తెలుగు రాష్ట్రాల్లోని పెద్దపులుల సంఖ్య 104 | 104 Big tigers to live only Telugu states | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లోని పెద్దపులుల సంఖ్య 104

Published Sun, Apr 12 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM

104 Big tigers to live only Telugu states

కర్నూలు, గుంటూరు, ప్రకాశం. నల్లగొండ, మహబూబ్‌నగర్, ఉభయగోదావరి, ఆదిలాబాద్ జిల్లాల అటవీ ప్రాంతాలే ఆరంభం నుంచీ పెద్దపులులకు ఆవాసం. 1991 నాటికి 92 ఉన్న పులులు 1995 వరకు 34కు తగ్గిపోయాయి. నల్లమల అటవీ ప్రాంతంలో అనూహ్యంగా పెరిగిన మావోయిస్టుల కార్యకలాపాలే దీనికి ప్రధాన కారణం.
 

సాక్షి ప్రతినిధి, హైదరాబాద్: భారతదేశంలో ఏ రాష్ట్రానికి తీసిపోని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల పరిధుల్లో పెద్ద పులుల సంఖ్య వందకు పైగా పెరిగింది. అటవీ శాఖ వర్గాలు అందించిన తాజా సమాచారం ప్రకారం వీటి సంఖ్య 104. కర్నూలు, గుంటూరు, ప్రకాశం. నల్లగొండ, మహబూబ్‌నగర్, ఉభయగోదావరి, ఆదిలాబాద్ జిల్లాల అటవీ ప్రాంతాలే ఆరంభం నుంచి పెద్దపులులకు ఆవాసం. 70వ దశకానికి వచ్చేసరికి ఉభయగోదావరి, ఆదిలాబాద్ జిల్లాల కన్నా ఇతర ఐదు జిల్లాల్లో పులుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అప్పట్లో అటవీ ప్రాంతాల్లో నక్సలైట్ల సంచారం పెద్దగా లేకపోవడం, పోడు వ్యవసాయం తక్కువగా ఉండటమే దీనికి కారణం. 1989-90 మొదలు 2004 వరకూ రాష్ట్రంలో పోలీసులకూ, నక్సలైట్లకూ మధ్య జరిగిన విధ్వంసకర ఘటనల్లో పులులు కూడా బలయ్యాయి.
 
 92 నుంచి 34కు...
 కేంద్ర ప్రభుత్వం 1983లో ఆంధ్రప్రదేశ్‌లోని 5 జిల్లాల పరిధిలో 10,000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతాల్లో నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్‌ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. అప్పుడు తీసుకున్న సంరక్షణ చర్యల ఫలితంగా 1980 ఆరంభం వరకూ 40 వరకు ఉన్న పులుల సంఖ్య 1991 నాటికి 92కి చేరింది. 1995 నాటికి ప్రాజెక్టు పరిధిలోని పులుల సంఖ్య 34కు తగ్గిపోయింది. నల్లమల అటవీ ప్రాంతంలో అనూ హ్యంగా పెరిగిన మావోయిస్టు కార్యకలాపాలే దీనికి ప్రధాన కారణం. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భీకరపోరు కారణంగా పులులు చెల్లాచెదుర య్యాయి. తమకు అడ్డు వస్తున్నాయనీ, రాకపోక లకు ఇబ్బందిగా మారిందనీ నక్సలైట్లు కొన్నింటికి విషం పెట్టి చంపారని అటవీ అధికారులు తమ రికార్డుల్లో నమోదు చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించారు.
 
 2006 నుంచి ఏటా పది చొప్పున పెరిగాయి
 1995 తరువాత నక్సలైట్లు తమ శిబిరాలను నల్లమల నుంచి ఆంధ్రప్రదేశ్-ఒరిస్సా (ఏవోబీ) సరిహద్దు ప్రాంతానికి మార్చడంతో నల్లమలలో 80 శాతం మేర వారి కార్యకలాపాలు తగ్గాయి. 2005 నాటికి పూర్తిగా నిలిచిపోయాయి. అటవీ సిబ్బంది స్వేచ్ఛగా అడవిలో తిరుగాడటం మొదలుపెట్టారు. అందుబాటులో ఉన్న పరిజ్ఞానంతో పులుల సంర క్షణకు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. ఫలితంగా 2006 నుంచి 2015 మార్చి దాకా ఏడాదికి పది చొప్పున పెరుగుతూ వచ్చాయి.  ‘వాటి సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. దాంతో మేము తీసుకున్న చర్యలు మంచి ఫలితాలిచ్చాయి. ఇప్పుడు నల్లమలలో వాటి సంఖ్య వంద దాటింది’ అని అటవీ శాఖ సీనియర్ అధికారి ఒకరు గర్వంగా చెప్పారు.
 
 ఉభయగోదావరి, ఆదిలాబాద్‌లో నిల్
 ఉభయగోదావరి అటవీ ప్రాంతాల్లో ఒకప్పుడు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న పులులు దాదాపుగా కనుమరుగయ్యాయి. పాపికొండల్లో 2 నుంచి 3 పులులు ఉన్నాయని స్థానికులు చెపుతున్నప్పటికీ అటవీ శాఖ  ఇంకా నిర్ధారణకు రాలేదు. ఆదిలాబాద్ జిల్లాలో 2000 చదరపు కిలోమీపటర్ల పరిధిలో విస్తరించిన కవాల్ అటవీ ప్రాంతంలో కూడా ఒక్క పులి కూడా కనిపించడం లేదు. ఇక్కడ పులుల సంచారం ఉన్నదని గిరిజనులు చెబుతున్నా తమకు వాటి ఆనవాళ్లు కనిపించలేదని అటవీ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement