కలెక్టర్ రాహుల్‌బొజ్జా
సంగారెడ్డి అర్బన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు తప్పని సరిగా విధి నిర్వహణలో సమయ పాలన పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే మెడికల్ ఆఫీసర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా వైద్య సేవలందించేందుకు అందుబాటులో ఉండాలన్నారు. వైద్య వృత్తి చాలా పవిత్రమైందని, ఈ వృత్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మెడికల్ ఆఫీసర్లపై ఉందని ఆయన తెలిపారు. వైద్యాధికారుల్ని బట్టి మిగిలిన సిబ్బంది కూడా సమయపాలన పాటిస్తారన్నారు.
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔట్ పేషంట్లకు చికిత్సలు అందించడం కోసం ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఆరోగ్య కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు రోగం నయం చేయడానికి మేమున్నామన్న నమ్మకాన్ని సిబ్బంది కలిగించాలని, వారిని అధైర్యపర్చరాదని సూచించారు. జిల్లాలో జ్వరాలతో ఏ ఒక్కరూ మరణించకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ప్రతీ కేసును డయగ్నైస్ చేయకుండా డెంగ్యూ, చికెన్‌గున్యా అని నిర్థారించవద్దని ఆయన మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. ప్రతి మెడికల్ ఆఫీసర్ పనిచే సే కేంద్ర స్థానంలోనే నివసించాలని అలా ఉండటం వల్ల తమ పరిధిలో గల రోగులకు ఏ సమయంలోనైనా వైద్యసేవలు అందించగలుగుతారన్నారు.
జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్య మెరుగుపర్చాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే మెడికల్ ఆఫీసర్‌లపై ఫిర్యాదులు వస్తున్నాయని ఇక ముందు అలాంటివి రాకుండా జాగ్రత్త వహించాలని ఆయన వైద్యాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదనపు జే సీ మూర్తి, డీఎంఅండ్ హెచ్‌వో బాలాజీ పవార్, డీపీవో జగన్నాథ్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్ డా.నరేంద్ర బాబు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.