డోన్ట్‌వర్రీ... బీ రెడీ జికా
రేండేళ్ల క్రితం వరకూ ఎబోలా! అంతకుముందు చికెన్‌గున్యా, బర్డ్‌ఫ్లూ, డెంగ్యూ!! ఇప్పుడు జికా వైరస్!!! క్యూ కట్టినట్టుగా ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఎందరినో చుట్టుముడుతున్నాయి. ఎంతో మంది ఉసురు తీసుకుంటున్నాయి.అయితే ఊరట కలిగించే అంశం ఏమిటంటే... ఇప్పటికింకా భారత్‌లో జికా వైరస్‌కు సంబంధించి ఒక్క కేసూ నమోదు కాలేదు. అయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది కాబట్టి మనమూ అప్రమత్తం కావాలి. అవగాహన కలిగి ఉండాలి. జికావైరస్‌పై అవగాహన కోసం ఈ కథనం.
జికా వైరస్‌కు సంబంధించిన మొదటి కేసు గత మేలో బ్రెజిల్‌లో నమోదయ్యింది. అప్పట్నుంచీ అది దక్షిణ, మధ్య అమెరికా ప్రాంతాల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందింది. ఒక ఉపద్రవంలా విస్తరించింది. ఆ ప్రదేశాల్లో అది మహమ్మారిలా మారడంతో ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి.
జికా తెచ్చే ముప్పు ఇది
జికా వైరస్... దోమల ద్వారా వ్యాపిస్తుంది. గర్భిణులకు ఈ వైరస్ సోకితే, అది వారి గర్భంలోని పిండం మెదడును కుంచించుకుపోయేలా చేస్తుందని భావిస్తున్నారు. దాంతో కుంచించుకుపోయిన మెదడుతో పసిపాపలు పుడతారని అనుకుంటున్నారు. ఇక మరికొన్ని సందర్భాల్లో అది కాలక్రమంలో అవయవాలన్నింటిపైనా మెదడు అదుపు తప్పిపోయే గులియన్ బ్యారీ సిండ్రోమ్ వంటి ఆటోఇమ్యూన్ జబ్బులకు దారి తీసి, నవజాత శిశువులకు ప్రాణాంతకమూ కావచ్చని అంచనా. ఇలా మన సొంత రోగ నిరోధక వ్యవస్థే మనపై దెబ్బతీసేలా చేస్తుందది.
ఇదీ విస్తృతి...
దాదాపు 15 లక్షల మంది బ్రెజిలియన్లకు జికా వైరస్ సోకింది. అందులో మెదడు కుంచించుకుపోయిన కేసులు 3,700. ఇలా మెదడు కుంచించుకుపోవడాన్ని వైద్య పరిభాషలో ‘మైక్రోసెఫాలీ’ అంటారు. తల్లికి వ్యాధి సోకితే పుట్టే పిల్లల తల చాలా చిన్నదిగా ఉంటుంది. మెదడు అభివృద్ధి, వికాసం... ఈ రెండు అంశాలూ చాలా తక్కువ. ఇది జికా వైరస్ కలగజేసే దుష్ర్పభావమని వైద్య, పరిశోధన వర్గాల అంచనా. ఈ లక్షణాలను చూశాక... దక్షిణ అమెరికా, మధ్య అమెరికా ప్రాంతాల్లోని అనేక భాగాల్లో మెడికల్ అత్యవసర స్థితిని ప్రకటించారు. దోమలను అదుపు చేయడానికి జరుగుతున్న యుద్ధంలో సాక్షాత్తూ సైనిక బలగాలు పాలుపంచుకుంటున్నాయి.
కనిపించని ఉపద్రవం...
ఈ ఫిబ్రవరిలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొదటి కేసు నమోదయ్యింది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి యూఎస్‌కూ, యూఎస్ నుంచి ప్రపంచంలోని అన్ని ప్రదేశాలకూ ప్రయాణాలు నిత్యం ముమ్మరంగా జరుగుతుంటాయి. దాంతో కొద్ది వ్యవధిలోనే ఇతర ప్రాంతాలకూ వ్యాపించవచ్చనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఇక మరో భయం ఏమిటంటే... ఈ వైరస్ సోకినప్పుడు తొలి దశల్లో ఎలాంటి లక్షణాలూ బయటకు కనిపించవు. దాంతో అంతర్గతంగా జరుగుతున్న నష్టం గురించి అంచనా ఉండదు. ఫలితంగా నష్టనివారణ చర్యలు చేపడదామన్నా అవకాశమే ఉండదు.
అప్పట్లో పరిమిత ప్రాంతాల్లోనే...
మొదట్లో జికా వైరస్ ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకూ, కొన్ని పసిఫిక్ సముద్ర భూభాగాలకు మాత్రమే పరిమితిమైంది. ఈ వైరస్ కలిగించే ఉత్పాతాలనూ, స్వరూప స్వభావాలనూ అధ్యయనం చేసి, దానికి కారణమైన ‘జికా’ అనే ఈ వైరస్‌ను 1947లో తొలిసారి కనుగొన్నారు. ‘ఈడిస్ ఈజిప్టై’ అనే దోమ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇదే దోమ డెంగ్యూ వ్యాధినీ, చికన్‌గున్యానూ వ్యాప్తి చేస్తుంది. ఇది పగటివేళల్లో కుట్టే దోమ. ఎక్కువ ఎత్తులో ఎగరలేదు. సాధారణంగా ఇళ్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మంచి నీళ్లలో గుడ్లు పెట్టి, అక్కడ అభివృద్ధి చెందుతుంటుంది.
దోమ కుట్టాక వైరస్ చేరితే...
ఈ దోమకాటు వల్ల ఒంట్లోకి వైరస్ చేరితే... కొద్దిగా జ్వరం, ఒంటి మీద దద్దుర్లు (ర్యాష్), కళ్లు కొద్దిగా ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తొలి 14 రోజులు (రెండు వారాల పాటు) ఉంటాయి.
ఇప్పటికైతే మన దేశంలో లేదు...
మన భారత భూభాగంపై ఇప్పటివరకూ జికా వైరస్ సోకిన ఏ కేసూ నమోదు కాలేదు. అయితే మన దేశంలోని చాలా ప్రదేశాల్లో నీటి ఎద్దడి ఉండే ప్రాంతాలుంటాయి. అలాంటి చోట్ల నీళ్లు నిల్వ పెట్టుకోడానికి అవకాశాలు ఎక్కువ. దాంతో ఈ వైరస్‌ను వ్యాప్తి చేసే ఈడిస్ ఈజిప్టై రకం దోమలు అక్కడ పెరిగేందుకు అన్ని రకాల అనుకూల పరిస్థితులు ఉంటాయి. అందుకే నీటి ఎద్దడి వల్ల నీళ్లను నిల్వ చేసుకునే భారతీయ ప్రాంతాల్లో ఉండే గర్భిణులను అక్కడి స్థానిక ఆరోగ్య సంస్థలు అప్రమత్తం చేస్తున్నాయి. పొరుగుదేశాలలో ఉన్న పరిస్థితులను వివరించి, సమస్యపై అవగాహన కలిగిస్తున్నాయి. ఇలా నివారణకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నివారణ కోసం తీసుకోవాల్సిన మార్గదర్శకాలను రూపొందించి వారికి వివరిస్తున్నాయి. కొన్ని చోట్ల వ్యాధి నిర్ధారణకు అవసరమైన ‘కిట్లు’ అందుబాటులో ఉంచుతున్నాయి.
ఒకసారి వ్యాధి సోకితే మాత్రం దాన్ని తగ్గించడానికి చికిత్స లేదు. కానీ నివారణ టీకాలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఈ ఆగష్టు నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకూ ఈ టీకాను అందుబాటులోకి తేవాలని సంకల్పించినట్లు పూణేలోని కొలంబియా ఆసియా హాస్పిటల్‌కు చెందిన నిపుణుడు మహేశ్ లాఖే తెలిపారు.
అయితే ఈలోపు ప్రజలందరూ తామే అప్రమత్తం అయి నివారణ చర్యలు తీసుకోవడం ప్రధానమని మరో నిపుణులు ఓమ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఆయన తన ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా ప్రజలకు జికావైరస్ పట్ల ఉన్న ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. అపోహలను దూరం చేస్తున్నారు. సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ‘ప్రజల్లో ఈ వైరస్ పట్ల ఆందోళన ఉండటం చాలా సహేతుకమైనదే. ఎందుకంటే డెంగ్యూను వ్యాప్తి చేసే దోమే, దీన్ని వ్యాప్తి చేస్తుంది కాబట్టి వాళ్ల భయాలు అర్థవంతమైనవే’ అంటారాయన. అదృష్టవశాత్తూ మన దేశంలో జికా వైరస్ లేకపోయినా... ముందుజాగ్రత్త కోసం అవగాహన కలిగి ఉండటం చాలా మంచిది.
లక్షణాలు
చాలా మందిలో బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించవచ్చు. కాకపోతే కొద్దిపాటి జ్వరం, ఒంటిపై దద్దుర్లు, కీళ్లనొప్పులు, కళ్లకలక (కళ్లు ఎర్రబారడం) వంటివి కనిపిస్తాయి.కొంతమందికి కండరాల నొప్పులూ కనిపించవచ్చు. మరికొందరిలో తలనొప్పి ఉంటుంది. ఒకసారి వైరస్ సోకాక, లక్షణాలు కనిపించడానికి కొద్ది రోజులు మొదలుకొని, వారం, రెండు వారాల వరకూ వ్యవధి పట్టవచ్చు.వైరస్ సోకితే, అది వ్యాధికి గురైన వారి రక్తంలో కొన్ని రోజులు మొదలుకొని, కొన్నాళ్ల వరకూ ఉండవచ్చు. అంటే లక్షణాలు బయటకు కనిపించకపోయినా, వ్యాధి వ్యాప్తి చేసే పరిస్థితిలో వారు ఉంటారు.
చికిత్స
వ్యాధి సోకిన తర్వాత నిర్దిష్ట చికిత్స ప్రక్రియ లేదు.
ఇతర వైరల్ జబ్బుల విషయంలో ఇచ్చే మందులే దీనికీ ఇస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ దీనికి టీకా (వ్యాక్సిన్)ను రూపొందించినట్లు పేర్కొంది. అయితే అది ఇంకా ప్రీ-క్లినికల్ ప్రయోగదశల్లో ఉందనీ, చాలా త్వరలోనే అందుబాటులోకి రానుందని చెప్పింది.
ఇది ప్రాణాంతకమా?
వ్యాధి సోకినప్పుడు కనిపించే లక్షణాలు ప్రాణాంతకం కాదు. అవి సాధారణ ఒళ్లునొప్పులూ, తలనొప్పులే. కానీ వ్యాధి సోకిన తర్వాత కలిగే దశలు చాలా ప్రమాదం. అవి మన రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసే ఆటో ఇమ్యూన్ వ్యాధులను కలగజేయవచ్చు. ఆ తర్వాత రోగికి గులియన్ బ్యారీ సిండ్రోమ్, మెదడు కుంచించుకుపోయే మైక్రోసెఫాలీ వంటి ప్రమాదకరమైన కండిషన్స్ రావచ్చు.
డెంగ్యూ, చికన్‌గున్యాలతో పోల్చినప్పుడు తేడా...
సాధారణంగా డెంగ్యూ, చికన్‌గున్యా, జికా... ఈ మూడు వైరల్ వ్యాధుల లక్షణాల్లోని చాలా అంశాలు ఒకదానితో మరొకటి పోలి ఉంటాయి. ఉదాహరణకు దద్దుర్లు, కళ్లు ఎర్రబారడం, కంటి ఇన్ఫెక్షన్లు, కండరాల నొప్పులు అన్ని వ్యాధుల్లోనూ కనిపిస్తాయి.
వ్యాధి కనిపిస్తున్న దేశాలు
దక్షిణ అమెరికా ఖండానికి చెందిన చాలా దేశాలు. {బెజిల్‌లో దీని దుష్ర్పభావం చాలా ఎక్కువ. పోర్టారికో, కొలంబియా, బార్బడోస్, బొలీవియా, అమెరికన్ సమోవా లాంటి చోట్ల కూడా జికా వైరస్ విస్తృతంగానే ఉంది. ఇప్పుడిప్పుడే మెక్సికో, యూఎస్‌ఏలోనూ కేసులు కనిపిస్తున్నాయి.ఇది ఈడిస్ ఈజిప్టై అనే దోమతో వ్యాప్తి చెందుతుంది. ఇవే దోమలు డెంగ్యూ, చికన్‌గున్యాలనూ వ్యాప్తి చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 23 దేశాలలో జికా వైరస్ ఉత్పాతాన్ని సృష్టిస్తోంది.
గర్భవతులు పాటించాల్సిన నివారణ చర్యలివి...
గర్భవతుల రక్తంలోకి ఈ వైరస్ చేరితే అది కడుపులోని శిశువుకూ సోకి ప్రమాదం కలిగించవచ్చు. అందుకే గర్భిణులు దోమలు కుట్టకుండా ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలి.ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు, పొడవు చేతుల కుర్తాలు ధరించాలి.దోమలను పారదోలే ‘మస్కిటో రెపెల్లెంట్స్’ ఉపయోగించాలి. ఈ దోమలు పగలూ కుడతాయి... కాబట్టి పగటి వేళ కూడా జాగ్రత్తగా ఉండాలి.
డాక్టర్ శివరాజు సీనియర్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
జికా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన భారత్!
దేశీయంగా టీకా రూపకల్పన మన దేశ వ్యాక్సిన్ రూపకర్తలలో ఒకటైన భారత్ బయోటిక్ సంస్థ జికా వైరస్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ రెండు ‘వ్యాక్సిన్ క్యాండిడేట్స్’ను రూపొందించి, ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపింది. ఇందులో ఒకటి వైరస్‌ను నిర్వీర్యం చేసి రూపొందించే ‘ఇనాక్టివేటెడ్ క్యాండిడేట్’ కాగా, మరొకటి కొన్నింటి సమ్మేళనం అయిన ‘రీకాంబినెంట్’. ఇక ఇవి చికిత్సకు మందులా ఇచ్చే ముందర నిర్వహించే ‘ప్రీ-క్లినికల్’ దశలో ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. రాబోయే ఐదు నెలల్లో ఈ ప్రీ-క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తామని రూపకర్తలు వివరించారు. ఆ తర్వాత నియంత్రణ అధికారుల నుంచి తగిన అనుమతులు వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము రూపొందించిన వ్యాక్సిన్స్ వివరాలన్నీ భారతీయ ఔషధాలు, ఇతర చికిత్స ప్రక్రియలను నియంత్రించే అత్యున్నత సంస్థ అయిన ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ సంస్థకు కొద్ది రోజుల క్రితమే నివేదించినట్లు భారత్ బయోటెక్ సంస్థకు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. త్వరలోనే తాము ప్రధాని నరేంద్రమోడీకి సైతం విషయాలను విడమరచి చెప్పి, తమ టీకాకు తగిన అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు వివరించారు. ‘‘ఎబోలా వ్యాక్సిన్ గురించి చర్చలు జరుగుతున్న సమయంలో తాము రెండో దశ ప్రయోగాలను అధిగమించి, మూడో దశకు నేరుగా వెళ్లామనీ, ఇప్పుడు కొద్ది మందిలో (శాంపుల్) నమూనా ప్రయోగాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ కృష్ణ ఎల్లా చెప్పారు. తమ ప్రయోగాల ద్వారా రూపొందిన వ్యాక్సిన్ పూర్తి స్థాయి అనుమతులు లభించడానికి దాదాపు 6-8 నెలల సమయం పట్టవచ్చని డాక్టర్ ఎల్లా అంచనా.
ఎలా రూపొందిస్తారీ వ్యాక్సిన్లు...
ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్‌లో కొన్ని రసాయనాలు, ఉష్ణోగ్రత, రేడియేషన్ వంటి అంశాలతో వ్యాధిని కలిగించే వైరస్ మైక్రోబ్‌ను మృతిచెందేలా చేస్తారు. ఇక రీకాంబినెంట్ వైరస్‌లో మన పరిజ్ఞానం సహాయంతో కొన్ని డీఎన్‌ఏలను సమ్మిళితం చేస్తారు.
‘జికా’ విశేషాలు
ఉగాండాలో దోమల బెడద ఎక్కువగా ఉండే ‘జికా అరణ్యం’ పేరిట జికా వైరస్‌కు ఆ పేరు పెట్టారు. ఊళ్లలో తిరిగే కోతులకు జికా వైరస్ సోకినట్లుగా తొలినాళ్లలో గుర్తించారు. అప్పట్లో ఈ వైరస్ మనుషులపై పెద్దగా ప్రభావం చూపిన దాఖలాల్లేవు. 1950లలో భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే కొద్ది ప్రాంతాల్లో మాత్రమే మనుషుల్లో జికా వైరస్ జాడ కనిపించేది.ఇటీవలి కాలంలో జికా వైరస్ భూమధ్యరేఖకు దూరంగా ఉండే ఆయన ప్రాంతాలైన లాటిన్ అమెరికన్ దేశాలు, అమెరికా, యూరోప్‌లోని కొద్ది ప్రాంతాల్లో మనుషులకు సోకినట్లు బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. దాదాపు ఏడు దశాబ్దాల కిందట గుర్తించిన ఈ వ్యాధి ఇటీవలే ఎందుకు ఎక్కువగా వ్యాపిస్తోందనే దానికి కచ్చితమైన కారణాలేవీ బయటపడలేదు. అయితే, వాతావరణ మార్పుల వల్ల... ముఖ్యంగా భూతాపోన్నతి (గ్లోబల్ వార్మింగ్) వల్ల ఈ వ్యాధి ఆయన ప్రాంత దేశాల్లోనూ విస్తరిస్తోందని భావిస్తున్నారు.