mobile clinic
-
మూగ జీవాలకూ అంబులెన్స్
సాక్షి, అమరావతి: మూగ, సన్నజీవాల మరణాల రేటును తగ్గించే లక్ష్యంతో ‘108 అంబులెన్స్’ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మొబైల్ అంబులేటరీ క్లినిక్స్‌ను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సకాలంలో వైద్య సేవలందక విగత జీవులవుతున్న మూగ జీవాల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 108, 104 తరహాలో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ రథాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫోన్ చేసిన వెంటనే రైతు ముంగిటకు వెళ్లి మూగ జీవాలకు ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్న జీవాలు, పెంపుడు జంతువులు, పెరటి కోళ్లు, పక్షులకు సర్జరీలు చేసేందుకు వీలుగా వీటిని తీర్చిదిద్దారు. ట్రావిస్‌తో పాటు 20 రకాల మల సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్‌తో కూడిన కంప్లీట్ ల్యాబ్, హైడ్రాలిక్ జాక్ లిప్ట్ సౌకర్యం కల్పించారు. అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి అంబులెన్స్‌కు డ్రైవర్ కమ్ అటెండర్, ఒక ల్యాబ్ టెక్నిషియన్ కమ్ కాంపౌండర్, ఓ వైద్యుడిని నియమించారు. ఒక్కో అంబులెన్స్ తయారీకి రూ.37 లక్షల చొప్పున 175 అంబులెన్స్‌ల కోసం రూ.64.75 కోట్లు ఖర్చు చేయగా.. జీత భత్యాలు, నిర్వహణ కోసం ఒక్కో అంబులెన్స్‌కు ఏటా రూ.18 లక్షల చొప్పున రెండేళ్లకు రూ.63 కోట్లు ఖర్చు చేయనుంది. వీటి కోసం ప్రత్యేకంగా రూ.7 కోట్ల అంచనా వ్యయంతో కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రం బాటలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని గుర్తించిన కేంద్రం జాతీయ స్థాయిలో ఇదే విధానాన్ని అమలు చేయాలని సంకల్పిం చింది. లక్ష పశు సంపద ఉన్న ప్రాంతానికొకటి చొప్పున మొబైల్ అంబులేటరీ క్లినిక్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇందుకయ్యే వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరించనుంది. కేంద్రం కోటాలో రాష్ట్రానికి మరో 165 అంబులెన్స్‌లు మంజూరయ్యాయి. నిర్వహణతో సహా ఒక్కో అంబులెన్స్‌కు రూ.45.60 లక్షల చొప్పున రెండేళ్లకు రూ.75.24 కోట్లు కేంద్రం ఖర్చు చేయనుంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1962ను ఇక్కడ రైతులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. కొత్తగా మంజూరైన వాటితో కలిపి గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గానికి రెండు, పశు సంపద తక్కువగా ఉండే గిరిజన ప్రాంతాల్లో నియోజకవర్గానికి ఒకటి, నగర ప్రాంతాల్లో ఉండే మూగజీవాలు, పెంపుడు జంతువుల కోసం కార్పొరేషన్‌కు ఒకటి చొప్పున 340 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. తొలి విడతగా ఏప్రిల్ నాలుగవ వారంలో 175 అంబులెన్స్‌లు రోడ్డెక్కబోతున్నాయి. -
పెద్ద మనస్సు చాటుకున్న ఎస్బీఐ!
హైదరాబాద్: ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పెద్ద మనస్సు చాటుకుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్)లో భాగంగా హైదరాబాద్ నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు రూ. 22.23 లక్షలు విరాళమిచ్చింది. నిరుపేద కుటుంబాలకు వైద్య సదుపాయం అందించేందుకు మొబైల్ క్లినిక్ ఏర్పాటుచేయడానికి హైదరాబాద్ కౌన్సిల్ ఆఫ్ హ్యుమన్ వెల్ఫేర్ (హెచ్‌సీహెచ్‌డబ్ల్యూ)కు ఈ విరాళం అందజేసింది. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ రజ్నిష్ కుమార్ ఈ మేరకు చెక్కును హెచ్‌సీహెచ్‌డబ్ల్యూ డైరెక్టర్ మహ్మద్ రఫీయుద్దీన్‌కు అందజేశారు. ఈ మొబైల్ క్లినిక్ వచ్చేవారం నుంచి సేవలు అందించనుంది. మురికివాడల్లోని 500 మందికి ప్రతిరోజూ ఉచితంగా వైద్యసేవలు అందించనుంది. ఈ మొబైల్ క్లినిక్‌లో రిసెప్షన్ డెస్క్, డాక్టర్ క్యాబిన్, లాబోరేటరి, ఔషధాలు దుకాణం తదితర సేవలు అందుబాటులో ఉంటాయి. ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ సీఎస్ఆర్లో భాగంగా ఇప్పటికే పలు పారిశుద్ధ్య, వైద్య, విద్య ప్రాజెక్టుల కోసం స్వచ్ఛంద సంస్థలకు రూ. 10.50 కోట్ల మేర విరాళాలు అందజేసిందని అధికారులు తెలిపారు. డిజిటలైజేషన్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు గ్రామాలను దత్తత తీసుకున్నట్టు తెలిపారు. -
వైద్యసేవలకు ‘జనసేవ’ సహకారం
పింప్రి, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి జనసేవా ఫౌండేషన్ సంపూర్ణ సహకారం అందిస్తోంది. గ్రామీణులకోసం రాష్ట్రీయ గ్రామీణ ఆరోగ్య పథకం (ఎన్ఆర్హెచ్ఎం) కింద ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం విదితమే. పుణే జిల్లా వేల్హా తాలూకాలోని కొండలు, అటవీ ప్రాంతాల్లోగల గ్రామాలకు మొబైల్ క్లినిక్‌లలో సిబ్బంది చేరుకుని సేవలందిస్తున్నారు. 2011 నుంచి ఈ మొబైల్ క్లినిక్‌లు అందుబాటులోకివ చ్చాయి. వీటిద్వారా ఈ ఏడాది మార్చినాటికి రెండు వేల మందికి వైద్యసేవలను అందించినట్లు మొబైల్ క్లినిక్ ప్రాజెక్టు సమన్వయకర్త సునీల్ కఠారే వెల్లడించారు. వేల్హా తాలూకాలోని 65 గ్రామాల్లో ఆస్పత్రులే లేవు. దీంతో మొబైల్ క్లినిక్‌లద్వారా సంవత్సర కాలంలో 25 వేల మందికి పైగా ప్రజలకు వైద్యసేవలను ఉచితంగా అందించామని సునీల్ తెలిపారు. ప్రతి సోమవారం మొదలుకుని శుక్రవారం వరకు ఆయా గ్రామాలకు వెళ్లి వైద్య పరీక్షలతోపాటు చికిత్స చేస్తున్నామన్నారు. ఇదిలాఉంచితే జన సేవా ఫౌండేషన్ నిర్వాహకుల సహకా రం కారణంగా తమ బతుకుల్లో వెలుగులొచ్చాయంటూ గ్రామీణులు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు. గర్భిణులు, వయోధికులు, చిన్న పిల్లలకు ఉచితంగా మందు లు అందజేస్తూ వారి బాగోగులను చూస్తున్నారు. మొబైల్ క్లినిక్‌లో ప్రభుత్వ వైద్యులతోపాటు తమ ఫౌండేషన్‌కి చెందిన వైద్యులు కూడా సేవలందిస్తున్నట్లు సునీల్ తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో రోగి ఉన్నట్లయితే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తామని, గ్రామీణుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడమే తమ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తరఫున ఓ డాక్టర్, నర్సు, ఫార్మిస్టులతోపాటు జనసేవా ఫౌండేషన్‌కు చెందిన ఇద్దరు ప్రత్యేక వైద్యులద్వారా సేవలను అందిస్తున్నామని ఆయన వివరించారు.