
జాతర నిర్వాహకులుతో మాట్లాడుతున్న తహసీల్దార్, పోలీసులు
డోర్నకల్: కరోనా వైరస్ వ్యాప్తితో ఓవైపు ప్రజలు అల్లాడుతోంటే.. మీరు జాతర ఎలా చేస్తారని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని లింబ్యాతండాలోని వెంకటేశ్వరస్వామి(పుల్లు బాబోజీ) ఆలయంలో ప్రతీ సంవత్సరం మే నెలలో జాతర నిర్వహిస్తారు. శుక్రవారం జాతరలో పాల్గొనేందుకు భారీగా గిరిజనులు తరలి వచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ అమలును పట్టించుకోకుండా వివిధ ప్రాంతాల నుంచి గిరిజనులు జాతరకు తరలివచ్చారు.
ఆలయంలో పూజలు నిర్వహిస్తూ జంతుబలి చేస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యులు తహసీల్దార్ జి.వివేక్, మండల ప్రత్యేక అధికారి సయ్యద్ ఖుర్షీద్, సీఐ ఇస్లావత్ శ్రీనివాస్, ఎస్‌ఐ భద్రునాయక్‌తో సహా పోలీసులు తండాకు చేరకున్నారు. ఆలయ పరిసరాల్లో గుంపులుగా చేరిన గిరిజనులను అక్కడి నుంచి పంపించారు. ఆలయ పూజారితో పాటు నిర్వాహక కమిటీలో ఒకరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈమేరకు అధికారులు మాట్లాడుతూ.. లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయంలో నిబంధనలు అతిక్రమించి జాతరకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేసి వారిని అక్కడి నుంచి పంపించినట్లు తెలిపారు. ఆలయ నిర్వాహక కమిటీకి చెందిన 11 మందిపై కేసు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
చదవండి: కరోనా పేరు తెలియని అడవిబిడ్డలు
చదవండి: చెరువులో విషప్రయోగం..