల్యాలు బయటపడ్డాయి. వేటగాళ్లు ఏ ఒక్క చోటో, ఒక్క రోజో పెట్టిన ఉచ్చుకే పెద్దపులులు బలైపోయే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు.
మెప్పుకోసం అధికారుల తిప్పలు...
పర్యావరణానికి మూలాధారమైన వన్యప్రాణులు ముఖ్యంగా పులుల సంరక్షణను రాష్ట్రం ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదన్న పర్యావరణవేత్తల వాదనకు ఈ వరుస ఘటనలు బలం చేకూరుస్తున్నాయి. రాష్ట్రంలో అటవీశాఖ అధికారులు అడవులు, వన్యప్రాణుల సంరక్షణ పక్కనపెట్టి.. హరితహారం పనుల్లోనే బిజీగా గడుపుతున్నారని, ఉన్నతాధికారులు, రాజకీయ నేతల మెప్పుకోసం ప్రయతి్నస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణలో వెంటనే వైల్డ్‌లైఫ్ వింగ్, డివిజన్‌ను పూరి్థస్థాయిలో ఏర్పాటుచేయాలి. టైగర్ రిజర్వ్‌లో క్షేత్రస్థాయిల్లో ఈ బేస్‌క్యాంప్‌లతో పెట్రోలింగ్, ట్రాకింగ్ కార్యకలాపాలు సాగేలా చర్యలు తీసుకోవాలి. కొంత డబ్బుకే జంతువులను చంపేందుకు సిద్ధమయ్యే స్థానిక వేటగాళ్లకు అడ్డుకట్ట వేయాలి. ఈ దిశలో అటవీశాఖ కట్టుదిట్టమైన కార్యాచరణ అమలు చేయాలి. పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తున్నామంటున్నారే తప్ప వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నట్టు కనిపించడం లేదు.
– కె.సందీప్‌రెడ్డి, వన్యప్రాణి సంరక్షణ కార్యకర్త, ఎన్విరాన్‌మెంట్ సైన్స్ టీచర్
రాష్ట్రంలో వేటగాళ్ల ఉచ్చులకు మరో పెద్దపులి బలి కావడం ఎంతో వేదన కలిగిస్తోంది. పులుల పర్యవేక్షణ కోసం నిఘా ఉండాలి. ఆనుపానులు గ్రహించి అది సాగే దారిలో ప్రమాదానికి గురికాకుండా నియంత్రించాలి. జాగ్రత్త చర్య తీసుకోవాలి. ఫుట్ పెట్రోలింగ్, ట్రాకింగ్ తదితరాలను సీరియస్‌గా చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఫీల్డ్‌లోనే ఉంటూ అడవులకు దగ్గరగా ఉన్న స్థానిక సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, లోకల్‌గా సమాచార సేకరణ వంటివి జరుగుతున్నట్టు లేదు.
– రాష్ట్ర అటవీ శాఖ, రిటైర్డ్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment