సాక్షి హైదరాబాద్: నేరం జరిగిన వెంటనే పోలీసులు చేసే మొదటి పని.. అనుమానితులు ఎవరు? వారికి పాత నేర చరిత్ర ఏమైనా ఉందా? అని ఆరా తీయడమే! దీనిని గమనించిన నేరస్తులు.. పోలీసుల దృష్టి మరల్చేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఇంటి పేరు, తండ్రి పేరుతో సహా మార్చి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. మారు పేర్లతో పాన్, ఆధార్ కార్డ్‌లు సృష్టించి వారి నేర చరిత్రను కప్పిప్పుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పాత పేర్లతో ఉన్న స్థిరచరాస్తులను విక్రయిస్తున్నారు. బ్యాంక్ ఖాతాలను మూసేస్తున్నారు.
నేరం జరిగిన తర్వాత అనుమానితులు, నేరం జరిగిన తీరును పరిశీలించాక.. పోలీసుల డేటా బేస్‌లో పాత నేరస్తులు, ఇలాంటి తరహా నేరాలేమైనా జరిగాయా అని విచారణాధికారులు పరిశీలిస్తారు. ఒకవేళ ఉంటే.. ఆ కోణం నుంచి దర్యాప్తు మొదలుపెడతారు. పాత నేరస్తుల కదలికలపై పోలీసుల ని ఘా ఉంటుంది కాబట్టి పట్టుకోవటం సులవవుతుంది. అదే కొత్త నేరస్తుడైతే పట్టుకోవటం ఆలస్యమే.. వాంగ్మూలం ఇప్పించడంలోనూ ఆలస్యం జ రుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం సృష్టించి న ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్య కేసులో ప్రధాన నిందితుడు మేరెడ్టి మట్టారెడ్డి చేసిందిదే.
అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.. కానీ..
మట్టారెడ్డి అసలు పేరు మేరెడ్డి అశోక్ రెడ్డి. ఎవరో జ్యోతిష్యుడు సూచించాడని తన పేరును మట్టారెడ్డిగా, తన తండ్రి పేరు వెంకట నరసింహారెడ్డి కాగా.. ఇంద్రసేనా రెడ్డిగా మార్పించాడు. అశోక్ రెడ్డిపై నారాయణగూడ, మలక్‌పేట, సరూర్‌నగర్ పీఎస్‌లలో మూడు చీటింగ్ కేసులు ఉన్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. తన నేర చరిత్రను కప్పిపుచ్చేందుకు 2007 లోనే తన పేరును మార్చి, నకిలీ పాన్ కార్డ్ పొందాడు. గతంలోనే అశోక్ రెడ్డి అరెస్ట్‌కు వారంట్ కూడా జారీ అయ్యిందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అయితే పేరు మారడంతో అరెస్ట్ చేయలేకపోయారు.
పాత పేరు బయటపడకుండా..
పాత నేరాల తాలుకు ఆనవాళ్లు కనిపించకుండా ఉండేందుకు నేరస్తులు ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నారు. మట్టారెడ్డి తన పాత పేరు (అశోక్ రెడ్డి)తో ఉన్న స్థిరచరాస్తులను విక్రయించేశాడని, బ్యాంక్ ఖాతాలను కూడా మూసేశాడని ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణా రెడ్డి తెలిపారు. దీంతో తాజా నేరాల్లో పోలీసులకు చిక్కినా.. తొలిసారి నేరస్తుడిగా భావించాలని, శిక్ష కాస్త తగ్గుతుందని నిందితుల ఎత్తుగడగా ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
పోలీసుల రికార్డ్స్ ఎక్కడ కూడా మట్టారెడ్డి పాత నేరస్తుడిగా లేకపోవటంతో మొద ట్లో పోలీసులు కూడా అమాయకుడే అనుకున్నారు. కానీ, సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో మట్టారెడ్డి తడబడటంతో పోలీసులకు క్లూ దొరికింది. మట్టారెడ్డి ఫామ్ హౌస్, అందులోని సీసీటీవీ గురించి తెలిసింది. అందులోని ఫుటేజ్‌ను పరిశీలించగా మట్టారెడ్డి అసలు పేరు మేరెడ్డి అశోక్ రెడ్డి అని. ఇక్కడ తీగ కూపీ లాగితే మట్టారెడ్డి అలియాస్ అశోక్ రెడ్డి పాత నేర చరిత్ర అంతా బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment