MLA colony
-
TS: సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ పొలిటీషియన్, రాజ్యసభ మాజీ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి(92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. 70 ఏళ్ల పాటు రాజకీయాలలో క్రియాశీలంగా పనిచేసి మచ్చలేని నేతగా పేరుపొందారు. సోలిపేట స్వస్థలం సిద్దిపేట జిల్లా దుబ్బాక (మం) చిట్టాపూర్ గ్రామం. రామచంద్రారెడ్డి తొలితరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. సర్పంచ్ నుంచి ఎంపీ వరకు రాజకీయాల్లో రాణించిన సోలిపేట గతంలో దొమ్మాట (ప్రస్తుత దుబ్బాక) ఎమ్మెల్యేగా పని చేశారు. కాంగ్రెస్, టీడీపీ, లోక్‌సత్తాతో పని చేసిన సోలిపేట.. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లారాయన. భారత చైనా మిత్రమండలికి అధ్యక్షులుగా, సి. ఆర్. ఫౌండేషన్, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు వంటి సంస్థలకు సభ్యులుగా సేవలందించారు. సోలిపేట రామచంద్రారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సి.నారాయణరెడ్డి చిన్న కుమార్తెను.. రామచంద్రారెడ్డి పెద్ద కుమారుడు వెంకటేశ్వర్ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఆయన కుటుంబం నివాసం ఉంటోంది. అక్కడే ఆయన కన్నుమూయగా.. సందర్శనార్థం ఆయన పార్థీవదేహాన్ని అక్కడే ఉంచారు. ఈ సాయంత్రం ఫిలింనగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. హరీష్‌రావు సంతాపం సోలిపేట రామచంద్రారెడ్డి మృతిపట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన పాత్ర స్ఫూర్తిదాయకమన్నారు. సర్పంచి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎదిగి ప్రజల మన్ననలు పొందారన్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెబుతూ.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇదీ చదవండి: ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా లింబాద్రి -
ఎమ్మెల్యే కాలనీ దొంగతనం కేసు: వంట మనిషే లాకర్ దొంగ
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే రాజధాని హోటల్ యజమాని అరిహంత్ జైన్ ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసును బంజారాహిల్స్ క్రైం పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు అదే ఇంట్లో పని చేస్తున్న వంట మనిషిగా గుర్తించారు. మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బంజారాహిల్స్ ఏసీపీ ఎం. సుదర్శన్, సీఐ నరేందర్, డీఐ ప్రవీణ్ కుమార్, డీఎస్ఐ మల్లికార్జున్‌తో కలిసి దొంగతనం వివరాలు వెల్లడించారు. రాజస్తాన్ నాగోర్ జిల్లా బేగాన మండలం గుండీసన్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్(31) రెండున్నరేళ్ళ క్రితం అరిహంత్ జైన్ ఇంట్లో వంట మనిషిగా కుదిరాడు. పక్కా ప్రణాళికతో ఈ ఇంట్లో వంటవాడిగా చేరిన చంద్రశేఖర్ ఇంటి యజమానుల కదలికలు ఎప్పటికప్పుడు గమనిస్తూ డబ్బు లావాదేవీలు, ఆభరణాలు ఎక్కడెక్కడ దాచి పెడతారు తదితర వివరాలు గమనిస్తూ వచ్చి రాజస్తాన్‌కు చెందిన తన స్నేహితుడు రామకృష్ణ అలియాస్ రామకిషన్‌తో ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే రామకృష్ణకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రా ద్వారా ఇంటి వివరాలను, లొకేషన్, ఆభరణాలు ఎక్కడ దాస్తారు తదితర వివరాలు చెప్పసాగాడు. ఇందులో భాగంగానే ఈ నెల 3వ తేదీన జైన్ ఇంటి వాచ్మెన్ సెలవులో ఉండటంతో ఇదే అదునుగా దొంగతనానికి ప్లాన్ వేసిన చంద్రశేఖర్ రామకృష్ణను రాజస్తాన్ నుంచి పిలిపించాడు. సాయంత్రం 6.30 గంటలకు ఆ ఇంటికి చేరుకున్న రామకృష్ణ గోడ దూకి సీసీ కెమెరాల వ్యవస్థను భగ్నం చేసి అవి రికార్డు కాకుండా చూశాడు. రాత్రి 12.30 గంటల ప్రాంతంలో మొదటి అంతస్తుకు వెళ్ళి కప్‌బోర్డ్‌లో ఉన్న లాకర్‌ను చంద్రశేఖర్ సాయంతో దొంగిలించి మూడో అంతస్తులో సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉన్న చంద్రశేఖర్ గది ముందు పెట్టి దానిపైన వేరే డబ్బాలు పెట్టి చెప్పుల స్టాండ్ అడ్డుగా పెట్టి కనిపించకుండా చేశారు. అదే రాత్రి 2.30 గంటలకు రామకృష్ణ రాజస్తాన్‌కు ఉడాయించాడు. ఈ నెల 4న బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అయిదు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఆ ఇంటి ముందు ఉన్న ఒక సీసీ కెమెరాలో మాత్రమే ఓ వ్యక్తి గోడ దూకి లోనికి వెళ్ళడం అదే వ్యక్తి బయటికి రావడం మాత్రం కనిపించింది. దొంగిలించిన సొత్తు బయటికి తీసుకెళ్ళలేదని నిర్ధారణకు వచ్చిన డీఐ ప్రవీణ్ కుమార్ మరింత లోతుగా విచారణ చేపట్టి అక్కడ పని చేస్తున్న 12 మందిని విచారించారు. మూడు రోజులు విచారించినా ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ మాత్రం పోలీసుల ముందుకు వస్తూనే ఏ మాత్రం బయట పడలేదు. పోలీసులకు గాలిస్తున్న సమయంలోనే లాకర్‌ను తెరిచేందుకు తీసుకొచ్చిన గ్యాస్ కట్టర్, ఇతర సామాగ్రి చంద్రశేఖర్ గది ముందు దొరికాయి. దీంతో ఇంటి పనిమనిషుల సాయంతోనే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని భావించి అనువనువు గాలించగా చంద్రశేఖర్ గది ముందు లాకర్ దొరికింది. తెరిచి చూడగా అందులో నగదుతో పాటు ‘ 25 లక్షల విలువ చేసే ఆభరణాలు భద్రంగా ఉన్నాయి. తన స్నేహితుడు రామకృష్ణ సాయంతో లాకర్‌ను దొంగిలించిన చంద్రశేఖర్ గ్యాస్ కట్టర్‌తో అది తెరుచుకోకపోవడంతో తన ఇంటి ముందు భద్రపరిచినట్లుగా చెప్పాడు. మరో పది రోజుల్లో రాజస్తాన్‌కు వెళ్ళే ప్లాన్ వేసుకున్న చంద్రశేకర్ ఆ లోపున రామకృష్ణను పిలిపించి ఇద్దరూ కలిసి ఈ లాకర్‌ను తీసుకెళ్ళాలని పథకం వేసి చివరికి పోలీసులకు చిక్కారు. చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రామకృష్ణ పరారీలో ఉన్నాడని తెలిపారు. (చదవండి: అయ్యో.. ఏమైందో ఏమో!) -
కిరణ్.. ఇంటికే పరిమితం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అధికారిక నివాసమైన క్యాంపు కార్యాలయాన్ని వీడి ఎమ్మెల్యే కాలనీలోని తన సొంత ఇంటికి విచ్చేశారు. గురువారం ఉదయం హోటల్ నుంచి అల్పాహారం తెప్పించుకున్నారు. అనంతరం చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన కొందరు సన్నిహితులతో మాట్లాడుతూ టీవీ చూస్తూ గడిపారు. 12 గంటలకు నగరంలో ఓ పెళ్లికి హాజరై 20 నిమిషాల్లోనే ఇంటికి తిరిగొచ్చారు. మధ్యాహ్నమంతా తన నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇంట్లోకి ఎవరినీ అనుమతించ లేదు. కుటుంబ సభ్యులతోనే గడిపారు. కాగా, రాజీనామా చేసిన తర్వాత కిరణ్‌ను గురువారం ఏ ఒక్క ఎమ్మెల్యేగానీ, మంత్రిగానీ కలవలేదు. పెద్దఎత్తున శాసనసభ్యులు వచ్చి కిరణ్‌ను కలుస్తారని అంచనా వేయగా పెద్ద నేతలెవరూ రాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరచింది.