హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డిని ప్రశ్నించిన ఏసీబీ
శుక్రవారం ఏసీబీ విచారణకు హాజరైన అధికారి... ఆరు గంటల పాటు ప్రశ్నించిన ఏసీబీ అధికారులు
బ్యాంకు లావాదేవీలపైనే ప్రధానంగా ప్రశ్నలు
ఉన్నతాధికారులు చెప్పింది చేశానని బీఎల్‌ఎన్ రెడ్డి వివరణ
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ కారు రేసు నిర్వహణ సంస్థ ఎఫ్‌ఈఓ (ఫార్ములా– ఈ ఆపరేషన్స్ లిమిటెడ్)కు హెచ్‌ఎండీఏ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది? నిధులు బదిలీ చేయాలని మిమ్మల్ని ఎవరు ఆదేశించారు? రేసు నిర్వహణ నిర్ణయాలను ఎవరెవరిని సంప్రదించి తీసుకునేవారు?’అని హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. తాను ఉన్నతాధికారుల ఆదేశాలనే పాటించానని, వారు ఏది చెబితే అదే చేశానని ఆయన సమాధానమిచ్చినట్టు తెలిసింది. ఫార్ములా–ఈ కారు రేసు కేసులో ఏ–3గా ఉన్న బీఎల్‌ఎన్ రెడ్డి శుక్రవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 9.50 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి ఆయన చేరుకున్నారు.
ఏసీబీ అధికారులు ముందుగా సూచించిన మేరకు బ్యాంకు లావాదేవీలకు సంబంధించి పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను తీసుకువచ్చారు. ఏసీబీ సీఐయూ (సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ) డీఎస్పీ మాజిద్ అలీఖాన్ బృందం బీఎల్‌ఎన్ రెడ్డిని విచారించింది. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో ఏ–1 మాజీ మంత్రి కేటీఆర్, ఏ–2 ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ విచారణ సందర్భంగా సేకరించిన వివరాలు, దర్యాప్తులో సేకరించిన ఆధారాల మేరకు బీఎల్‌ఎన్ రెడ్డిని ప్రశ్నించినట్టు తెలిసింది.
ప్రధానంగా బ్రిటన్‌కు చెందిన ఎఫ్‌ఈఓ కంపెనీకి హిమాయత్‌నగర్‌లోని ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌లోని హెచ్‌ఎండీఏ అకౌంట్స్ నుంచి నగదు ఎందుకు పంపారన్న అంశంపైనే ప్రశ్నించినట్టు సమాచారం. ఫార్ములా ఈ రేస్ సీజన్ 9 కోసం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రెండు విడతలుగా రూ.45.71 కోట్లు బదిలీ చేసినట్లు బీఎల్‌ఎన్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. నిధుల బదిలీ కోసం ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలకు సంబంధించి తన వద్ద ఉన్న అన్ని పత్రాలను ఏసీబీ అధికారులకు ఆయన అందించినట్టు సమాచారం. అవసరం మేరకు మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని బీఎల్‌ఎన్ రెడ్డికి ఏసీబీ అధికారులు సూచించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment