సాక్షి, హైదరాబాద్: సీనియర్ పొలిటీషియన్, రాజ్యసభ మాజీ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి(92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. 70 ఏళ్ల పాటు రాజకీయాలలో క్రియాశీలంగా పనిచేసి మచ్చలేని నేతగా పేరుపొందారు.
సోలిపేట స్వస్థలం సిద్దిపేట జిల్లా దుబ్బాక (మం) చిట్టాపూర్ గ్రామం. రామచంద్రారెడ్డి తొలితరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. సర్పంచ్ నుంచి ఎంపీ వరకు రాజకీయాల్లో రాణించిన సోలిపేట గతంలో దొమ్మాట (ప్రస్తుత దుబ్బాక) ఎమ్మెల్యేగా పని చేశారు. కాంగ్రెస్, టీడీపీ, లోక్‌సత్తాతో పని చేసిన సోలిపేట.. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లారాయన.
భారత చైనా మిత్రమండలికి అధ్యక్షులుగా, సి. ఆర్. ఫౌండేషన్, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు వంటి సంస్థలకు సభ్యులుగా సేవలందించారు. సోలిపేట రామచంద్రారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సి.నారాయణరెడ్డి చిన్న కుమార్తెను.. రామచంద్రారెడ్డి పెద్ద కుమారుడు వెంకటేశ్వర్ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఆయన కుటుంబం నివాసం ఉంటోంది. అక్కడే ఆయన కన్నుమూయగా.. సందర్శనార్థం ఆయన పార్థీవదేహాన్ని అక్కడే ఉంచారు. ఈ సాయంత్రం ఫిలింనగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
హరీష్‌రావు సంతాపం
సోలిపేట రామచంద్రారెడ్డి మృతిపట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన పాత్ర స్ఫూర్తిదాయకమన్నారు. సర్పంచి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎదిగి ప్రజల మన్ననలు పొందారన్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెబుతూ.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇదీ చదవండి: ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా లింబాద్రి
Comments
Please login to add a commentAdd a comment