సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకుల విభాగాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. ఈ విభాగంలో ప్రతి దానికి లంచాలు ముట్టజెప్పనిదే పనులు జరగడంలేదన్న ఆరోపణలు రావడం, ఒక ఉద్యోగిపై ఏకంగా ఏసీబీ దాడి జరగడంతో ఆ విభాగ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇటీవల ఏకంగా 16 మంది సిబ్బందిపై బదిలీ వేటు వేశారు. వీరిలో సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరంతా వరంగల్, హైదరాబాద్ జోనల్ ఆఫీసు పరిధిలో పనిచేస్తున్నవారే. ఒకేచోట ఏళ్లుగా తిష్టవేసిన వారికి స్థానచలనం కల్పించారు. ఇటీవల ఆ విభాగానికి చెందిన ఒక సీనియర్ అసిస్టెంట్ రూ.7 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. దీంతో ఒక్కసారిగా అవినీతి, అక్రమాలపై వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఫైళ్లను కావాలనే తొక్కిపెట్టడం, ఆదే శాలను పట్టించుకోకపోవడం, వ్యక్తిగత రిజిస్టర్లను సరిగా నిర్వహించకపోవడాన్ని సంచాలకులు గుర్తించారు. రోజూ కార్యాలయానికి వివిధ పనులకు వచ్చేవారి నుంచి చిన్నచిన్న పనుల కోసం లంచాలు తీసుకోవడం ఆయన దృష్టికి వచ్చాయి. సంచాలకుల పరిధిలో ఏకంగా వైద్యులు, నర్సులు సిబ్బంది అంతా కలిపి 12వేలమంది ఉంటారు. వీరిలో అనేక మంది నుంచి ఫిర్యాదులు రావడంతో సంచాలకులు తీవ్రమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. అందుకే ఒకేసారి మూకుమ్మడిగా చర్యలు తీసుకుంటూ బదిలీలు చేశారు. ఇంకా ప్రక్షాళన చేయాల్సి ఉందని శ్రీనివాసరావు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ కోఠిలోనే ఉన్న వరంగల్, హైదరాబాద్ ప్రాంతీయ సంచాలకుల కార్యాలయాలను కూడా హెడ్ ఆఫీసులోనే విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.
‘ప్రజారోగ్య’ విభాగంలో ప్రక్షాళన
Published Wed, Dec 5 2018 2:47 AM | Last Updated on Wed, Dec 5 2018 2:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment