సాక్షి, కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉన్నా వాటి కళ్లుగప్పి మరీ చోరీ చేస్తున్నారు. దీంతో ఆస్పత్రిలో వైద్యులు, ప్రజలు, రోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రికి వివిధ ప్రాంతాల నుంచి రోజూ ఓపీకి 3వేల మంది దాకా, ఇన్‌పేషంట్లుగా, 1500 మంది చేరుతుంటారు. రోజూ 8 వేల మంది దాకా సహాయకులు వస్తుంటారు.
వీరితో పాటు వైద్యులు, నర్సులు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది కలిసి 2,500 మంది దాకా పనిచేస్తున్నారు. ఇన్ని వేల మంది తిరుగుతున్న ఆస్పత్రిలో సెక్యూరిటీ అధ్వాన్నంగా ఉంది. సెక్యూరిటీ కోసం గత ప్రభుత్వం ఆసుపత్రిలో జై బాలాజీ సెక్యూరిటి ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించింది. ఆ సంస్థ ఐదు నెలలుగా సెక్యూరిటీ గార్డులకు జీతాలు ఇవ్వడం లేదు. దీంతో కొంత మంది ఉద్యోగం మానేశారు. ఉన్న వారిలో అధిక శాతం నిరాశానిస్పృహలతో పనిచేస్తున్నారు.
వరుస దొంగతనాలతో ఆందోళన
ఆస్పత్రిలో ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రధానంగా రద్దీ అధికంగా ఉండే ఓపీ టికెట్లు ఇచ్చే ప్రాంతంలో డబ్బులు తస్కరిస్తున్నారు. ఒక్కో రూపాయి పోగుచేసుకుని ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని వచ్చిన వారి బ్యాగ్‌లను లాఘవంగా బ్లేడ్‌తో కట్ చేసి పర్సులు దొంగిలిస్తున్నారు. ఇదే విధం గా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరి, గైనకాలజి, పీడియాట్రిక్స్, ఎక్స్‌రే విభాగం, అల్ట్రాసౌండ్, సిటి స్కానింగ్, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ల వద్ద దొంగలు మాటు వేసి మరీ చోరీకి పాల్పడుతున్నారు. ఇవేగాక వార్డులో చికిత్స పొందుతున్న వారి వద్దకు వైద్యులుగా వైద్యసిబ్బందిలాగా వెళ్లి డబ్బులు, సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్నారు.
సీసీ కెమెరాల తీగలు కత్తిరించి...
ఆస్పత్రిలో రక్షణకు, దొంగతనాలు, గొడవల నివారణకు గాను లక్షల రూపాయలు వెచ్చించి 185 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గత ఎనిమిదేళ్లలో నాలుగుసార్లు కెమెరాలు మార్చారు. అయితే కెమెరా కంట పడితే దొరికిపోతామని దొంగలు వాటి తీగలు కట్ చేస్తున్నారు. ఈ మేరకు ఆస్పత్రిలోని 185 కెమెరాల్లో 35కి పైగా కెమెరాలు పనిచేయడం లేదు. ప్రధానంగా రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో తీగలు వరుసగా కట్ చేస్తున్నారు. దీంతో చోరీ ఘటనలు చూసే అవకాశం లేకుండా పోతోందని వైద్యులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరుస చోరీ సంఘటనలు
- జనరల్ సర్జరీ విభాగంలో సెకండియర్ పీజీ చదువుతున్న డాక్టర్ ప్రవీణ్ గత శనివారం రాత్రి 12.30 గంటలకు హాస్టల్‌కు వచ్చి తన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్(ఏపీ39 ఎఫ్ 0809)ను బయట లాక్ చేసి వెళ్లాడు. ఉదయం వచ్చి చూసే సరికి బైక్ కనిపించలేదు. దీని విలువ దాదాపు రూ.2లక్షలు. మూడు రోజుల నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్నా స్పందన లేదని ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
- ఆసుపత్రిలో హౌస్‌సర్జన్ చేస్తున్న డాక్టర్ సతీష్ గత నెల 29వ తేదీన క్యాజువాలిటి ఎదురుగా బైక్‌ను పార్క్ చేసి లోపలికి వెళ్లాడు. బయటకు వచ్చేలోగా బైక్ కనిపించలేదు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆసుపత్రితో పాటు ప్రధాన రహదారుల్లో సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ దొంగ చోరీ చేసినట్లు గుర్తించారు. అయితే అందులో దొంగ ముఖం స్పష్టంగా కనిపించలేదు.
- ఓర్వకల్లుకు చెందిన రామక్క తన భర్తకు చికిత్స చేయించేందుకు గత నెల 18న ఆసుపత్రికి వచ్చారు. ఓపీ కౌంటర్‌వద్ద ఓపీ టికెట్ తీసుకుని బయటకు వచ్చేలోగా చేతి కవర్‌లోని డబ్బులను తస్కరించారు. కవర్‌ను బ్లేడ్‌తో కత్తిరించి, అందులోని డబ్బుల కవర్‌ను చోరీ చేశారు. దీంతో ఆమె రోదిస్తూ ఇంటికి వెళ్లిపోయింది.
- నందికొట్కూరుకు చెందిన ధనుంజయ కడుపునొప్పితో బాధపడుతూ గత నెల 26న ఆస్పత్రికి వచ్చాడు. వైద్యులు పరీక్షించి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించాలని రాశారు. స్కానింగ్ చేయించుకుని బయటకు వచ్చేలోగా అతని తమ్ముని వద్ద ఉన్న పర్సును దొంగలు కొట్టేశారు.
Comments
Please login to add a commentAdd a comment