అందీఅందని వైద్యంతో మూగజీవుల అవస్థలు
పశువైద్యంపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. మూగజీవులే కదా..! బతికినా..చచ్చినా.. ప్రశ్నించేవారెవరు అనే రీతిలో వైద్యసేవలందిస్తున్నట్లు మంగళవారం ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. పలు వైద్యశాలల్లో డాక్టర్ల కొరత ఉంది. వైద్యులున్నచోట అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఒకే వైద్యుడు రెండు, మూడు ఆస్పత్రులకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ‘ఇన్‌చార్జి’ బాధ్యతలున్న చోటుకి ఒక్కసారి కూడా వెళ్లని డాక్టర్లూ ఉన్నారు. అటెండర్లు, స్వీపర్లు, కొద్దోగొప్పో వైద్యం తెలిసిన ప్రైవేట్ వ్యక్తులు తోచిన వైద్యం చేసి పశువుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
పలు పశువైద్యశాలలు శిథిలావస్థకు చేరాయి. పంచాయతీ కార్యాలయమో.. మరోచోటో మందులు నిల్వ చేసుకోవాల్సిన దుస్థితి ఉంది. పొదుగువాపు, పాము, కుక్కకాటు వ్యాక్సిన్ల సరఫరాను ప్రభుత్వమే మరిచింది. ఇక పశుసంవర్థకశాఖ జిల్లాస్థాయి అధికారులైతే ఏనాడో వైద్యశాలలను సందర్శించటం మానేశారు. మొత్తంగా పశువైద్యం.. అందని ద్రాక్షే అయింది.
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని పశు వైద్యశాలల్లో మూగజీవాలకు వైద్యం సరిగా అందటం లేదు. డాక్టర్ల కొరత, ఉన్నచోట సరైన సమయానికి రాకపోవడం, సీజనల్ వ్యాధులకు మందులు లేకపోవడంతో జిల్లాలో పశువులకు వైద్యం కరువైంది. ఏజెన్సీలో డాక్టర్లు లేక అటెండర్లే పశు వైద్యులుగా అవతారమెత్తుతున్నారు. డాక్టర్లు లేరన్న కారణంతో అసలు కొన్ని ఆస్పత్రులకు తాళమే తీయట్లేదు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం ‘సాక్షి’ పరిశీలనలో పశు వైద్యం స్థితిగతులు బయటపడ్డాయి.
జిల్లాలో 230 పశు వైద్యశాలలున్నాయి. వీటిలో 136 గ్రామీణ పశు వైద్య శాలలు. ఈ ఆస్పత్రుల్లో కేవలం 60 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఇంకా మంజూరైన పోస్టులు 28 ఖాళీగా ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్స్ 239 మందికి గాను 123 మందే విధులు నిర్వహిస్తున్నారు. పశు సంవర్థక సహాయకుల పోస్టులు 35 వరకు ఖాళీగా ఉన్నాయి. నాల్గో తరగతి ఉద్యోగులు 92 మంది తక్కువగా ఉన్నారు.
ఇటీవల పశు సంవర్థక శాఖ గణన ప్రకారం జిల్లాలో తెల్లపశువులు 5.74 లక్షలు, గేదెలు 5.51 లక్షలు, గొర్రెలు 4.56 లక్షలు, మేకలు 4.76 లక్షలు వరకు ఉన్నాయి. వీటికి వచ్చే వ్యాధులకు ఆయా పశు వైద్యశాలల్లో వైద్యం అందించాలి. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభంలో పశువులకు జూన్‌లో చీడపారుడు రోగం, ఆగస్టులో గాలికుంటు వ్యాధి, నవంబర్‌లో గురక వ్యాధి, డిసెంబర్‌లో మసూచి వ్యాధులు వస్తున్నాయి. గొర్రెలు, మేకలకు నిమోనియా, గురక వ్యాధులు వస్తున్నాయి.
పశువులకు వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రతలపై ఏటా పశు సంవర్థక శాఖ నిర్వహించాల్సిన ప్రచారం నామమాత్రంగా సాగుతోంది. ఈ వ్యాధులకు ఇచ్చే మందులు, వ్యాక్సిన్లు వైద్యశాలల్లో ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉండటం లేదు. పశువులకు వచ్చే వ్యాధులపై రైతులకు అవగాహన లేకపోవడంతో వ్యాధి ముదిరి అవి మృత్యువాత పడుతున్నాయి. పొదుగువాపు, పాము, కుక్కకాటు వ్యాక్సిన్లు ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో పశువైద్యశాలల్లో అందుబాటులో లేవు. వీటిని రైతులు ప్రైవేట్ మార్కెట్‌లో కొనుగోలు చేయడం భారంగా మారింది. కొంతమంది డాక్టర్లకు మరికొన్ని వైద్యశాలల ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. కానీ ఏనాడూ వారు ఆ ఆస్పుతల వైపు కన్నెత్తి చూడటం లేదు.
అటెండర్లు, ప్రైవేట్ వ్యక్తులే దిక్కు..
డాక్టర్లు లేని చోట అటెండర్లు, వైద్యం తెలిసిన ప్రైవేట్ వ్యక్తులే పశువులకు వైద్యం అందిస్తున్నారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో పనిచేస్తున్న వైద్యాధికారి తల్లాడ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి వైద్యశాలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. గత నాలుగేళ్ళుగా ఇక్కడ ప్రైవేట్ వ్యక్తి పశువులకు వైద్యం చేస్తూ రైతుల వద్ద నుంచి తృణమోపణమో తీసుకుంటున్నాడు. ఇక్కడి ఇన్‌చార్జి వైద్యాధికారి ఇటువైపు కన్నెత్తి చూడటంతో ఇటీవలికాలంలో వైద్యం అందక పశువులు మృత్యువాత పడుతున్నాయని రైతులు వాపోతున్నారు.
ఇదే మండలం పాలడుగు గ్రామంలో ఆరేళ్ళుగా ఇక్కడి పశువైద్య శాలలో వైద్యుడు లేకపోవడంతో అటెండరే వైద్యం చేస్తున్నాడు. ఏన్కూరు మండల పరిధిలోని హిమామ్‌నగర్, రాజులపాలెం, రేపల్లెవాడ, మేడెపల్లి, నాచారం, గంగుల నాచారం, కాలనీ నాచారం, భద్రుతండా, మునియతండ, ఒంటిగుడిసె గ్రామాల పరిధిలో పశువైద్యశాలలు లేక పోవడంలో మూగజీవాలకు పశువైద్య సేవలు అందడం లేదు.
ఖమ్మం రూరల్ మండలం పెదతండా వైద్యశాలలో అటెండర్, అసిస్టెంట్ పశువులకు వైద్యం చేస్తున్నారు.
వైద్యులు లేక మూత..
పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మంరూరల్ మండలం పొన్నేకల్‌లో ఐదేళ్ల క్రితం పశువైద్యశాల ఏర్పాటు చేసినప్పటికీ వైద్యున్ని నియమించకపోవడంతో మూతపడింది. తిరుమలాయపాలెం మండలం కాకరవాయి, బచ్చోడు వైద్యశాలలు కూడా ఇలాగే మూతపడ్డాయి.
అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట, వినాయకపురం, సున్నంబట్టి, నారాయణపురం, గుమ్మడవల్లి, అచ్యుతాపురం, నారంవారిగూడెంలలో పశుైవె ద్యశాలలున్నాయి. వినాయకపురం పశువైద్యశాలలో తప్ప ఇంకెక్కడా వైద్యులులేరు.
మధిర కేంద్రంలో ఉన్న పశువైద్యశాల డాక్టర్.. ఖమ్మం నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో పశువులకు సరైన సమయంలో వైద్యం అందడంలేదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చింతకాని మండలం పందిళ్లపల్లి ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరటంతో రెండేళ్ల క్రితం నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. నిధులు సరిపోక భవన నిర్మాణ పనులు పూర్తికాలేదు. గత్యంతరం లేక పశువైద్యశాల మందులను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిల్వ చేశారు. ముదిగొండ మండలంలోని మేడేపల్లి పశువైద్యశాలకు మూడు రోజులగా తాళం వేసి ఉంది.
భద్రాచలం నియోజకవర్గం వాజేడు మండలంలోని పేరూరు పశు వైద్యశాల రెండుళ్లుగా తెరుచుకోలేదు. చర్ల మండలం సత్యనారాయణపురంలో రూ.10 లక్షల వ్యయం తో నూతన భవనం నిర్మించి ఆర్నెల్లయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. వెంకటాపురం వైద్యశాల శిథిలావస్థలో ఉంది.
పినపాక నియోజకవర్గం మణుగూరు పశువైద్యశాలలో అటెండరే వైద్యం చేస్తోంది. గుండాల మండలకేంద్రంలోని పశువైద్యశాలలో వైద్యులు లేకపోవడంతో నిత్యం మూసే ఉంటోంది.
పశు సంవర్థక శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
పాపం.. పశువులు
Published Wed, Dec 24 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM
Advertisement
Advertisement