పినపాక, న్యూస్‌లైన్:
గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క - సారలమ్మ జాతర గురువారం మండలంలోని కుర్నవల్లిలో ఘనంగా జరిగింది. మూడో రోజు వనంతో పాటు సమ్మక్క ఆలయ ప్రాంగణంలోని గద్దెనెక్కడంతో భక్తులు భారీసంఖ్యలో దర్శించుకున్నారు. తొలుత వనంతోపాటు సమ్మక్క కుంకుమ భరిణ తో కలిసి గిరిజన పూజారుల ఆధ్వర్యంలో నంది గామ గుట్టల నుంచి బురదారం మీదుగా ఊరేగింపుగా కుర్నవల్లికి చేరుకుంది. అనంతరం బుధవారమే ఆలయానికి చేరుకున్న సారలమ్మ, పగిడిద్దరాజులు గ్రామ శివారులోకి మేళతాళాలు, భక్తుల కోలాహలంతో వెళ్లి ఎదుర్కోలు పలికారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు పూనకాలతో ఊగుతూ అమ్మవారి వెంట ఆలయం వద్దకు వచ్చారు. ఆలయం ఎదుట వడి బియ్యంతో దీక్ష గా ఉన్న మహిళల మీదుగా ఆలయంలోకి వచ్చిన సమ్మక్కకు గిరిజన సంప్రదాయం ప్రకారం పగిడిద్దరాజుతో ఆలయ పూజారి(దేవరబాల) పోలెబోయిన సుందరయ్య ఘనంగా వివాహం జరిపిం చారు. అనంతరం భక్తులు వన దేవతలకు అమితంగా ఇష్టమైన బంగారం(బెల్లం), బోనాలను గద్దెల వద్ద ఉంచి మొక్కులు చెల్లించుకున్నారు.
పోటెత్తిన భక్తజనం :
సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా గురువారం కుర్నవల్లి గ్రామం భక్తజనంతో నిండిపోయింది. పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం, గుండాల, చర్ల వాజేడు, వెంకటాపురం, వరంగల్ జిల్లాలోని మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, పస్రా, గోవిందరావుపేట మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వనదేవతలకు పూజలు నిర్వహించారు. సమ్మక్క ఎదుర్కోలు ఉత్సవం, సమ్మక్క - పగిడిద్దరాజుల వివాహ ఉత్సవాలను భక్తులు వీక్షించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధక్ష్యలు పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, స్థానిక సర్పంచ్ పోలెబోయిన తిరుపతయ్యలు కుటుంబ సమేతంగా వనదేవతలకు పూజలు నిర్వహించారు.
గద్దెనెక్కిన వనదేవతలు
Published Fri, Feb 21 2014 4:44 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM
Advertisement
Advertisement