వరల్డ్ హార్ట్ డే ఉత్సవాల గురించి వివరిస్తున్న కార్డియాలజిస్టు డాక్టర్ పి. చంద్రశేఖర్
– కేఎంసీలో వైద్యవిజ్ఞాన సదస్సు
– సునయనలో అవగాహన సదస్సు
కర్నూలు(హాస్పిటల్): వరల్డ్ హార్ట్ డే ఉత్సవాలను ఈ నెల 25న ఘనంగా నిర్వహించనున్నట్లు కార్డియాలజిస్టు, కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ పి. చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజి విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 9 గంటలకు కళాశాలలోని క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో కార్డియో సీఎంఈ–2016 సదస్సు ప్రారంభమవుతుందన్నారు. అడ్వాన్సెస్ ఇన్ కార్డియాక్ ఇమేజింగ్‌పై డాక్టర్ షేక్ మౌలాలి(విజయవాడ), రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ది మేనేజ్‌మెంట్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్‌పై డాక్టర్ ఎస్. శరత్‌చంద్ర(హైదరాబాద్), హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎ స్టేట్ ఆఫ్ ఆర్ట్ సర్జరీపై డాక్టర్ ఆర్‌వీ కుమార్(హైదరాబాద్), డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇన్ ది మేనేజ్‌మెంట్ ఆఫ్ అక్యూట్ కరొనరి సిండ్రోమ్‌పై డాక్టర్ పి. రమేష్‌బాబు(విజయవాడ) ప్రసంగిస్తారన్నారు.
సాయంత్రం కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సునయన ఆడిటోరియంలో వరల్డ్ హార్ట్ డే ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ముఖ్య అతిథిగా శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్ హాజరవుతారన్నారు. గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ టు సేవ్ హ్యూమన్ లైఫ్ అనే అంశంపై విజయవాడకు చెందిన డాక్టర్ పి. రమేష్‌బాబు వివరిస్తారన్నారు. స్టేట్ అవార్డు గ్రహీత కె. అంజలిచే కూచిపూడి నృత్యం, స్వరసామ్రాట్ డాక్టర్ శరత్‌చంద్ర బృందంచే సంగీత విభావరి కార్యక్రమాలు ఉంటాయన్నారు. కార్యక్రమానికి రాయలసీమ జోన్ ఐజీ ఎన్. శ్రీధర్‌రావు, డీఐజి బీవీ రమణకుమార్, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ సి. ప్రభాకర్‌రెడ్డి, అనెస్తీషియా విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వర్, డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి, డాక్టర్ కొండారెడ్డి, కార్డియాలజిస్ట్ డాక్టర్ మహమ్మద్ అలి పాల్గొన్నారు.