మూగ జీవాలకూ అంబులెన్స్‌ | Ambulance for Animals in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మూగ జీవాలకూ అంబులెన్స్‌

Published Sun, Apr 17 2022 3:57 AM | Last Updated on Sun, Apr 17 2022 9:06 AM

Ambulance for Animals in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: మూగ, సన్నజీవాల మరణాల రేటును తగ్గించే లక్ష్యంతో ‘108 అంబులెన్స్‌’ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మొబైల్‌ అంబులేటరీ క్లినిక్స్‌ను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సకాలంలో వైద్య సేవలందక విగత జీవులవుతున్న మూగ జీవాల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 108, 104 తరహాలో వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ రథాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫోన్‌ చేసిన వెంటనే రైతు ముంగిటకు వెళ్లి మూగ జీవాలకు ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్న జీవాలు, పెంపుడు జంతువులు, పెరటి కోళ్లు, పక్షులకు సర్జరీలు చేసేందుకు వీలుగా వీటిని తీర్చిదిద్దారు.

ట్రావిస్‌తో పాటు 20 రకాల మల సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్‌తో కూడిన కంప్లీట్‌ ల్యాబ్, హైడ్రాలిక్‌ జాక్‌ లిప్ట్‌ సౌకర్యం కల్పించారు. అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి అంబులెన్స్‌కు డ్రైవర్‌ కమ్‌ అటెండర్, ఒక ల్యాబ్‌ టెక్నిషియన్‌ కమ్‌ కాంపౌండర్, ఓ వైద్యుడిని నియమించారు. ఒక్కో అంబులెన్స్‌ తయారీకి రూ.37 లక్షల చొప్పున 175 అంబులెన్స్‌ల కోసం రూ.64.75 కోట్లు ఖర్చు చేయగా.. జీత భత్యాలు, నిర్వహణ కోసం ఒక్కో అంబులెన్స్‌కు ఏటా రూ.18 లక్షల చొప్పున రెండేళ్లకు రూ.63 కోట్లు ఖర్చు చేయనుంది. వీటి కోసం ప్రత్యేకంగా రూ.7 కోట్ల అంచనా వ్యయంతో కాల్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

రాష్ట్రం బాటలో కేంద్రం 
రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని గుర్తించిన కేంద్రం జాతీయ స్థాయిలో ఇదే విధానాన్ని అమలు చేయాలని సంకల్పిం చింది. లక్ష పశు సంపద ఉన్న ప్రాంతానికొకటి చొప్పున మొబైల్‌ అంబులేటరీ క్లినిక్స్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇందుకయ్యే వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరించనుంది. కేంద్రం కోటాలో రాష్ట్రానికి మరో 165 అంబులెన్స్‌లు మంజూరయ్యాయి. నిర్వహణతో సహా ఒక్కో అంబులెన్స్‌కు రూ.45.60 లక్షల చొప్పున రెండేళ్లకు రూ.75.24 కోట్లు కేంద్రం ఖర్చు చేయనుంది.

కేంద్ర మార్గదర్శకాల ప్రకారం జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1962ను ఇక్కడ రైతులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. కొత్తగా మంజూరైన వాటితో కలిపి గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గానికి రెండు, పశు సంపద తక్కువగా ఉండే గిరిజన ప్రాంతాల్లో నియోజకవర్గానికి ఒకటి, నగర ప్రాంతాల్లో ఉండే మూగజీవాలు, పెంపుడు జంతువుల కోసం కార్పొరేషన్‌కు ఒకటి చొప్పున 340 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. తొలి విడతగా ఏప్రిల్‌ నాలుగవ వారంలో 175 అంబులెన్స్‌లు రోడ్డెక్కబోతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement