
నేటి నుంచే దురాజ్‌పల్లి లింగమంతుల జాతర
ఐదురోజులు జరిగే ఈ వేడుకకు 20 లక్షలకుపైగా భక్తులు వస్తారని అంచనా
లింగా.. ఓ లింగా అంటూ శివ నామస్మరణతో మార్మోగిపోయే దురాజ్‌పల్లి లింగమంతులస్వామి జాతర (పెద్దగట్టు జాతర) ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. మేడారం తర్వాత ఎక్కువమంది భక్తులు హాజరయ్యే రెండో అతిపెద్ద జాతర ఇదే. యాదవుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న ఈ లింగమంతుల జాతరను ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. మాఘమాసంలో తొలి ఆదివారం ప్రారంభమై 5 రోజులపాటు సాగుతుంది.
ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జాతర కనుల పండువగా జరగనుంది. తెలంగాణలోని అన్ని జిల్లాలతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి భక్తులు తరలివస్తారు. ఈసారి జాతరకు 20 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. – సాక్షి ప్రతినిధి, నల్లగొండ
ఒక్కో రోజు ఒక్కో విశిష్టత..
ఆదివారం రాత్రి గంపల ప్రదక్షిణతో సూర్యాపేట మండలం కేసారం నుంచి దేవరపెట్టెను తీసుకురావడంతో లింగమంతుల స్వామి జాతర ప్రారంభమవుతుంది. ఐదోరోజు ఊరేగింపుతో దేవరపెట్టెను కేసారానికి తీసుకెళ్లడంతో జాతర ముగుస్తుంది. అక్కడి నుంచి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెంలోని బైకాన్ల ఇళ్లలో దేవరపెట్టె భద్రపరుస్తారు. మళ్లీ రెండేళ్ల తర్వాత జాతరకు నెల రోజుల ముందు దీనిని చీకటాయపాలెం నుంచి కేసారం తీసుకొస్తారు.
1 జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం గంపల ప్రదక్షిణ. ఆదివారం కేసారం నుంచి చౌడమ్మతల్లి ఉన్న దేవరపెట్టెను రెడ్డిగొల్ల కులస్తులు కాలినడకన బయలుదేరి దురాజ్‌పల్లిలో ఉన్న గొల్లగట్టు (పెద్దగట్టు)కు చేరుకుంటారు. ఈ సందర్భంగా గజ్జెల లాగులు ధరించి భేరీ చప్పుళ్లు, కత్తుల విన్యాసాలు చేస్తూ ఓ లింగా.. ఓలింగా నామస్మరణతో గంపలతో ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు.
మెంతబోయిన, రెడ్డిగొల్ల, మున్న వారి సమక్షంలో రెండు బోనాలు చేసి పూజలు నిర్వహిస్తారు. అనంతరం రాజులు, పూజార్ల (గొల్ల కులస్తులు) అవసరాలు (కత్తులను కడుపునకు అంటుకోవడం) పెడతారు.
2 సోమవారం చౌడమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు. మెంతబోయిన వంశస్తులు తెచ్చిన తొలి గొర్రె (తల్లి గొర్రె), మున్న వంశీయులు తెచ్చిన బద్దెపాల గొర్రె, రెడ్డిగొల్ల వంశీయులు తెచ్చిన వర్ధ గొర్రెను అమ్మవారి ముందు జడత పడతారు. అనంతరం మున్న వంశీయులు ఉపవాసం ఉండి నిష్టతో తెచ్చిన బద్దెపాల గొర్రెను అమ్మవారికి బలి ఇస్తారు.
అనంతరం గొర్రె ఆయాలు సాయాలు (పేగులు, లివర్, కిడ్నీలు, నల్లెడ, గుండె, మాంసం) నెయ్యిలో వేసి వంట చేస్తారు. చౌడమ్మతల్లికి గొర్రె అవసరాలు పెట్టి పూజిస్తారు. మెంతబోయిన వారు జాగిలాలుగా వ్యవహరిస్తూ, వారి మెడలో కండువాలు ఉంచి మున్న వంశీయులు పట్టుకోగా, బండపై పోసిన అన్నాన్ని మెంతబోయిన వారు తింటారు.
3 మంగళవారం స్వామివారి కల్యాణోత్సవంలో భాగంగా చంద్రపట్నం వేస్తారు. మెంతబోయిన వారు తీసుకొచ్చిన పూజాసామగ్రి, తెల్లపిండి, పచ్చపిండి, పసుపు, కుంకుమలతో చంద్రపట్నం వేస్తారు. చెక్కపై పసుపు, కుంకుమలు వేసి అందంగా పట్నం వేస్తారు. అనంతరం యాదవ వంశీయులు స్వామివారి కల్యాణం జరిపిస్తారు. దీంతో చంద్రపట్నం, స్వామివారి కల్యాణం తంతు ముగుస్తుంది. ఈ సందర్భంలో రాజులు, పూజారులు, బైకాన్లు కథలు చెబుతారు.
4 బుధవారం జరిగే కార్యక్రమం నెలవారం. కేసారం నుంచి పాలు తీసుకొచ్చి రెండు కొత్త బోనం కుండల్లో పొంగిస్తారు. అనంతరం మున్నవారి గొర్రెను బలి ఇస్తారు. ఈ సందర్భంగా బైకాన్లు, బక్కులు కథలు చెప్పడం ద్వారా తంతు పూర్తి చేస్తారు. బలి ఇచ్చిన గొర్రెను బైకాన్లకు సగం, మెంతబోయిన వారికి సగం ఇస్తారు. అనంతరం ఆయా వంశీయులు ఆ మాంసాన్ని వండుకొని తినడం ఆనవాయితీ.
5 గురువారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. జాతర తంతు పూర్తయిన తర్వాత భక్తులు తుదిసారిగా మొక్కులు చెల్లించి ఇంటికి బయలుదేరుతారు. దీంతో జాతర ముగుస్తుంది.
వాహనాల మళ్లింపు ఇలా
సూర్యాపేట టౌన్: పెద్దగట్టు జాతర నేపథ్యంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామునుంచి వాహనాల మళ్లింపు కోసం పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రద్దీ తగ్గే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.
» హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద మళ్లించి నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ మీదుగా విజయవాడకు పంపిస్తారు.
» విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ వద్ద మళ్లించి హుజూర్‌నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కట్‌పల్లి మీదుగా పంపిస్తారు.
» హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద జాతీయ రహదారి 365 మీదుగా మళ్లించనున్నారు.
» కోదాడ నుంచి సూర్యాపేటకు వెళ్లే వాహనాలు కోదాడ, మునగాల, గుంపుల మీదుగా ఎస్సారెస్పీ కెనాల్ నుంచి బీబీగూడెం వద్ద నుంచి సూర్యాపేటకు వస్తాయి.
»సూర్యాపేట నుంచి కోదాడ వెళ్లే వా హనాలు కుడకుడ, ఐలాపురం వద్ద గల ఖమ్మం జాతీయ రహదారి మీదుగా రాఘవపురం స్టేజీ నుంచి నామవరం గ్రామం మీదుగా జాతీయ రహదారి 65పై గుంజలూరు స్టేజీ వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపు పంపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment