ఎమ్మెల్యే కాలనీ దొంగతనం కేసు: వంట మనిషే లాకర్‌ దొంగ | Banjarahills Police Investigate MLA Colony Case Cook Is Accused | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కాలనీ దొంగతనం కేసు: వంట మనిషే లాకర్‌ దొంగ

Published Wed, Jan 11 2023 7:35 AM | Last Updated on Wed, Jan 11 2023 7:35 AM

Banjarahills Police Investigate MLA Colony Case Cook Is Accused - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే  రాజధాని హోటల్‌ యజమాని అరిహంత్‌ జైన్‌ ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసును బంజారాహిల్స్‌ క్రైం పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు అదే ఇంట్లో పని చేస్తున్న వంట మనిషిగా గుర్తించారు. మంగళవారం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బంజారాహిల్స్‌ ఏసీపీ ఎం. సుదర్శన్, సీఐ నరేందర్, డీఐ ప్రవీణ్‌ కుమార్, డీఎస్‌ఐ మల్లికార్జున్‌తో కలిసి దొంగతనం వివరాలు వెల్లడించారు. రాజస్తాన్‌ నాగోర్‌ జిల్లా బేగాన మండలం గుండీసన్‌ గ్రామానికి  చెందిన చంద్రశేఖర్‌(31) రెండున్నరేళ్ళ క్రితం అరిహంత్‌ జైన్‌ ఇంట్లో వంట మనిషిగా కుదిరాడు.

పక్కా ప్రణాళికతో ఈ ఇంట్లో వంటవాడిగా చేరిన చంద్రశేఖర్‌ ఇంటి యజమానుల కదలికలు ఎప్పటికప్పుడు గమనిస్తూ డబ్బు లావాదేవీలు, ఆభరణాలు ఎక్కడెక్కడ దాచి పెడతారు తదితర వివరాలు గమనిస్తూ వచ్చి రాజస్తాన్‌కు చెందిన తన స్నేహితుడు రామకృష్ణ అలియాస్‌ రామకిషన్‌తో ప్లాన్‌ వేశాడు. ఇందులో భాగంగానే రామకృష్ణకు ఎప్పటికప్పుడు ఇన్‌స్ట్రా ద్వారా ఇంటి వివరాలను, లొకేషన్, ఆభరణాలు ఎక్కడ దాస్తారు తదితర వివరాలు చెప్పసాగాడు. ఇందులో భాగంగానే ఈ నెల 3వ తేదీన జైన్‌ ఇంటి వాచ్‌మెన్‌ సెలవులో ఉండటంతో ఇదే అదునుగా దొంగతనానికి ప్లాన్‌ వేసిన చంద్రశేఖర్‌ రామకృష్ణను రాజస్తాన్‌ నుంచి పిలిపించాడు. సాయంత్రం 6.30 గంటలకు ఆ ఇంటికి చేరుకున్న రామకృష్ణ గోడ దూకి సీసీ కెమెరాల వ్యవస్థను భగ్నం చేసి అవి రికార్డు కాకుండా చూశాడు.

రాత్రి 12.30 గంటల ప్రాంతంలో మొదటి అంతస్తుకు వెళ్ళి కప్‌బోర్డ్‌లో ఉన్న లాకర్‌ను చంద్రశేఖర్‌ సాయంతో దొంగిలించి మూడో అంతస్తులో సర్వెంట్‌ క్వార్టర్స్‌లో ఉన్న చంద్రశేఖర్‌ గది ముందు పెట్టి దానిపైన వేరే డబ్బాలు పెట్టి చెప్పుల స్టాండ్‌ అడ్డుగా పెట్టి కనిపించకుండా చేశారు. అదే రాత్రి 2.30 గంటలకు రామకృష్ణ రాజస్తాన్‌కు ఉడాయించాడు. ఈ నెల 4న బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అయిదు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఆ ఇంటి ముందు ఉన్న ఒక సీసీ కెమెరాలో మాత్రమే ఓ వ్యక్తి గోడ దూకి లోనికి వెళ్ళడం అదే వ్యక్తి బయటికి రావడం మాత్రం కనిపించింది.

దొంగిలించిన సొత్తు బయటికి తీసుకెళ్ళలేదని నిర్ధారణకు వచ్చిన డీఐ ప్రవీణ్‌ కుమార్‌ మరింత లోతుగా విచారణ చేపట్టి అక్కడ పని చేస్తున్న 12 మందిని విచారించారు. మూడు రోజులు విచారించినా ప్రధాన నిందితుడు చంద్రశేఖర్‌ మాత్రం పోలీసుల ముందుకు వస్తూనే ఏ మాత్రం బయట పడలేదు. పోలీసులకు గాలిస్తున్న సమయంలోనే లాకర్‌ను తెరిచేందుకు తీసుకొచ్చిన గ్యాస్‌ కట్టర్, ఇతర సామాగ్రి చంద్రశేఖర్‌ గది ముందు దొరికాయి. దీంతో ఇంటి పనిమనిషుల సాయంతోనే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని భావించి అనువనువు గాలించగా చంద్రశేఖర్‌ గది ముందు లాకర్‌ దొరికింది.

తెరిచి చూడగా అందులో నగదుతో పాటు ‘ 25 లక్షల విలువ చేసే ఆభరణాలు భద్రంగా ఉన్నాయి. తన స్నేహితుడు రామకృష్ణ సాయంతో లాకర్‌ను దొంగిలించిన చంద్రశేఖర్‌ గ్యాస్‌ కట్టర్‌తో అది తెరుచుకోకపోవడంతో తన ఇంటి ముందు భద్రపరిచినట్లుగా చెప్పాడు. మరో పది రోజుల్లో రాజస్తాన్‌కు వెళ్ళే ప్లాన్‌ వేసుకున్న చంద్రశేకర్‌ ఆ లోపున రామకృష్ణను పిలిపించి ఇద్దరూ కలిసి ఈ లాకర్‌ను తీసుకెళ్ళాలని పథకం వేసి చివరికి పోలీసులకు చిక్కారు. చంద్రశేఖర్‌ను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. రామకృష్ణ పరారీలో ఉన్నాడని తెలిపారు.  

(చదవండి: అయ్యో.. ఏమైందో ఏమో!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement