- భారతదేశం ‘ఆరోగ్యమస్తు’అనిపించుకోవాలంటే దేశంలో అమలవుతున్న వైద్య విధానాలు, వైద్య విద్య తీరు మారాలని, అది సేవారంగమన్న భావనను ప్రోది చేయాలని ‘ఇండిపెండెంట్ కమిషన్ ఆన్ డెవలప్‌మెంట్ అండ్ హెల్త్ ఇండియా’భావిస్తోంది. ఈ మేరకు ఆరోగ్య భారతానికి కొన్ని మార్గదర్శక సూచనలు చేసింది.
– సాక్షి, హైదరాబాద్
మార్కెట్ చట్రంలో చిక్కుకున్నందునే..
దేశంలో ప్రైవేటు వైద్యరంగం మార్కెట్ చట్రంలోకి వెళ్లిపోయింది.విస్తృత ప్రచారం చేసుకుంటూ లాభార్జనే ధ్యేయంగా అవి పనిచేస్తున్నాయి. ప్రైవేటు వైద్యం విస్తృతమై ప్రజారోగ్యం విఫలమైంది. దీంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు వైద్యమంటే హడలెత్తిపోతున్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలు పెద్ద ఎత్తున క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో వాటిలో చదివిన వారు తాము చెల్లించిన ఫీజుకు అనేక రెట్లు రాబట్టుకోవాలని భావిస్తున్నారు. దీనికోసం అనవసర వైద్య పరీక్షలు చేయించడం, అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలని ‘ఇండిపెండెంట్ కమిషన్ ఆన్ డెవలప్‌మెంట్ అండ్ హెల్త్ ఇండియా’సిఫార్సు చేస్తూ రోడ్ మ్యాప్ టూ ఇండియాస్ హెల్త్ అనే నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఆ నివేదికను తెలంగాణ రాష్ట్రానికి పంపించింది. దీన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అధ్యయనం చేస్తున్నాయి.
25% 30% మంది ఆరోగ్య బీమా ద్వారానే ప్రైవేటుకు వెళ్తున్న రోగులు
ఆరోగ్య బీమా విస్తృతి పెరిగిపోవడంతో ఇది మారింది. కేవలం వైద్య బీమాతోనే ఆసుపత్రులకు 25% రోగులు వస్తున్నారు.గత ఐదేళ్లలో గ్రూపు ఇన్సూరెన్స్ కూడా 30 శాతానికి పెరిగింది. వైద్య బీమా ప్రైవేటు ఆసుపత్రులకు లాభాల పంట పండిస్తోంది.మరోవైపు ప్రైవేటు మందుల కంపెనీలు కూడా పెద్ద ఎత్తున లాభాల బాట పట్టాయి.వాటి మధ్య పోటీ కూడా అనైతిక, అక్రమ వ్యాపారానికి దోహదపడుతోంది. బహుమతులు, ఇతరత్రా ప్రోత్సాహకాలిస్తూ వైద్యులను బుట్టలో వేసుకుంటున్నాయి. ప్రపంచ ఫార్మా రంగంలో 10% ఔషధాల ఉత్పత్తి భారత్‌లోనే అవుతున్నాయి. ఇక డయాగ్నోస్టిక్ వ్యాపారం విస్తరించింది. ఆధునిక సాంకేతికతతో ఎదుగుతోంది.
నియంత్రణ కరువవ్వడం వల్లే...
పైవేటు రంగంపై సరైన నియంత్రణ వ్యవస్థ లేదు. అనేక ఆసుపత్రులు అనర్హులైన, సరైన శిక్షణలేని వారిని నియమించుకుంటున్నాయి. విచ్చలవిడి మందుల వాడకం ఇతర దుష్ప్రభావాలకు దారితీస్తోంది.అనర్హులైన వారు తప్పుడు మందులు ఇస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. వివిధ సంప్రదాయ వైద్య కోర్సుల్లో అర్హత పొందినవారిలో 80 శాతం మంది అల్లోపతి వైద్యం చేస్తుండటం గమనార్హం. వైద్యులు, నర్సులు తాము చదువుకున్న తర్వాత ప్రైవే టు ఆసుపత్రుల్లో పనిచేయడం లేదా విదేశాల కు వెళ్లిపోవడాన్ని నియంత్రించాలి. ఒక్కో ఎంబీబీఎస్ వైద్యుడిపై ప్రభుత్వం రూ.30 లక్షలు, స్పెషలిస్టు తయారీకి రూ. 50 లక్షలు ఖర్చు చేస్తోంది. అంటే ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యను పూర్తి చేసేలా సర్కారు వారిపై రూ. 80 లక్షలు ఖర్చు చేస్తుంది. కాబట్టి రెండేళ్లు తప్పనిసరి వైద్య సేవలు చేయాలన్న నిబంధన ఉండాలి.
వైద్య నారాయణులు ఏరీ..
స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ఆసుపత్రులను వైద్యులు వ్యక్తిగతంగా నడిపించేవారు. కొన్ని ఆసుపత్రులు ట్రస్టులు, పరిశోధన సంస్థల ద్వారా అవి నడిచేవి. అలా పేదలకు ఉచిత వైద్యాన్ని అందించి ‘వైద్యో నారాయణో హరిః’అనిపించుకునేవారు.ఇప్పుడు పరి స్థితి మారింది. ప్రైవేటు ఆసుపత్రులది లాభార్జనదే లక్ష్యం. అవి 20% మంది పేదలకు ఉచితంగా సేవ చేయాలన్న నిబంధనలున్నా పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు మహారాష్ట్రలో ఇలా 5వేల పడకల్లో పేదలకు ఉచిత వైద్యం అందజేయాలి.కానీ ఏ ఆసుపత్రీ అది చేయడంలేదు. ఏడాదికి ప్రతీ పడకపై రూ.20 లక్షలు వసూలు చేస్తున్నాయి.ఏటా ఆ రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులు రూ. వెయ్యి కోట్లు దండుకుంటున్నాయి. ఉచిత వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులకు ఉచిత భూమి, పన్ను రాయితీ, వైద్య పరికరాలను పన్ను రాయితీతో దిగుమతికి అవకాశం కల్పిస్తున్నారు. ఫలితం పేదలకు దక్కడం లేదు.
ప్రైవేటు నియంత్రణ నుంచి బయటపడడానికి మరికొన్ని సిఫార్సులు...
- క్లినికల్ స్థాపన యాక్టు (సీఈఏ)ను అమలుచేయాలి. ప్రైవేటు వైద్యరంగంపై ఆధిపత్యమున్న కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఈ చట్టం అమలుకు ముందుకు రావడంలేదు. అందుకే వాటిని నియంత్రించలేకపోతున్నాయి.
- వైద్య వృత్తి అనేది దైవంతో సమానమని, మానవత్వం తప్పనిసరని వైద్య విద్యార్థులు, డాక్టర్లలో నూరిపోయాలి. వైద్యం వ్యాపారం కాదని, సేవ అని వారిలో చైతన్యం నింపాలి.
- ఔషధాల ధరలను నియంత్రించాలి. ఇతరత్రా కన్సల్టెంటు చార్జీలు, ఆపరేషన్లు, ఆసుపత్రుల చార్జీలు తదితరాలను కూడా నియంత్రించాలి.
- ప్రైవేటు వైద్య రంగానికి రాష్ట్రాలు ఇస్తున్న రాయితీలను రద్దు చేయాలి.అవి కావాలంటే ప్రజారోగ్య వ్యవస్థతో కలసి పనిచేయాలని లేకుంటే రాయితీలు రావని స్పష్టం చేయాలి.
- ఆరోగ్యరంగం మార్కెట్ చట్రం నుంచి బయటపడాలి. ప్రజారోగ్య వ్యవస్థగా అది మారాలి. అప్పుడే దేశంలో ఆరోగ్య వ్యవస్థ బాగుపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment