పశువును బంధించి కాళ్లకు వాతలు పెడుతున్న దృశ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పశు వైద్యశాలలు సమస్యలతో సతమతమవుతున్నాయి. మండలం యూనిట్‌గా తీసుకుంటే సరిపడినన్ని వైద్యశాలలు లేవు. ఉన్న వైద్యశాలల్లో తగిన సౌకర్యాలు లేవు. డాక్టర్లు ఉండీ ఉండక, కనీసం సహాయకులు కూడా లేని పరిస్థితి ఉంది. మందులు, వ్యాక్సిన్లు సరిపడినన్ని సకాలంలో అందుబాటులో ఉండకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
చాలాచోట్ల రైతులు ఇప్పటికీ నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారంటే పశు వైద్యశాలల పరిస్థితి ఎలా ఉందో, రైతులకు వాటిపై ఏపాటి నమ్మకం ఉందో అర్ధమవుతోంది. అనేక ఆస్పత్రుల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. పశు వైద్యశాలలు, వైద్యులు, మందుల కొరతపై ఇటీవల గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్).. జనగామ, కరీంనగర్, వరంగల్ సహా పలు జిల్లాల్లో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
జీఎంపీఎస్ సర్వే నిర్వహించిన జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ పశు వైద్యశాలల పరిస్థితి దారుణంగా ఉంది. అయినా పశు సంవర్ధక శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, అదేమంటే నిధుల్లేవనే సాకు చెబుతూ మూగజీవాల వైద్యాన్ని చిన్నచూపు చూస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
ఏడాది ఖర్చు రూ.12.50 కోట్లే
రాష్ట్రంలోని మూగజీవాల వైద్యం కోసం, ఆసుపత్రుల నిర్మాణం, మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏడాదిలో వెచ్చించిన మొత్తం కేవలం రూ.12.50 కోట్లు మాత్రమే. 2019–20లో ఈ మొత్తాన్ని 563 ఆసుపత్రులకు వెచ్చించినట్టు ఆ శాఖ ఉన్నతాధికారులు చెపుతున్నారు. ఇక 2020–21లో 41 ఆసుçపత్రులకు మరమ్మతులు చేయించామని ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. రాష్ట్రంలోని 2,100 పశు వైద్యశాలల్లో అవసరమైన మరమ్మతులు, కొత్త ఆసుపత్రుల నిర్మాణం కోసం ప్రభుత్వం అనుమతినిచ్చిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అంటున్నారే కానీ.. ఎప్పుడు ప్రారంభిస్తారో, ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.
పశువైద్య పోస్టులు ఖాళీ
రాష్ట్రంలో పశు వైద్యశాలలను రూరల్ లైవ్ స్టాక్ యూనిట్ (ఆర్‌ఎల్‌యూ), వెటర్నరీ డిస్పెన్సరీ (వీడీ), వెటర్నరీ హాస్పిటల్ (వీహెచ్), జిల్లా స్థాయిలో వెటర్నరీ పాలీ క్లినిక్ (వీపీసీ)లుగా వర్గీకరించారు. మండల స్థాయి ఆసుపత్రి (వీడీ)లో ఒక వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వీఏఎస్)తో పాటు మరో వెటర్నరీ అసిస్టెంట్ (వీఏ), లైవ్ స్టాక్ అసిస్టెంట్ (ఎల్‌ఎస్‌ఏ), ఆఫీస్ సబార్డినేట్ (ఓఎస్)లు అందుబాటులో ఉండాలి.
సర్జన్ పశువులకు వైద్యం చేస్తే వెటర్నరీ అసిస్టెంట్ ఆయనకు సహకరించాల్సి ఉంటుంది. మందులకు సంబంధించిన వ్యవహారాలు లైవ్‌స్టాక్ అసిస్టెంట్లు చూసుకుంటే ఆసుపత్రి నిర్వహణ ఆఫీసు సబార్డినేట్ చూసుకోవాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలోని ఏ ఒక్క ఆసుపత్రిలో కూడా ఈ నలుగురు సిబ్బంది అందుబాటులో ఉండే పరిస్థితి లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు చెపుతున్నాయి.
వీహెచ్‌లలో అసిస్టెంట్ డైరెక్టర్, ఇతర సిబ్బంది ఉండాలి. జిల్లాకు ఒకటి చొప్పున ఉండే పాలీ క్లినిక్‌లలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండాలి. సర్జరీల్లాంటివి కూడా చేయాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున సిబ్బంది కూడా అవసరం ఉంటుంది. కానీ ఎక్కడా తగిన సంఖ్యలో వైద్యులు, ఇతర సిబ్బంది లేరు.
వేధిస్తున్న మందుల కొరత
క్షేత్రస్థాయి ఆసుపత్రుల్లో కేవలం నట్టల మందు, నాలుగు రకాల వ్యాక్సిన్లు మినహాయించి ఎలాంటి మందులు ఇవ్వడం లేదు. ఇవి కూడా నాసి రకంగా ఉంటున్నాయని, సరిపడా ఉండటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో జ్వరం, నొప్పులకు సంబంధించిన మందులు, ఇంజెక్షన్లు స్టాక్ పెట్టి రైతులకు ఇచ్చేవారు. యాంటీబయాటిక్స్ కూడా అందుబాటులో ఉండేవి.
కానీ ఇప్పుడు ఏమీ ఇవ్వకుండా అన్నీ ప్రైవేటుకే రాస్తున్నారు. పశువైద్యానికి ఏటేటా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను తగ్గించడమే ఈ పరిస్థితికి కారణమని జీఎంపీఎస్ చెబుతోంది. మనుషులతో సమానంగా పశువులకు కూడా వైద్యం అందేలా ప్రభుత్వాలు పెద్ద మనసు చేసుకోవాలని జీఎంపీఎస్ ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ యాదవ్ విజ్ఞప్తి చేస్తున్నారు.
►జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో ఉన్నది ఒకే ఒక్క పశు వైద్యశాల. ఈ మండలంలో పది గ్రామాలున్నాయి. కానీ ఒక్కటే ఆసుపత్రి ఉండడంతో ఆ మండలంలోని మూగ జీవాలకు వైద్యం సకాలంలో అందడం లేదు. ఉన్న ఒక్క ఆసుపత్రిలో కూడా ఒక డాక్టర్, ఒక జూనియర్ వెటర్నరీ అధికారి పోస్టింగ్‌లు మాత్రమే ఉన్నాయి. అటెండర్ పోస్టు ఖాళీగా ఉంది. ఈ మండలంలో మరో మూడు ఆసుపత్రులు ఏర్పాటు చేయాల్సి ఉంది.
►కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని తిమ్మాపూర్, రేణికుంట పశు వైద్యశాలల్లో గొర్రెలకు నట్టల మందు ఇవ్వడం లేదు. వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. మూనకొండూరు మండలంలో ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల్లో 75 శాతం యూనిట్లకు ఉచిత దాణా ఇవ్వడం లేదు.
►ఇదే జిల్లాలోని కొత్తపల్లి పశువైద్యశాల శిథిలావస్థలో ఉంది. గంగాధర పశు వైద్యశాల కూలిపోయింది. ఇందుర్తి ఆసుపత్రిలో మందులను నిల్వ చేసే ఫ్రిజ్ లేదు. నీరు, విద్యుత్ సౌకర్యం కూడా లేదు. వరంగల్ జిల్లా హసన్‌పర్తి ఆసుపత్రి బిల్డింగ్ స్లాబ్ పగులుతోంది.
►జాతీయ వ్యవసాయ కమిషన్ సూచనల ప్రకారం ప్రతి 5 వేల పశువులకు ఒక డాక్టర్ ఉండాలి. కానీ మన రాష్ట్రంలో 20 వేల పశువులకు కూడా ఒక వైద్యుడు లేని పరిస్థితి ఉంది.
►రాష్ట్రంలోని మూగజీవాల వైద్యం కోసం, ఆసుపత్రుల నిర్మాణం, మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019–20లో వెచ్చించిన మొత్తం కేవలం రూ.12.50 కోట్లు మాత్రమేనంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కాళ్ల గడ్డలకు వాతల వైద్యం!
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మాలపాటి గ్రామంలో ఓ రైతుకు చెందిన ఎద్దు కాళ్లకు గడ్డలు ఏర్పడ్డాయి. స్థానికంగా వైద్యం చేయించినా తగ్గలేదు. దీంతో రైతు నాటు వైద్యం వైపు మళ్లాడు. ఇతర రైతులతో కలిసి ఎద్దును తాళ్లతో బంధించి కింద పడేసి పిడకలపై కాల్చిన ఇనుప చువ్వలతో కాళ్లకు దారుణంగా వాతలు పెట్టారు. ఆస్పత్రుల్లో పశువులకు సరైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం వల్లే రైతులు నాటు వైద్యం వైపు మళ్లాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
– సాక్షి, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment