సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు బోధనాస్పత్రులను కరోనా వైద్యం కోసం వినియోగించుకునేందుకు జీవో ఇచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. రాష్ట్రంలో కరోనా కట్టడికి వైద్యసేవలు అందించే ఆస్పత్రుల్లో ఏ తరహా వైద్యం అందజేస్తున్నారో మంగళవారం జరిగే విచారణలో స్వయంగా తెలియజేయాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావును ఆదేశించింది. బోధనాస్పత్రులను కరోనా వైద్యం కోసం వినియోగించుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ డాక్టర్ ఆర్.శ్రీవాత్సవన్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ జరిపింది.
కరోనా వైద్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రులను ప్రభుత్వం ఎంపిక చేసినా చాలా మంది బాధితులు గాంధీకే వస్తున్నారని, వచ్చిన వారందరికీ వైద్యం అందక నానాకష్టాలు పడుతున్నారని, గేటు వద్ద మరణిస్తున్నారని పిటిషనర్ న్యాయవాది వసుధా నాగరాజ్ చెప్పారు. గాంధీలో యాంటీ ర్యాపిడ్ టెస్ట్‌లు లేకపోతే ఎలాగని, జిల్లాల్లోని ఆస్పత్రులకు వెళ్తే గాంధీకి వెళ్లాలని చెబుతున్నారని, అందుకే కరోనా ఆస్పత్రుల్లో ఏ తరహా వైద్యం అందిస్తున్నారో తాము తెలుసుకోవాలని భావిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా బాధితుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేయడాన్ని ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతోందని ప్రశ్నించింది. వేణుధర్‌రెడ్డి దాఖలు చేసిన మరో పిల్‌ను విచారించిన ధర్మాసనం.. ఫీజులపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా ఖాతరు చేయని కార్పొరేట్ ఆస్పత్రులపై తీసుకున్న చర్యలు వివరించాలని కోరింది. విచారణ ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment