ముంబై: బాద్లాపూర్ లైంగిక వేధింపుల నిందితుడి కస్టడీ మరణంపై బాంబే హైకోర్టు ముంబై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడి ఎన్‌కౌంటర్ అనుమానాలకు తావిస్తోందని.. ఈ సంఘటనను ఎన్‌కౌంటర్‌గా పేర్కొనలేమని పేర్కొంది. నిందితుడు అక్షయ్ షిండేను జైలు నుంచి బయటకు తీసుకొచ్చినప్పటి నుంచి శివాజీ ఆస్పత్రిలో మరణించినట్లు ప్రకటించే వరకు సీసీటీవీ ఫుటేజీని తమకు సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
కాగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన కేసులో నిందితుడు పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. విచారణ సమయంలో నిందితుడు అక్షయ్ శిండేపై.. అతడి మొదటి భార్య వేధింపుల కేసు పెట్టింది.
అయితే ఈ కేసులో ప్రశ్నించేందుకు పోలీసులు నిందితుడిని కారులో తీసుకొని తాలోజా జైలు నుంచి బద్లాపూర్ బయల్దేరారు. ఈ క్రమంలో పోలీస్ అధికారి చేతిలో నుంచి తుపాకీ లాక్కొని ఎస్కార్టింగ్ పోలీసు బృందంపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే పోలీసులు ఎదురుకాల్పులు జరపగా.. అతడు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు.
తీవ్రంగా గాయపడిన షిండేను ఛత్రపతి శివాజీ మహరాజ్ దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనలో ఏఎస్‌ఐ నీలేష్ మోరే, ఇన్‌స్పెక్టర్ సంజయ్ షిండేలు గాయపడ్డారని చెప్పారు. అయితే ఇదంతా అబద్దమని, తన కొడుకునే పథకం ప్రకారమే హతమార్చారని ఆరోపిస్తూ నిందితుడు తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.. ఈ సందర్భంగా పోలీసులకు న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. నిందితుడు కాల్చిన ఆ రెండు బుల్లెట్లు ఎక్కడ..? అంటూ ప్రశ్నించింది. ‘ఇది నమ్మడం కష్టం. ప్రాథమికంగా ఫౌల్ ప్లే కనిపిస్తుంది. ఒక సామాన్యుడు రివాల్వర్ లాగా పిస్టల్‌ను కాల్చలేడు. ఏ టామ్, డిక్, హ్యారీ చేయగలడు, బలహీనమైన వ్యక్తి పిస్టల్‌ను లోడ్ చేయలేడు.’
పోలీసుల కథనాన్ని నమ్మడం కష్టంగా ఉంది. నిందితుడు పోలీసులపైకి మూడు బుల్లెట్లు కాల్చారని మీరు చెప్పారు. ఒక్కటే పోలీసులను తాకింది. మిగతా రెండు బుల్లెట్ల ఏమయ్యాయి. పోలీసు అధికారి సంజయ్ షిండే నిందితుడి తలపై కాకుండా కాళ్లు లేదా చేతులపై గురిపెట్టి ఉండాల్సింది. వాహనంలో ఉన్న నలుగురు అధికారులు ఒక్క వ్యక్తిని అధిగమించలేకపోయారంటే ఎలా నమ్మాలి?
అతడేం భారీ మనిషికాదు. మీరు సులభంగానే అతడిని అడ్డుకొని ఉండొచ్చు. దీనిని ఎన్‌కౌంటర్ అని అనలేం. అలాగే ఇంతవరకు కేసు పత్రాలు సీఐడీకి ఎందుకు అప్పగించలేదు. ఏ దర్యాప్తులో అయినా సమయం కీలకం. ఆలస్యం అవుతుంటే ప్రజల్లో అనుమానాలు వస్తాయి’ అని కోర్టు ప్రశ్నించింది. పోలీసుల చర్యను అనుమానించడం లేదు కానీ నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment