దోమలు లేకుండా చేసిన గ్రామం
ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలకు ప్రస్తుతం దోమల వల్ల సోకే డెంగ్యూ, చికెన్ గున్యా, ఇప్పుడు దక్షిణ అమెరికా దేశాలను వణికిస్తున్న జికా వైరస్ వ్యాధుల గురించి అసలు భయం లేదు. కారణం ఆ గ్రామాల్లో దోమలు లేకపోవడమే. దోమల బ్రీడింగ్‌కు అసలు అవకాశం లేకుండా వారు మురుగునీరు పారుదల వ్యవస్థను చక్చదిద్దుకోవడమే.
ముఖ్యంగా నాందేడ్ జిల్లా, హిమాయత్‌నగర్ తాలూకా, తెంబూర్ణి గ్రామ ప్రజలు దోమలను నిర్మూలించడంలో సంపూర్ణ విజయం సాధించారు. ఇంటి నుంచి ముందు పారే మురుగునీరు కాల్వ కింద, ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతను నిర్మించారు. ఇంటి నుంచి పారే వృధా నీరును ఎప్పటికప్పుడు ఇంకుడు గుంతలు పీల్చుకుంటున్నాయి. ఎక్కడా దోమల బ్రీడింగ్‌కు అవకాశమే ఉండడం లేదు.
ఈ గ్రామంలో తాము అనేక సార్లు సర్వే జరిపామని, తమకు గ్రామంలో ఒక్క దోమల బ్రీడింగ్ చోటు కూడా కనిపించలేదని, పైగా గ్రామస్థులకు వచ్చే రోగాలు కూడా 75 శాతం తగ్గిపోయాయని నాందేడ్ జిల్లా ఆరోగ్య శాఖాధికారి బాలాజీ షిండే తెలిపారు. ఇంకుడు గుంతల విధానం వల్ల భూగర్భ జలాల శాతం కూడా పెరిగిందని, ఫలితంగా ఈ గ్రామానికి నీటి కరవు కూడా లేకుండా పోయిందని ఆయన వివరించారు. దశాబ్దం క్రితమే గ్రామ సర్పంచ్ ప్రహ్లాద్ పాటిల్ ఈ ఇంకుడు గుంతల విధానానికి దశాబ్దం క్రితమే చేపట్టారు. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత ఉంది. ఈ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకున్న జిల్లా అధికారులు స్వయం ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని పలు గ్రామాల్లో ఇంకుడు గుంతల మురుగునీరు పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.
నాందేడ్‌లో ఇంకుడు గుంతల నిర్మాణానికి వరుసగా నాలుగు రంధ్రాలు చేసిన సిమ్మెంట్ పైపును, ఇసుకను ఉపయోగిస్తున్నారు. ఇటుక ముక్కలు, కంకర రాళ్లు, ఇసుకను ఉపయోగించి ఇంకుడు గుంతలను నిర్మించవచ్చు. ఈ రెండో విధానాన్ని హర్యానాలోని ముందాక, సర్కారిపురి గ్రామాలు అమలు చేస్తూ ఆ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. అక్కడి పథకానికి ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసర్చ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్’ శాస్త్రవిజ్ఞాన సహకారాన్ని అందిస్తోంది. జికా లాంటి వైరస్‌కు ప్రస్తుతానికి వ్యాక్సిన్‌లు లేనందున దోమల బ్రీడింగ్‌ను నిర్మూలించడమే ప్రజలకు అందుబాటులో ఉన్న ఉత్తమ మార్గం.