తీరు మారలేదు... చోరీలు మానలేదు | He Released On Bail Month Ago And Thefts At Six Places | Sakshi
Sakshi News home page

తీరు మారలేదు... చోరీలు మానలేదు

Published Wed, Aug 24 2022 9:04 AM | Last Updated on Wed, Aug 24 2022 9:24 AM

He Released On Bail Month Ago And Thefts At Six Places - Sakshi

చిలకలగూడ : పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. పీడీయాక్టుపై శిక్ష అనుభవించాడు. నెల రోజుల క్రితమే బెయిల్‌పై విడుదలై తన స్నేహితుడితో కలిసి ఆరుచోట్ల పంజా విసిరాడు. చివరకు పోలీసులకు చిక్కి మరోమారు కటకటాల పాలయ్యాడు. ఇరువురు పాత నేరస్తులను అరెస్ట్‌ చేసి రూ. లక్షల నగదు, నగలు స్వాదీనం చేసుకున్నట్లు సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ స్నేహమెహ్రా తెలిపారు. సంతోష్‌నగర్‌కు చెందిన మెహబూబ్‌ఆలీ అలియాస్‌ కుస్రూ  హోటల్‌ కుక్‌గా పని చేసేవాడు. చెడు వ్యసనాలకు బానిసైన అతను తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడేవాడు.

1996 నుంచి హైదరాబాద్, సైబరాబాద్, నల్గొండ కమిషనరేట్ల పరిధిలో 20 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. బెయిల్‌పై బయటికి వచ్చిన వెంటనే చోరీలకు పాల్పడటం పోలీసులకు పట్టుబడడం పరిపాటిగా మారింది.  సంతోష్‌నగర్‌ ఠాణా పోలీసులు 2020లో అతడిపై పీడీయాక్టు ప్రయోగించారు.  ఈ ఏడాది జూలై నెలలో జైలు నుంచి విడుదలయ్యాడు. భవానీనగర్‌ తలాబ్‌కట్ట రాజాగల్లీకి చెందిన స్నేహితుడైన పాత నేరస్తుడు మహ్మద్‌ ఫిరోజ్‌తో కలిసి చిలకలగూడ, నల్లకుంట, నల్గొండ ఠాణాల పరిధిలో ఆరుచోట్ల ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం నిందితులు మెహబూబ్‌అలీ, మహ్మద్‌ ఫిరోజ్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించారు. వీరి నుంచి 130 గ్రాముల బంగారు నగలు, 500 గ్రాముల వెండి, రూ.37 వేల నగదు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారిని చాకచక్యంగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాఘవేంద్ర, ఎస్‌ఐలు శ్రీశైలం, నరేందర్, షేక్‌బురాన్, నర్సింహులు, చిలకలగూడ సీఐ నరేష్‌లతోపాటు సిబ్బందిని సౌత్‌జోన్‌ టాస్‌్కఫోర్స్‌ డీసీపీ స్నేహమెహ్రా అభినందించి రివార్డులు ప్రకటించారు.   

(చదవండి: ఫిబ్రవరిలో బయో ఏషియా సదస్సు: కేటీఆర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement