జికా వ్యాక్సిన్ తయారీలో భారత్ బయో
ప్రి-క్లినికల్ ట్రయల్స్ దశలో జికావాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న జికా వైరస్‌ను నివారించే రెండు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి జికా వాక్సిన్‌గా ‘జికావాక్’ రికార్డులకు ఎక్కుతుందన్న ధీమాను భారత్ బయోటెక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. జికావాక్ వివరాలను తెలియచేయడానికి బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జికావైరస్ నివారణకు సంబంధించి తొలి పేటెంట్‌కు దాఖలు చేస్తున్న కంపెనీ తమదేనన్నారు.
ఏడాదిన్నర నుంచి దీనిపై పరిశోధనలు చేస్తున్నామని, ప్రస్తుతం ఇది ప్రి క్లినికల్ ట్రయల్స్ దశలో ఉందని, ఒకటి రెండు వారాల్లో ప్రిక్లినికల్ పరీక్షలు మొదలు పెడతామన్నారు. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ను త్వరితగతిన విడుదల చేయడానికి అవకాశమిస్తే ఒకటి రెండేళ్లలో అందుబాటులోకి వస్తుందన్నారు. దోమల నుంచి వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి ఇప్పుడు లాటిన్ అమెరికాను గడగడ లాడిస్తోంది. ఇది ఇంచుమించు మెదడు వ్యాపు వ్యాధిని పోలి ఉంటుందోన్నారు. ఇంతవరకు 13 లక్షల మంది ఈ వ్యాధి బారినపడితే అందులో 4,500 మంది పిల్లలకు ఈ వ్యాధి సంక్రమించినట్లు గణాంకాలు చెపుతున్నాయి.