వర్ధన్నపేట రూరల్, న్యూస్‌లైన్ : వర్ధన్నపేట మండలంలోని ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయం సోమవారం భక్తజనంతో పోటెత్తింది. జాతర, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భోగి పండుగ సందర్భంగా సోమవారం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జాతర రెండో రోజున తెల్లవారుజాము నుంచి స్వామికి నూతన వస్త్రాలంకరణ, తోరణబంధనం, విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, ధ్వజారోహణ, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ గావిం చారు.
ఆలయ ప్రాంగణంలో తోరణాలు కట్టి పసుపు, కుంకుమతో స్వామివారిని అభిషేకించారు. ఆలయ పూజారి నందనం శివరాజయ్య ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు బియ్యం, బండారి(పసుపు), కుడుకలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తులు బోనాలు తలపై పెట్టుకుని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేశారు.
క్యూలో భక్తుల
మల్లన్నను దర్శించుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొని స్వా మివారిని దర్శించుకున్నారు. పాడిపంటలు, పిల్లాపాపల ను సల్లంగ చూడాలని ముడుపులు కట్టారు. అలాగే ఆల య ప్రాంగణంలోని వివిధ దేవతామూర్తుల విగ్రహాల వద్ద పూజలు చేశారు. నైవేద్యంతో బోనం వండి ఎల్లమ్మ ఆల య ఆవరణలో వేప ఆకులతో బోనాలను తలపై పెట్టుకొని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.
జాతర వద్ద భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, వరంగల్ ఏవీవీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం కోఆర్డినేటర్ కె.శ్రీనివాస్ ఆధ్వర్యం లో 50 మంది వలంటీర్లు సేవలు అందించారు. వారం రోజుల పాటు సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు.
మల్లన్నను దర్శించుకున్న ప్రముఖులు
ఎంపీ సిరిసిల్ల రాజయ్య, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, వరదరాజేశ్వర్‌రావు, మార్నేని రవీందర్‌రావు, రాజయ్యయాదవ్ మల్లికార్జునస్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అర్బన్ ఎస్పీ
జాతర సందర్భంగా భద్రతా ఏర్పాట్లను అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మామునూరు డీఎస్పీ సురేష్‌కుమార్‌కు పలు సూచనలు చేశా రు. వాహనాల పార్కింగ్ నిర్వహణపై జాగ్రత్తగా వ్యవహరించాలని, జాతర సజావుగా ముగిసేలా చూ డాలని సిబ్బందిని ఆదేశించారు.
దేదీప్యమానంగా దేవాలయం
బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లన్న ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భారీ సంఖ్యలో వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
నేటి కార్యక్రమాలు
మకర సంక్రాంతి సందర్భంగా ఆలయంలో మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం, రాత్రి ఎడ్ల బండ్ల ప్రభలతో ఆలయం చుట్టూ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. సోమవారం 50వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ చైర్మన్ వడిచర్ల శ్రీనివాస్, ఈఓ శేషుభారతి తెలిపారు.
జనవోలు మల్లన్న జాతర వైభవంగా
Published Tue, Jan 14 2014 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement
Advertisement