
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యావసరాల పంపిణీకి వినియోగిస్తున్న ఐరిస్ సాంకేతికతతో కరోనా వ్యాపించే అవకాశం ఉందంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని పౌరసరఫరాల విభాగం ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకొహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఐరిస్‌తో కరోనా వ్యాపించే అవకాశం ఉందని, కరోనా కేసులు పూర్తిగా తగ్గే వరకు మూడో వ్యక్తి గుర్తింపు ఆధారంగా నిత్యావసరాలు పంపిణీ చేసేలా ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన ముత్యం ప్రకాశ్‌తో పాటు మరో ఇద్దరు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం మరోసారి విచారించింది. ఐరిస్ విధానం ద్వారా కరోనా వ్యాపించే అవకాశం లేదని ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరీందర్ నివేదించారు. ఈ మేరకు సరోజినీ ఆస్పత్రి సూపరింటెండెంట్ నివేదిక ఇచ్చారని తెలిపారు. ఐరిస్ టెక్నాలజీ ద్వారా దూరం నుంచే లబ్ధిదారుడిని గుర్తిస్తామని వివరించారు.
అయితే ఐరిస్ టెక్నాలజీ కంటికి ఎంత దూరంలో మెషీన్ పెడతారని ధర్మాసనం ప్రశ్నించగా.. ఆ వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని కోరారు. ఐరిస్ విధానం ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఉందని ఓ శాస్త్రవేత్త నిర్ధారించారన్న నివేదికను పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో వేలిముద్రలు తీసుకోరాదంటూ గతంలో ఇదే ధర్మాసనం ఆదేశాలు ఇచ్చిందని, ఐరిస్ విధానంతో కూడా కరోనా వ్యాపించే అవకాశమున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ విధానం ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేసేలా ఆదేశించాలని కోరారు.
చదవండి: కౌంటర్ దాఖలు చేయాలని సర్కారుకు హైకోర్టు ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment