Veterinary Hospitals
-
నూతన ఒరవడి.. పశువిజ్ఞాన బడి
కడప అగ్రికల్చర్ : పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. దీంతోపాటు పశువుల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంటోంది. ఇప్పటికే ఆర్బీకేల పరిధిలో సిబ్బందిని ఏర్పాటు చేసి సేవలను అందిస్తోంది.ఆసుపత్రికి రాలేని స్థితిలో ఉండే గ్రామీణ ప్రాంత పశువులకు సైతం మెరుగైన వైద్యసేవందించాలనే లక్ష్యంతో సంచార పశు వైద్య శాలలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మరింత భరోసాను కల్పిస్తూ ప్రభుత్వం ‘పశువిజ్ఞాన బడి’ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తూ తద్వారా వేలాదిమంది రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించి పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తోంది. జిల్లాలో జూన్ నెల నుంచి... జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది జూన్ నుంచి పశువిజ్ఞాన బడులను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 414 రైతుభరోసా కేంద్రాల పరిధిలో ఉన్న 17 ప్రాంతీయ పశువైద్యశాలలు, 79 పశువైద్యశాలలు, 78 గ్రామీణ పశువైద్యశాలలు పరిధిలో పనిచేసే పశువైద్యులు, సహాయ సంచాలకులు జూన్ నుంచి నవంబర్ 10వ తేదీ నాటికి 721 పశు విజ్ఞాన బడులను నిర్వహించారు. వీటి ద్వారా దాదాపు 20 వేల మంది రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. పశువిజ్ఞాన బడులను జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి, డివిజన్ డిప్యూటీ డైరెక్టర్లు పర్యవేక్షిస్తుంటారు. ఏ అంశాలపై అవగాహన కల్పిస్తారంటే.. పాల ఉత్పత్తి పెంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఎలాంటి పశుగ్రాసాన్ని, పశుధాణాను వాడుకోవాలి. పాల ఉత్పత్తి పెంచుకునేందుకు ఎంతమేర పచ్చిమేత అవసరం, పశుగ్రాసాల సాగుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరిస్తారు. పాడి పశువులకు దాణామృతం, సమీకృత దాణా ఎలా ఇవ్వాలో కూడా అవగాహన కల్పిస్తారు. పాడి పశువుల్లో ఏడాదికి ఒక ఈత ఉండాలి. ఆప్పుడే పాడి పరిశ్రమలో రాణించే అవకాశం ఉంటుంది. ఈనిన దూడ కూడా ఆరోగ్యంగా వస్తుంది. పాడిపశువులకు సంబంధించి దూడల మరణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తగ్గించేందుకు తీసుకోవాల్సిన సంరక్షణ పద్ధతుల గురించి తెలియచేస్తారు. కొన్ని ఆవులు, పశువులు యెదకు రాకుండా, చూలు కట్టకుండా ఉంటాయి. వీటి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియచేస్తారు శాస్త్రీయంగా గొర్రెలు, మేకలు పెంపకంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు. కోళ్ల పెంపకాన్ని ఎలా చేపట్టాలో కూడా అవగాహన కల్పిస్తారు. రైతులకు ఎంతో ప్రయోజనం జిల్లాలోని అన్ని మండలాల రైతు భరోసా కేంద్రాల పరిధిలో పశు విజ్ఞానబడి కార్యక్రమాన్ని పశువైద్యాధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. రైతులకు పాడి పరిశ్రమ అభివృద్ధి, పశువులకు సోకే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్థిస్థాయిలో వారు అవగాహన కల్పిçస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన పశు సంరక్షక్ యాప్‌లో వారం వారం పొటోలు, హాజరైన రైతుల పేర్లు, వారి ఫోన్ నంబర్లను ఆప్‌లోడ్ చేయిస్తున్నాం. ఈ కార్యక్రమం రైతులకు ఎంతో ప్రయోజనం ఉంది. – శారదమ్మ, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి. -
మూగ జీవాలకూ అంబులెన్స్
సాక్షి, అమరావతి: మూగ, సన్నజీవాల మరణాల రేటును తగ్గించే లక్ష్యంతో ‘108 అంబులెన్స్’ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మొబైల్ అంబులేటరీ క్లినిక్స్‌ను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సకాలంలో వైద్య సేవలందక విగత జీవులవుతున్న మూగ జీవాల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 108, 104 తరహాలో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ రథాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫోన్ చేసిన వెంటనే రైతు ముంగిటకు వెళ్లి మూగ జీవాలకు ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్న జీవాలు, పెంపుడు జంతువులు, పెరటి కోళ్లు, పక్షులకు సర్జరీలు చేసేందుకు వీలుగా వీటిని తీర్చిదిద్దారు. ట్రావిస్‌తో పాటు 20 రకాల మల సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్‌తో కూడిన కంప్లీట్ ల్యాబ్, హైడ్రాలిక్ జాక్ లిప్ట్ సౌకర్యం కల్పించారు. అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి అంబులెన్స్‌కు డ్రైవర్ కమ్ అటెండర్, ఒక ల్యాబ్ టెక్నిషియన్ కమ్ కాంపౌండర్, ఓ వైద్యుడిని నియమించారు. ఒక్కో అంబులెన్స్ తయారీకి రూ.37 లక్షల చొప్పున 175 అంబులెన్స్‌ల కోసం రూ.64.75 కోట్లు ఖర్చు చేయగా.. జీత భత్యాలు, నిర్వహణ కోసం ఒక్కో అంబులెన్స్‌కు ఏటా రూ.18 లక్షల చొప్పున రెండేళ్లకు రూ.63 కోట్లు ఖర్చు చేయనుంది. వీటి కోసం ప్రత్యేకంగా రూ.7 కోట్ల అంచనా వ్యయంతో కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రం బాటలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని గుర్తించిన కేంద్రం జాతీయ స్థాయిలో ఇదే విధానాన్ని అమలు చేయాలని సంకల్పిం చింది. లక్ష పశు సంపద ఉన్న ప్రాంతానికొకటి చొప్పున మొబైల్ అంబులేటరీ క్లినిక్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇందుకయ్యే వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరించనుంది. కేంద్రం కోటాలో రాష్ట్రానికి మరో 165 అంబులెన్స్‌లు మంజూరయ్యాయి. నిర్వహణతో సహా ఒక్కో అంబులెన్స్‌కు రూ.45.60 లక్షల చొప్పున రెండేళ్లకు రూ.75.24 కోట్లు కేంద్రం ఖర్చు చేయనుంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1962ను ఇక్కడ రైతులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. కొత్తగా మంజూరైన వాటితో కలిపి గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గానికి రెండు, పశు సంపద తక్కువగా ఉండే గిరిజన ప్రాంతాల్లో నియోజకవర్గానికి ఒకటి, నగర ప్రాంతాల్లో ఉండే మూగజీవాలు, పెంపుడు జంతువుల కోసం కార్పొరేషన్‌కు ఒకటి చొప్పున 340 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. తొలి విడతగా ఏప్రిల్ నాలుగవ వారంలో 175 అంబులెన్స్‌లు రోడ్డెక్కబోతున్నాయి. -
జవ‘జీవాలు’ లేని పశు వైద్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పశు వైద్యశాలలు సమస్యలతో సతమతమవుతున్నాయి. మండలం యూనిట్‌గా తీసుకుంటే సరిపడినన్ని వైద్యశాలలు లేవు. ఉన్న వైద్యశాలల్లో తగిన సౌకర్యాలు లేవు. డాక్టర్లు ఉండీ ఉండక, కనీసం సహాయకులు కూడా లేని పరిస్థితి ఉంది. మందులు, వ్యాక్సిన్లు సరిపడినన్ని సకాలంలో అందుబాటులో ఉండకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల రైతులు ఇప్పటికీ నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారంటే పశు వైద్యశాలల పరిస్థితి ఎలా ఉందో, రైతులకు వాటిపై ఏపాటి నమ్మకం ఉందో అర్ధమవుతోంది. అనేక ఆస్పత్రుల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. పశు వైద్యశాలలు, వైద్యులు, మందుల కొరతపై ఇటీవల గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్).. జనగామ, కరీంనగర్, వరంగల్ సహా పలు జిల్లాల్లో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జీఎంపీఎస్ సర్వే నిర్వహించిన జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ పశు వైద్యశాలల పరిస్థితి దారుణంగా ఉంది. అయినా పశు సంవర్ధక శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, అదేమంటే నిధుల్లేవనే సాకు చెబుతూ మూగజీవాల వైద్యాన్ని చిన్నచూపు చూస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఏడాది ఖర్చు రూ.12.50 కోట్లే రాష్ట్రంలోని మూగజీవాల వైద్యం కోసం, ఆసుపత్రుల నిర్మాణం, మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏడాదిలో వెచ్చించిన మొత్తం కేవలం రూ.12.50 కోట్లు మాత్రమే. 2019–20లో ఈ మొత్తాన్ని 563 ఆసుపత్రులకు వెచ్చించినట్టు ఆ శాఖ ఉన్నతాధికారులు చెపుతున్నారు. ఇక 2020–21లో 41 ఆసుçపత్రులకు మరమ్మతులు చేయించామని ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. రాష్ట్రంలోని 2,100 పశు వైద్యశాలల్లో అవసరమైన మరమ్మతులు, కొత్త ఆసుపత్రుల నిర్మాణం కోసం ప్రభుత్వం అనుమతినిచ్చిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అంటున్నారే కానీ.. ఎప్పుడు ప్రారంభిస్తారో, ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. పశువైద్య పోస్టులు ఖాళీ రాష్ట్రంలో పశు వైద్యశాలలను రూరల్ లైవ్ స్టాక్ యూనిట్ (ఆర్‌ఎల్‌యూ), వెటర్నరీ డిస్పెన్సరీ (వీడీ), వెటర్నరీ హాస్పిటల్ (వీహెచ్), జిల్లా స్థాయిలో వెటర్నరీ పాలీ క్లినిక్ (వీపీసీ)లుగా వర్గీకరించారు. మండల స్థాయి ఆసుపత్రి (వీడీ)లో ఒక వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వీఏఎస్)తో పాటు మరో వెటర్నరీ అసిస్టెంట్ (వీఏ), లైవ్ స్టాక్ అసిస్టెంట్ (ఎల్ఎస్ఏ), ఆఫీస్ సబార్డినేట్ (ఓఎస్)లు అందుబాటులో ఉండాలి. సర్జన్ పశువులకు వైద్యం చేస్తే వెటర్నరీ అసిస్టెంట్ ఆయనకు సహకరించాల్సి ఉంటుంది. మందులకు సంబంధించిన వ్యవహారాలు లైవ్‌స్టాక్ అసిస్టెంట్లు చూసుకుంటే ఆసుపత్రి నిర్వహణ ఆఫీసు సబార్డినేట్ చూసుకోవాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలోని ఏ ఒక్క ఆసుపత్రిలో కూడా ఈ నలుగురు సిబ్బంది అందుబాటులో ఉండే పరిస్థితి లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు చెపుతున్నాయి. వీహెచ్లలో అసిస్టెంట్ డైరెక్టర్, ఇతర సిబ్బంది ఉండాలి. జిల్లాకు ఒకటి చొప్పున ఉండే పాలీ క్లినిక్‌లలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండాలి. సర్జరీల్లాంటివి కూడా చేయాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున సిబ్బంది కూడా అవసరం ఉంటుంది. కానీ ఎక్కడా తగిన సంఖ్యలో వైద్యులు, ఇతర సిబ్బంది లేరు. వేధిస్తున్న మందుల కొరత క్షేత్రస్థాయి ఆసుపత్రుల్లో కేవలం నట్టల మందు, నాలుగు రకాల వ్యాక్సిన్లు మినహాయించి ఎలాంటి మందులు ఇవ్వడం లేదు. ఇవి కూడా నాసి రకంగా ఉంటున్నాయని, సరిపడా ఉండటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో జ్వరం, నొప్పులకు సంబంధించిన మందులు, ఇంజెక్షన్లు స్టాక్ పెట్టి రైతులకు ఇచ్చేవారు. యాంటీబయాటిక్స్ కూడా అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు ఏమీ ఇవ్వకుండా అన్నీ ప్రైవేటుకే రాస్తున్నారు. పశువైద్యానికి ఏటేటా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను తగ్గించడమే ఈ పరిస్థితికి కారణమని జీఎంపీఎస్ చెబుతోంది. మనుషులతో సమానంగా పశువులకు కూడా వైద్యం అందేలా ప్రభుత్వాలు పెద్ద మనసు చేసుకోవాలని జీఎంపీఎస్ ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ యాదవ్ విజ్ఞప్తి చేస్తున్నారు. ►జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో ఉన్నది ఒకే ఒక్క పశు వైద్యశాల. ఈ మండలంలో పది గ్రామాలున్నాయి. కానీ ఒక్కటే ఆసుపత్రి ఉండడంతో ఆ మండలంలోని మూగ జీవాలకు వైద్యం సకాలంలో అందడం లేదు. ఉన్న ఒక్క ఆసుపత్రిలో కూడా ఒక డాక్టర్, ఒక జూనియర్ వెటర్నరీ అధికారి పోస్టింగ్‌లు మాత్రమే ఉన్నాయి. అటెండర్ పోస్టు ఖాళీగా ఉంది. ఈ మండలంలో మరో మూడు ఆసుపత్రులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ►కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని తిమ్మాపూర్, రేణికుంట పశు వైద్యశాలల్లో గొర్రెలకు నట్టల మందు ఇవ్వడం లేదు. వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. మూనకొండూరు మండలంలో ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల్లో 75 శాతం యూనిట్లకు ఉచిత దాణా ఇవ్వడం లేదు. ►ఇదే జిల్లాలోని కొత్తపల్లి పశువైద్యశాల శిథిలావస్థలో ఉంది. గంగాధర పశు వైద్యశాల కూలిపోయింది. ఇందుర్తి ఆసుపత్రిలో మందులను నిల్వ చేసే ఫ్రిజ్ లేదు. నీరు, విద్యుత్ సౌకర్యం కూడా లేదు. వరంగల్ జిల్లా హసన్‌పర్తి ఆసుపత్రి బిల్డింగ్ స్లాబ్ పగులుతోంది. ►జాతీయ వ్యవసాయ కమిషన్ సూచనల ప్రకారం ప్రతి 5 వేల పశువులకు ఒక డాక్టర్ ఉండాలి. కానీ మన రాష్ట్రంలో 20 వేల పశువులకు కూడా ఒక వైద్యుడు లేని పరిస్థితి ఉంది. ►రాష్ట్రంలోని మూగజీవాల వైద్యం కోసం, ఆసుపత్రుల నిర్మాణం, మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019–20లో వెచ్చించిన మొత్తం కేవలం రూ.12.50 కోట్లు మాత్రమేనంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాళ్ల గడ్డలకు వాతల వైద్యం! కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మాలపాటి గ్రామంలో ఓ రైతుకు చెందిన ఎద్దు కాళ్లకు గడ్డలు ఏర్పడ్డాయి. స్థానికంగా వైద్యం చేయించినా తగ్గలేదు. దీంతో రైతు నాటు వైద్యం వైపు మళ్లాడు. ఇతర రైతులతో కలిసి ఎద్దును తాళ్లతో బంధించి కింద పడేసి పిడకలపై కాల్చిన ఇనుప చువ్వలతో కాళ్లకు దారుణంగా వాతలు పెట్టారు. ఆస్పత్రుల్లో పశువులకు సరైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం వల్లే రైతులు నాటు వైద్యం వైపు మళ్లాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. – సాక్షి, కామారెడ్డి -
తల్లి కుక్క.. పిల్లలు క్షేమం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం మాసాబ్‌ట్యాంకు నుంచి విజయనగర్ కాలనీ వెళ్లే ప్రధాన మార్గంలోని జీహెచ్ఎంసీ వెటర్నరీ ఆస్పత్రి ఫుట్‌పాత్‌పై ఓ కుక్క నిస్తేజంగా పడి ఉంది. అనారోగ్యం, తీవ్ర నీరసంతో కదలలేని కొనఊపిరితో ఉంది. అటుగా వెళ్తున్న ఓ యువకుడు దానికి ప్రాథమిక చికిత్స చేయాల్సిందిగా ఆ ఆస్పత్రి సిబ్బందిని కోరగా, దాని బాధ్యత పూర్తిగా తీసుకునే వారుంటేనే చికిత్స చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి చేతులెత్తేశారు. ఆ కుక్క పక్కనే దాని రెండు పిల్లలు పాల కోసం అల్లాడుతున్నాయి. తల్లి కుక్క వద్ద పాలు రాకపోతుండటంతో అవి రోడ్డుపైకి వచ్చి ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉండటంతో ఆ యువకుడు వెంటనే పీపుల్ ఫర్ యానిమల్స్సంస్థ సిబ్బందికి ఫోన్ చేసి వివరించడంతో పాటు ఫోన్లో దాని వీడియో తీసి పంపించాడు. సంస్థ ప్రతినిధి లత దాన్ని వాట్సాప్ గ్రూపులో ఉంచటంతో చేరువలో ఉన్న వలంటీర్లు సయ్యద్ తఖీ అలీ రజ్వీ, షబ్బీర్ అలీఖాన్‌లు అరగంటలో అక్కడికి చేరుకుని అట్టడబ్బాలో శునకం, దాని కూనలను తీసుకుని బేగంబజార్‌లోని రెస్క్యూహోమ్‌కు తీసుకెళ్లి అత్యవసర చికిత్స అందించారు. దీంతో కుక్క కోలుకుంది. మూగజీవాల పట్ల జాలితో వ్యవహరించాలని, ప్రమాదంలో ఉన్న వాటి ప్రాణాలు కాపాడాలని వారు పేర్కొన్నారు. -
పాపం.. పశువులు
అందీఅందని వైద్యంతో మూగజీవుల అవస్థలు పశువైద్యంపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. మూగజీవులే కదా..! బతికినా..చచ్చినా.. ప్రశ్నించేవారెవరు అనే రీతిలో వైద్యసేవలందిస్తున్నట్లు మంగళవారం ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. పలు వైద్యశాలల్లో డాక్టర్ల కొరత ఉంది. వైద్యులున్నచోట అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఒకే వైద్యుడు రెండు, మూడు ఆస్పత్రులకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ‘ఇన్చార్జి’ బాధ్యతలున్న చోటుకి ఒక్కసారి కూడా వెళ్లని డాక్టర్లూ ఉన్నారు. అటెండర్లు, స్వీపర్లు, కొద్దోగొప్పో వైద్యం తెలిసిన ప్రైవేట్ వ్యక్తులు తోచిన వైద్యం చేసి పశువుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పలు పశువైద్యశాలలు శిథిలావస్థకు చేరాయి. పంచాయతీ కార్యాలయమో.. మరోచోటో మందులు నిల్వ చేసుకోవాల్సిన దుస్థితి ఉంది. పొదుగువాపు, పాము, కుక్కకాటు వ్యాక్సిన్ల సరఫరాను ప్రభుత్వమే మరిచింది. ఇక పశుసంవర్థకశాఖ జిల్లాస్థాయి అధికారులైతే ఏనాడో వైద్యశాలలను సందర్శించటం మానేశారు. మొత్తంగా పశువైద్యం.. అందని ద్రాక్షే అయింది. సాక్షి, ఖమ్మం: జిల్లాలోని పశు వైద్యశాలల్లో మూగజీవాలకు వైద్యం సరిగా అందటం లేదు. డాక్టర్ల కొరత, ఉన్నచోట సరైన సమయానికి రాకపోవడం, సీజనల్ వ్యాధులకు మందులు లేకపోవడంతో జిల్లాలో పశువులకు వైద్యం కరువైంది. ఏజెన్సీలో డాక్టర్లు లేక అటెండర్లే పశు వైద్యులుగా అవతారమెత్తుతున్నారు. డాక్టర్లు లేరన్న కారణంతో అసలు కొన్ని ఆస్పత్రులకు తాళమే తీయట్లేదు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం ‘సాక్షి’ పరిశీలనలో పశు వైద్యం స్థితిగతులు బయటపడ్డాయి. జిల్లాలో 230 పశు వైద్యశాలలున్నాయి. వీటిలో 136 గ్రామీణ పశు వైద్య శాలలు. ఈ ఆస్పత్రుల్లో కేవలం 60 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఇంకా మంజూరైన పోస్టులు 28 ఖాళీగా ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్స్ 239 మందికి గాను 123 మందే విధులు నిర్వహిస్తున్నారు. పశు సంవర్థక సహాయకుల పోస్టులు 35 వరకు ఖాళీగా ఉన్నాయి. నాల్గో తరగతి ఉద్యోగులు 92 మంది తక్కువగా ఉన్నారు. ఇటీవల పశు సంవర్థక శాఖ గణన ప్రకారం జిల్లాలో తెల్లపశువులు 5.74 లక్షలు, గేదెలు 5.51 లక్షలు, గొర్రెలు 4.56 లక్షలు, మేకలు 4.76 లక్షలు వరకు ఉన్నాయి. వీటికి వచ్చే వ్యాధులకు ఆయా పశు వైద్యశాలల్లో వైద్యం అందించాలి. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభంలో పశువులకు జూన్‌లో చీడపారుడు రోగం, ఆగస్టులో గాలికుంటు వ్యాధి, నవంబర్‌లో గురక వ్యాధి, డిసెంబర్లో మసూచి వ్యాధులు వస్తున్నాయి. గొర్రెలు, మేకలకు నిమోనియా, గురక వ్యాధులు వస్తున్నాయి. పశువులకు వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రతలపై ఏటా పశు సంవర్థక శాఖ నిర్వహించాల్సిన ప్రచారం నామమాత్రంగా సాగుతోంది. ఈ వ్యాధులకు ఇచ్చే మందులు, వ్యాక్సిన్లు వైద్యశాలల్లో ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉండటం లేదు. పశువులకు వచ్చే వ్యాధులపై రైతులకు అవగాహన లేకపోవడంతో వ్యాధి ముదిరి అవి మృత్యువాత పడుతున్నాయి. పొదుగువాపు, పాము, కుక్కకాటు వ్యాక్సిన్లు ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో పశువైద్యశాలల్లో అందుబాటులో లేవు. వీటిని రైతులు ప్రైవేట్ మార్కెట్లో కొనుగోలు చేయడం భారంగా మారింది. కొంతమంది డాక్టర్లకు మరికొన్ని వైద్యశాలల ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు. కానీ ఏనాడూ వారు ఆ ఆస్పుతల వైపు కన్నెత్తి చూడటం లేదు. అటెండర్లు, ప్రైవేట్ వ్యక్తులే దిక్కు.. డాక్టర్లు లేని చోట అటెండర్లు, వైద్యం తెలిసిన ప్రైవేట్ వ్యక్తులే పశువులకు వైద్యం అందిస్తున్నారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో పనిచేస్తున్న వైద్యాధికారి తల్లాడ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి వైద్యశాలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. గత నాలుగేళ్ళుగా ఇక్కడ ప్రైవేట్ వ్యక్తి పశువులకు వైద్యం చేస్తూ రైతుల వద్ద నుంచి తృణమోపణమో తీసుకుంటున్నాడు. ఇక్కడి ఇన్చార్జి వైద్యాధికారి ఇటువైపు కన్నెత్తి చూడటంతో ఇటీవలికాలంలో వైద్యం అందక పశువులు మృత్యువాత పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇదే మండలం పాలడుగు గ్రామంలో ఆరేళ్ళుగా ఇక్కడి పశువైద్య శాలలో వైద్యుడు లేకపోవడంతో అటెండరే వైద్యం చేస్తున్నాడు. ఏన్కూరు మండల పరిధిలోని హిమామ్‌నగర్, రాజులపాలెం, రేపల్లెవాడ, మేడెపల్లి, నాచారం, గంగుల నాచారం, కాలనీ నాచారం, భద్రుతండా, మునియతండ, ఒంటిగుడిసె గ్రామాల పరిధిలో పశువైద్యశాలలు లేక పోవడంలో మూగజీవాలకు పశువైద్య సేవలు అందడం లేదు. ఖమ్మం రూరల్ మండలం పెదతండా వైద్యశాలలో అటెండర్, అసిస్టెంట్ పశువులకు వైద్యం చేస్తున్నారు. వైద్యులు లేక మూత.. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మంరూరల్ మండలం పొన్నేకల్‌లో ఐదేళ్ల క్రితం పశువైద్యశాల ఏర్పాటు చేసినప్పటికీ వైద్యున్ని నియమించకపోవడంతో మూతపడింది. తిరుమలాయపాలెం మండలం కాకరవాయి, బచ్చోడు వైద్యశాలలు కూడా ఇలాగే మూతపడ్డాయి. అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట, వినాయకపురం, సున్నంబట్టి, నారాయణపురం, గుమ్మడవల్లి, అచ్యుతాపురం, నారంవారిగూడెంలలో పశుైవె ద్యశాలలున్నాయి. వినాయకపురం పశువైద్యశాలలో తప్ప ఇంకెక్కడా వైద్యులులేరు. మధిర కేంద్రంలో ఉన్న పశువైద్యశాల డాక్టర్.. ఖమ్మం నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో పశువులకు సరైన సమయంలో వైద్యం అందడంలేదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చింతకాని మండలం పందిళ్లపల్లి ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరటంతో రెండేళ్ల క్రితం నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. నిధులు సరిపోక భవన నిర్మాణ పనులు పూర్తికాలేదు. గత్యంతరం లేక పశువైద్యశాల మందులను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిల్వ చేశారు. ముదిగొండ మండలంలోని మేడేపల్లి పశువైద్యశాలకు మూడు రోజులగా తాళం వేసి ఉంది. భద్రాచలం నియోజకవర్గం వాజేడు మండలంలోని పేరూరు పశు వైద్యశాల రెండుళ్లుగా తెరుచుకోలేదు. చర్ల మండలం సత్యనారాయణపురంలో రూ.10 లక్షల వ్యయం తో నూతన భవనం నిర్మించి ఆర్నెల్లయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. వెంకటాపురం వైద్యశాల శిథిలావస్థలో ఉంది. పినపాక నియోజకవర్గం మణుగూరు పశువైద్యశాలలో అటెండరే వైద్యం చేస్తోంది. గుండాల మండలకేంద్రంలోని పశువైద్యశాలలో వైద్యులు లేకపోవడంతో నిత్యం మూసే ఉంటోంది. పశు సంవర్థక శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.