పెద్దాసుపత్రి నాడి దొరకదంతే! | no nerves found general hospital | Sakshi
Sakshi News home page

పెద్దాసుపత్రి నాడి దొరకదంతే!

Published Thu, Sep 1 2016 12:19 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

పెద్దాసుపత్రి నాడి దొరకదంతే! - Sakshi

పెద్దాసుపత్రి నాడి దొరకదంతే!

‘ఓపి’కుంటేనే చికిత్స
– ఒక్క రోజులే అన్నీ అంటే కష్టం
– డాక్టర్‌ పరీక్షించేది ఒక రోజు
– వైద్య పరీక్షలు మరోరోజు.. చికిత్స ఇంకోరోజు
– చుక్కలు చూస్తున్న రోగులు
– అదష్టం ఉంటే సరి.. లేదంటే?
– పెద్దాసుపత్రిలో వైద్యం దైవాధీనం
 
– కోడుమూరు మండలానికి చెందిన ఎల్లమ్మ కడుపునొప్పితో బాధపడుతూ గత శనివారం సర్జరీ విభాగానికి వెళ్లింది. వైద్యులు పరీక్షించి ఆమెకు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ రాశారు. స్కానింగ్‌ వద్ద ఆమెను సెప్టెంబర్‌ 4న రావాలని చెప్పి పంపించారు. అప్పటి దాకా డాక్టర్‌ రాసిచ్చిన మందులు వాడాలని సూచించారు.
– కష్ణగిరి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన మద్దయ్య జ్వరంతో బాధపడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు చికిత్స కోసం వచ్చాడు. వైద్యులు అతన్ని పరీక్షించి రక్తపరీక్షలు రాశారు. పరీక్షలు చేయించుకుని వచ్చే సరికి వైద్యులు ఓపీ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ రిపోర్ట్‌ ఎవరికి చూపించాలో తెలియక ఆయన వెనుదిరిగి వెళ్లిపోయాడు. 
– కోసిగి ప్రాంతానికి చెందిన మారెప్ప కొంత కాలంగా నడుం నొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం అతను పెద్దాసుపత్రికి వస్తే పరీక్షించిన వైద్యులు ఎంఆర్‌ఐ పరీక్ష రాశారు. అక్కడికి వెళితే.. పరీక్ష చేసేందుకు రెండు వారాల తర్వాత రావాలని గడువు విధించారు.
 
– కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అస్తవ్యస్తంగా మారిన ఓపీ విధానానికి ఇవి ఉదాహరణలు మాత్రమే..
 
కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతిరోజూ 2,500 మందికి పైగా రోగులు ఓపీ చికిత్స కోసం వస్తున్నారు. వీరిలో సగానికి పైగా సాధారణ వ్యాధులతో వచ్చే వారే. వీరందరికీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో చికిత్స అందిస్తే సరిపోతుంది. కానీ అక్కడ వైద్యులు లేక, ఉన్నా నమ్మకం లేక పెద్దాసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. మరికొన్ని గ్రామీణ ఆసుపత్రుల్లోని వైద్యులు సాధారణ వ్యాధులకూ చికిత్స చేయకుండా పెద్దాసుపత్రికి రెఫర్‌ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇలా వచ్చిన రోగులు గంటల తరబడి క్యూలో నిలబడలేక సొమ్మసిల్లిపోతున్నారు. చికిత్స కోసం ఎవరిని అడగాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియక బిక్కమొహం వేస్తున్నారు.
 
ఓపీ టికెట్‌ కావాలంటే ఓపికుండాల్సిందే..
ఆసుపత్రిలో ఓపీ టికెట్‌ ఇచ్చేందుకు ప్రధాన ద్వారం వద్దే స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అత్యవసర వైద్యం కోసం ఒకటి, ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ పరీక్షల కోసం రుసుము వసూలు చేసేందుకు మరో కౌంటర్‌ ఉంది. వీటితో పాటు స్త్రీవ్యాధులు, గర్భిణిలకు చికిత్స, చిన్నపిల్లల వ్యాధులకు మాతాశిశు భవనం వద్ద ప్రత్యేకంగా ఓపీ కౌంటర్‌ నిర్వహిస్తున్నారు. అయితే వందలాదిగా వచ్చే రోగులకు ఈ కౌంటర్లలో అందే సేవలు సరిపోవడం లేదు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఓపీ టికెట్లు ఇస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఆసుపత్రికి వచ్చేలోపు సమయం మీరిపోతుంది. ఫలితంగా వీరు ఓపీ టికెట్‌ తీసుకుని వైద్యుని వద్దకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి అదనంగా మరిన్ని ఓపీ టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు.
 
వైద్య పరీక్షలు చేయించుకోవడానికీ ‘పరీక్షే’..
ఆసుపత్రిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు రోగులకు పరీక్షే. ఓపీ చికిత్సకు వచ్చిన రోగులకు వైద్యులు పలు రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు రాస్తారు. రక్త, మల, మూత్ర పరీక్షలు కొన్ని అదే రోజు రిపోర్ట్‌ ఇస్తారు. కానీ రిపోర్ట్‌ తీసుకుని వచ్చేలోగా వైద్యులు ఓపీ విభాగంలో ఉండటం లేదు. ఇక ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేయించుకుని వచ్చినా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. దీంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆ రిపోర్ట్‌లు పట్టుకుని ఆసుపత్రిలో వైద్యుల కోసం తిరిగే వారు నిత్యం కనిపిస్తారు.
 
రోగులను వెనక్కి పంపొద్దని ఆదేశాలు
ఓపీ చికిత్సకు వచ్చే రోగులు ఇతర ఓపీ దినాల్లో వచ్చినా వారిని వెనక్కి పంపకుండా చికిత్స చేయాలని ఆదేశాలు ఇస్తున్నాం. ఇందుకు సంబంధించి సర్కులర్‌ను బుధవారం జారీ చేస్తాం. దీనివల్ల ఓపీకి వచ్చే రోగులు రిపోర్ట్‌లు తీసుకువచ్చి వెనక్కి వెళ్లకుండా చికిత్స చేయించుకునే అవకాశం కలుగుతుంది. దీన్ని వెంటనే అమల్లోకి తీసుకొస్తాం.
– డాక్టర్‌ జె.వీరాస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement