వైభవంగా మణిమకొండ జాతర
వనదేవతలకు మంగళస్నానం
మోతుగూడెం (రంపచోడవరం) : ఒడిశా ప్రభుత్వం ఆంధ్రాలోని చింతూరు మండలం పొల్లూరు జలపాతం వద్ద రెండేళ్లకోసారి నిర్వహించే మణిమకొండ జాతరలో సోమవారం గిరిజన పూజారులు వనదేవతల మంగళస్నానం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం వనదేవతలైన కన్నమరాజు, బాలరాజు, పోతురాజు, ముత్యాలమ్మ ఉత్సవ మూర్తులను సీలేరు నది దాటించి ఉరేగింపుగా పొల్లూరు గ్రామానికి తీసుకువచ్చి భక్తుల సందర్శన నిమిత్తం గంటసేపు ఉంచారు. అనంతరం ఊరేగింపుగా రథాన్ని పొల్లూరు జలపాతం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ గిరిజన పూజారులు గృహ కింద గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేయగా, అమ్మవారు వారి పూజలకు సంతృప్తి చెంది పూజారులకు ‘బంగారు చేప’ అవతారంలో దర్శినమిచ్చిందన్నారు. దాంతో పూజారులు వనదేవతలకు గంగా జలంతో మంగళస్నానం చేయించి రూపంలేని దేవతమూర్తులకు ప్రాణప్రతిష్ఠ చేయించారు. తిరిగి వనదేవతలను సాయంత్రం మూడు గంటలకు ఒడిశా తరలించారు. ఐటీడీఏ పీవో చినబాబు, సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ ముఖ్య ఇంజినీరు ఎల్.మోహన్‌రావు, లక్కవరం ఫారెస్ట్ రేంజర్ జి.ఉషారాణి, ఎమ్మార్వో జగన్‌మోహన్‌రావు, తులసిపాక పీహెచ్‌సీ డాక్టర్ క్రాంతికిరణ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శ్యాంప్రసాద్ తదితరులు వనవదేవతలను దర్శించుకున్నారు.