వివరాలు వెల్లడిస్తున్న ఎస్సై సుధాకరరెడ్డి వెనుక నిందితులు చిత్రంలో స్వాధీనం చేసుకున్న సొత్తు
ఆకివీడు: కారులో తిరుగుతూ సినీఫక్కీలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను ఆకివీడు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆకివీడు ఎస్సై కె.సుధాకరరెడ్డి గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. విజయవాడకు చెందిన బొజ్జగాని మురళి, చిన్నపోతుల కిరణ్‌కుమార్, మంత్రి నాగరాజు, తాడేపల్లికి చెందిన ఇట్టా బాలాజీ ముఠాగా ఏర్పడి జాతర్లు, ప్రారంభోత్సవాల వద్దకు కారులో వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో ఆకివీడులో మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయ పునః ప్రారంభోత్సవం జరుగుతుందని తెలుసుకుని గతనెల 24న ఇక్కడకు వచ్చి బస చేశారు. 25న ఉదయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వద్దకు వచ్చిన భక్తుల నుంచి రూ.9,300 నగదు, రెండు సెల్‌ఫోన్లు కాజేశారు.
బాధితులు లబోదిబోమనడంతో ఆలయ నిర్వాహకులు మైక్‌లో జేబు దొంగలున్నారని ప్రచారం కూడా చేశారు. విషయం తెలిసిన ముఠా సభ్యులు చల్లగా అక్కడ నుంచి జారుకున్నారు. ఆకివీడు పెట్రోల్ బంకు వద్ద కాపు కాసిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. జాతర్లు, ప్రారంభోత్సవాలు, ఉత్సవాల సమాచారం తెలుసుకుని వీరు నలుగురు పక్కా ప్లాన్‌తో దొంగతనాలకు పాల్పడుతుం టారని ఎస్సై చెప్పారు. భీమవరానికి చెం దిన కల్లపల్లి లోవరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. కారులో పరారవుతున్న నలుగురు నిందితులను పట్టుకుని విచారించి రెండు సెల్‌ఫోన్లు, రూ.8 వేల నగదు, నాలుగు రూ.2 వేల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై చెప్పారు. కారును సీజ్‌చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచామన్నారు. కేసును ఛేదించడంలో ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు ప్రకాష్, రాజేష్, అప్సారీ, కానిస్టేబుళ్లు రఘు, రైటర్ జయరాజు, రమణ సహకరించారని ఎస్సై సుధాకరరెడ్డి పేర్కొన్నారు. నిందితుల్లో ఒకడైన ఇట్టా బాలాజీ గతంలో ఆరు కేసుల్లోనూ, బొజ్జగాని మురళీ పది కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment