దిష్టిబొమ్మతో శవయాత్ర
కర్నూలు(హాస్పిటల్): వేతనాలు పెంచాలని కోరుతూ గురువారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు.. కాంట్రాక్టర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎన్. మనోహర్ మాణిక్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మునెప్ప మాట్లాడుతూ.. కనీస వేతనాలు ఇవ్వాలని 18 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నా.. కాంట్రాక్టర్, అధికారులు స్పందించడం లేదన్నారు. వేతనాలు పెంచకుండా కార్మికుల కడుపుకొడితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సి. రమణ, ఎస్. యేసు, రామునాయక్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు నల్లన్న, నరసింహులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.