ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సీన్‌తో ఏ వ్యాధికైనా చెక్ చెప్పొచ్చు...
మొన్నటికి మొన్న చికెన్ గున్యా.. నిన్న హెచ్1ఎన్1.. నేడు ఎబోలా, జికా వైరస్ ఇలా కొత్తకొత్త వ్యాధులు ముంచుకొస్తున్న తరుణంలో మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఓ చల్లటి వార్త మోసుకొచ్చారు. అన్ని రకాల సంక్రమిత వ్యాధులకు విరుగుడుగా పనిచేసే వ్యాక్సీన్లను అభివృద్ధి చేసేందుకు వీరు ఓ వినూత్నమైన పద ్ధతిని ఆవిష్కరించారు. జీవ కణాల్లోని ఆర్‌ఎన్‌ఏతో కేవలం వారం రోజుల్లో ఎలాంటి వ్యాధికైనా వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేయవచ్చునని వీరు నిరూపించారు. ఆర్‌ఎన్‌ఏ పోగును వైరస్, బ్యాక్టీరియాలతోపాటు ఎలాంటి పరాన్న భుక్కు ప్రొటీన్‌గానైనా మార్చేయవచ్చునని తెలిపారు.
ఇవి కణాల్లోకి ప్రవేశించినప్పుడు ఉత్పత్తి అయ్యే ప్రొటీన్లు శరీర రోగనిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేసి నిర్ధిష్ట వ్యాధికారక వైరస్, బ్యాక్టీరియాలను అడ్డుకుంటుందని ఎంఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ డేనియల్ ఆండర్‌సన్ తెలిపారు. ఎలుకల ద్వారా ఎబోలా, ఇన్‌ఫ్లుయెంజాలతో పాటు మలేరియా కారక బ్యాక్టీరియాపై ప్రయోగాలు జరిపి పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించామని ఆయన వివరించారు. సాధారణ వ్యాక్సీన్ల తయారీకి ఎంతో సమయం పడుతుంది.
కొన్ని వ్యాధులకు సంబంధించినంత వరకు వ్యాక్సీన్లు ప్రమాదరకంగానూ మారవచ్చు. అంతేకాదు సాధారణ వ్యాక్సీన్లు ఆశించిన స్థాయిలో పనిచేస్తాయన్న గ్యారెంటీ కూడా లేదు. ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సీన్లతో ఈ చిక్కులు ఉండవు. జీవకణాలు స్వయంగా వ్యాధిని ఎదుర్కొనే ప్రొటీన్లను ఉత్పత్తి చేయడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ సమర్థవంతంగా స్పంది స్తుంది. ఆర్‌ఎన్‌ఏలతో వ్యాక్సీన్లు అభివృద్ధి చేయవచ్చునన్న ఆలోచన శాస్త్రవేత్తల్లో 30 ఏళ్లుగా ఉన్నా వాటిని జీవకణాల్లోకి చేర్చడం ఎలా అన్న అంశంపై స్పష్టత లేకపోయింది. నానోస్థాయి కణాలతో ఎంఐటీ శాస్త్రవేత్తలు ఈ అడ్డంకిని అధిగమించారు.