![Sri Peddagattu Lingamanthula Swamy Jathara To Held On Feb 5th - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/5/04SPT161-604891.jpg.webp?itok=eGAnTPrh)
విద్యుత్ దీపాల వెలుగులో పెద్దగట్టు వ్యూ
సూర్యాపేట: తెలంగాణలో రెండో అతి పెద్దదైన శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఆదివారం గంపల ప్రదక్షిణతో ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామ శివారులో ఐదురోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది. ఇప్పటికే జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యాదవుల ఆరాధ్య దైవంగా భావించే లింగమంతుల స్వామి జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సుమారు 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జాతర మొదటి రోజు అత్యంత కీలకమైన ఘట్టం గంపల ప్రదక్షిణ. కేసారం గ్రామం నుంచి చౌడమ్మ తల్లి ఉన్న దేవరపెట్టెను తీసుకొని యాదవ, రెడ్డి కులస్తులు కాలినడకన బయలుదేరి దురాజ్‌పల్లిలో ఉన్న గొల్లగట్టు (పెద్దగట్టు)కు చేరుకుంటారు. రెండో రోజు సోమవారం చౌడమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు. మూడో రోజు మంగళవారం స్వామివారి కల్యాణోత్సవంలో భాగంగా చంద్రపట్నం వేస్తారు. నాలుగో రోజు జరిగే కార్యక్రమం నెలవారం. కేసారం నుంచి పాలు తీసుకొచ్చి రెండు కొత్త బోనం కుండల్లో పాలు పొంగిస్తారు. జాతరలో ఐదోరోజైన గురువారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనార్థం ఉంచుతారు.
జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు
జాతర సమయంలో పోలీసులు వాహనదారులకు దూరభారం తగ్గించేలా ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నారు. ఇందుకోసం ఇటీవల నిర్మించిన జాతీయ రహదారి 365 బీబీని ఉపయోగించుకుంటున్నారు.
►హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద జాతీయ రహదారి 365 బీబీ మీదుగా మళ్లించి రాఘవాపురం స్టేజీ, నామవరం నుంచి గుంజలూరు స్టేజీ మీదుగా విజయవాడ వైపు పంపనున్నారు.
►విజయవాడ వైపు వెళ్లే భారీ, ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను టేకుమట్ల నుంచి జాతీయ రహదారి 365 బీబీ మీదుగా మళ్లించి నాయకన్‌గూడెం మీదుగా కోదాడ వైపు పంపనున్నారు.
►హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను స్వామి నారాయణ్ గురుకుల్ స్కూల్ ఎదురుగా ఉన్న ఎస్‌ఆర్‌ఎస్‌పీ కెనాల్ రోడ్డు మీదుగా రోళ్లబండ తండాకు మళ్లించి రాయినిగూడెం వద్ద యూట ర్న్ చేసి హైదరాబాద్ వైపు పంపనున్నారు. nవిజయవాడ వైపు నుంచి హైదరా బాద్ వైపు వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్‌నగర్, నార్కట్‌పల్లి మీదుగా పంపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment